• తాజా వార్తలు
  •  

స్నాప్ చాట్ కు జుకర్ బర్గ్ షాట్

రెండేళ్ల కిందట భారత్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయిన స్నాప్ చాట్ సీఈవో కారణంగా ఆ సంస్థపై భారతీయు టెకిజన్లు పెద్ద యుద్ధమే ప్రకటించారు. మనోళ్ల దెబ్బకు స్నాప్ చాట్ రేటింగ్ పాతాళానికి పడిపోయింది. అయితే.. టెక్ ఇండస్ర్టీలోనూ స్నాప్ చాట్ సీఈవో వ్యాఖ్యలకు ఏమాత్రం ఆమోదం లభించలేదు. ప్రత్యక్షంగా ఇప్పటికే కొందరు దీన్ని వ్యతిరేకించగా తాజాగా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కూడా స్నాప్ చాట్ సీఈవోకు పరోక్షంగా చురకలు అంటించారు.
చెత్తయాప్..
స్నాప్ చాట్ సీఈవో వ్యాఖ్యలతో భారతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్పీగల్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయులకు స్నాప్ చాట్ లాంటి చెత్త యాప్ లు అవసరం లేదంటూ మండిపడ్డారు. దీంతో, తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు స్పీగల్. అయినా, అప్పటికే నష్టం జరిగిపోయింది.
జుకర్ బర్గ్ కౌంటర్
ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ, స్నాప్ చాట్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఫేస్ బుక్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ అనేది ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే కాదని.. టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడాలని చెప్పారు. ఫేస్ బుక్ ఉన్నత వర్గాలవారికి మాత్రమే కాదని... అందరి కోసం అని చెప్పారు.
ఇండియా ఎంత కీలకమో తెలుసా?
కాగా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ చాలాకాలంగా భారత్ తో మంచి సంబంధాలు మెంటైన్ చేస్తున్నారు. ఇక్కడ వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తుండడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వాలతో కలిసి పలు డిజిటల్ ఇనియేషిటివ్స్ కు తెరతీశారు. భారత దేశ జనాభా... ఇంటర్నెట్ పెనెట్రేషన్ కూడా వేగవంతంగా ఉండడం.. మొబైల్ నెట్ వర్క్ గ్రామీణ ప్రాంతాలకూ పెద్ద ఎత్తున విస్తరిస్తుండడం.. స్మార్టు ఫోన్ల మార్కెట్లోనూ భారత్ టాప్ లో ఉండడంతో సోషల్ మీడియాకు ఇండియా అతి పెద్ద మార్కెట్ గా ఉంది. దీంతో భారత్ కు ఫేస్ బుక్ మంచి ప్రాధాన్యం ఇస్తోంది. కానీ... స్నాప్ చాట్ వంటి సంస్థలు మాత్రం ఇక్కడ ఏమాత్రం విస్తరించలేకపోతున్నాయి. చాలా తక్కువ సంఖ్యలో ఇక్కడ స్నాప్ చాట్ వినియోగదారులున్నారు. తాజా పరిణామంతో ఉన్న వినియోగదారుల్లోనూ 90 శాతం మంది డ్రాప్ అయిపోయినట్లు అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

జన రంజకమైన వార్తలు