• తాజా వార్తలు
  •  

ఐఫోన్ యాడ్ లో అంత మోసం ఉందా?


మొబైల్ ఫోన్లు, ఈ-కామ‌ర్స్ సైట్లు, వ్యాల‌ట్లు.. ఇలా అన్నిటికీ ప్ర‌చారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయ‌తే, ఆ ప్రచారంలో పార‌ద‌ర్శ‌క‌త ఉండ‌డం లేద‌ట‌. పెద్ద‌పెద్ద సంస్థ‌లు కూడా త‌మ ప్ర‌చార ప‌ర్వంలో మోసాల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని తేలింది. ఇలా త‌ప్పుదారిప‌ట్టించేలా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే సంస్థ‌ల బండారం బ‌య‌ట‌పెట్టింది అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ స్టాండ‌ర్డ్స్ కౌన్సిల్. ప్ర‌పంచ‌మంతా కొనియాడే యాపిల్ సంస్థ కూడా త‌న ప్ర‌క‌ట‌న‌ల్లో వినియోగ‌దారుల‌ను బోల్తా కొట్టిస్తోంద‌ని బ‌య‌ట‌పెట్టింది.అందుకు ఉదాహ‌ర‌ణ‌లు కూడా చూపించింది.
అది ఐఫోన్ 7 కాదు..
యాపిల్‌ ఐఫోన్‌ 7 ప్రకటనను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఒక విష‌యం తెలుస్తుంది. నిజానికి ఆ ప్రకటనలో చూపించేది ఐఫోన్‌ 7 కాదు. ఐఫోన్‌ 7ప్లస్‌. అంటే బెట‌ర్ ప్రాడ‌క్ట్ చూపించి ఆక‌ర్షించి ఇత‌ర ప్రాడ‌క్టుల‌ను అమ్ముకోవ‌డానికి యాపిల్ వేసిన ఎత్తుగ‌డ అది. యాపిల్ త‌ర‌హాలోనే 143 వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉంటున్నాయ‌ట‌. భారతీ ఎయిర్‌టెల్‌, కోకోకోలా వంటి పాపుల‌ర్ కంపెనీల‌న్నీ ఇలాంటి ప‌నిచేస్తున్నాయ‌ట‌.
మొబిక్విక్ పైనా ఫిర్యాదు
మొబిక్విక్, హిందూస్తాన్‌ యునిలీవర్, నివియా, అముల్, ఓపెరా, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ తదితర సంస్థలకు సంబంధించి 191 ఫిర్యాదులు ఏఎస్‌సీఐ ఆధ్వర్యంలోని ఫిర్యాదుల కౌన్సిల్‌కు ముందుకు వచ్చాయి. వీటిలో 143 ప్రకటనలు నిజంగానే తప్పుదోవ పట్టిస్తున్నవిగా ఏఎస్‌సీఐ తేల్చింది. వీటిలో ఆరోగ్య రంగానికి చెందినవి 102, విద్యా రంగ ప్రకటనలు 20, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో 7, ఆహార పానీయాల విభాగంలో 6, ఇతర విభాగాల నుంచి 8 ఉన్నాయి. సో... ఇక నుంచి ఎంత పెద్ద సంస్థ‌యినా ప్ర‌క‌ట‌న‌లో చూపించింది నిజ‌మ‌ని గుడ్డిగా న‌మ్మేయొద్దు సుమా.

జన రంజకమైన వార్తలు