• తాజా వార్తలు
  •  

ట్రంప్ చేతిలో.. ఐ ఫోన్‌!!!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌.. యాపిల్ ఐ ఫోన్ వాడుతున్నారు. ఇందులో వింతేముంది ? మన చుట్టుప‌క్క‌లే చాలా మంది ఐఫోన్ లేటెస్ట్ వెర్ష‌న్లు వాడేస్తుంటే.. ప్ర‌పంచంలో ప‌వ‌ర్‌ఫుల్ వ్య‌క్తి అయిన అమెరికా ప్రెసిడెంట్ ఐ ఫోన్ యూజ్ చేస్తే విశేష‌మా? 100 కోట్ల రూపాయ‌ల కారులో తిరిగే ట్రంప్‌.. ల‌క్ష రూపాయ‌ల ఐ ఫోన్ వాడితే గొప్పేంటి? అనుకుంటున్నారా.. అయితే యాపిల్ ఐ ఫోన్‌కు, డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న రిలేష‌నేమిటో చ‌దవండి..
బాయ్‌కాట్ యాపిల్‌ అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ పోటీ చేస్తున్న‌ప్పుడు ప్ర‌చారంలో భాగంగా ఓ స‌ద‌స్సులో యాపిల్‌ను బ‌హిష్క‌రించండి అని అమెరిక‌న్ల‌కు పిలుపు ఇచ్చారు. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినోలో ఓ టెర్రరిస్ట్‌ను అమెరిక‌న్ పోలీసులు కాల్చిచంపారు. అత‌ని దగ్గ‌రున్న ఐఫోన్‌ను అన్‌లాక్ చేయ‌మ‌ని అమెరిక‌న్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎఫ్ బీఐ యాపిల్‌ను కోరింది. అయితే ఇది యాపిల్ సెక్యూరిటీ ఇష్యూ అని, అలా చేస్తే తాము ఐ ఫోన్ సెక్యూరిటీకి బ్యాక్ డోర్ తెరిచిన‌ట్ల‌వుతుంద‌ని యాపిల్ దాన్ని తిర‌స్క‌రించింది. దీంతో ఆ ఫోన్‌ను అన్‌లాక్ చేసేవ‌ర‌కు యాపిల్ ప్రొడ‌క్ట్స్‌ను బాయ్‌కాట్ చేయ‌మ‌ని ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే అదే స‌మ‌యానికి ట్రంప్ ద‌గ్గ‌రున్న ఐ ఫోన్ నుంచి ఎల‌క్ష‌న్ వ్య‌వ‌హారంపై ట్వీట్లు వ‌స్తుండ‌డంతో ట్రంప్ ఇబ్బంది ప‌డ్డారు. వెంట‌నే తేరుకుని నా ద‌గ్గ‌ర ఆండ్రాయిడ్ (శ్యాంసంగ్‌), ఐఫోన్ రెండూ ఉన్నాయి. కానీ ఫోన్ అన్‌లాక్ వ్య‌వహారం తేలేవ‌ర‌కు నేను ఐ ఫోన్ వాడ‌న‌ని తెగేసి చెప్పారు. అంతేకాదు మీరు కూడా యాపిల్ ప్రొడ‌క్ట్ ల‌ను బాయ్‌ కాట్ చేయండ‌ని అమెరిక‌న్ల‌ను కోరారు.
ఇదీ లోగుట్టు అయితే ట్రంప్‌కు యాపిల్‌కు మ‌ధ్య వివాదం ఇదొక్క‌టే కాదు. ట్రంప్‌కు వ్య‌తిరేకంగా పోటీ చేసిన హిల్ల‌రీ క్లింట‌న్‌కు యాపిల్ మ‌ద్దతుగా నిలిచింది. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ హిల్ల‌రీకి మ‌ద్ద‌తుగా ఫండ్ రైజింగ్ కూడా చేశారు. యాపిల్ ఐఫోన్ల‌ను అమెరికాలో త‌యారు చేయాల‌ని కూడా ట్రంప్ ప‌ట్టుబ‌ట్టారు. ఐఫోన్లు చైనాతోపాటు ఆసియా దేశాల్లో త‌యార‌వుతాయి. అమెరికాలో త‌యారు చేయాలంటే ఇక్క‌డ టెక్నిక‌ల్‌గా కుద‌ర‌ద‌ని, కాస్ట్ కూడా ఎక్కువవుతుంద‌ని యాపిల్ ట్రంప్ ప్ర‌తిపాద‌న‌ను తోసిపుచ్చింది. ఇవ‌న్నీమ‌న‌సులో పెట్టుకునే ట్రంప్ యాపిల్ ప్రొడ‌క్ట్‌ల‌ను బాయ్‌కాట్ చేయ‌మంటున్నార‌ని అప్ప‌ట్లో పెద్ద దుమారం రేగింది.
సెక్యూరిటీ ప్రాబ్లం ఐఫోన్‌ను వాడ‌న‌ని చెప్పిన ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యాక ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ప‌నిచేసే శ్యాంసంగ్ ఫోన్‌నే వాడుతున్నారు. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప‌రంగా యాపిల్ అంత సెక్యూర్డ్ కాద‌ని అమెరిక‌న్ భ‌ద్ర‌తాద‌ళాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల కొన్ని రోజులుగా ట్రంప్ ట్వీట్లు ఐ ఫోన్ నుంచి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ ట్వీట్‌లు ట్రంపే చేస్తున్నారా? ఆయ‌న రిప్రంజెంటేటివ్స్ ఎవ‌ర‌యినా చేస్తున్నారా అనేది ఇంకా తేల‌లేదు.

జన రంజకమైన వార్తలు