• తాజా వార్తలు
  •  

వైట్ హౌస్ లో వాడే మెసేజింగ్ యాప్ కూడా సురక్షితం కాదట

* కాన్ఫైడ్ యాప్ పై అమెరికాలో కంప్లయింట్

అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ అంటే అత్యంత భద్రమైన ప్రదేశం. నిత్యం వేలాది మంది రక్షణ కవచంగా ఉంటారు. అక్కడి వ్యక్తులు, ఆస్తులు, పత్రాలకే కాదు.. కమ్యూనికేషన్ కు కూడా అంతే భద్రత ఉండేలా చూస్తారు. అందుకే అక్కడ పనిచేసేవారు ఎవరూ కూడా అధికారిక కమ్యూనికేషన్ కోసం సొంత మెయిల్ ఐడీలు కానీ, ఇతర ప్లాట్ ఫాంలలోని సొంత అకౌంట్లను కానీ వాడరు. అంతేకాదు... వైట్ హౌస్ లో పనిచేసే అధికారులు కూడా పూర్తి సురక్షితమైన మెసేజింగ్ యాప్స్ నే వాడుతారని చెబుతారు. వైట్ హౌస్ అధికారులంతా CONFIDE అనే ఎన్ క్రిప్టెడ్ యాప్ వాడుతారని అంటారు. అయితే... అదేమీ సురక్షితం కాదంటూ తాజాగా మన్ హట్టన్ ఫెడరల్ కోర్టులో కేసు పడడంతో ఇది చర్చనీయంగా మారింది.

కమ్యూనికేషన్ ను అత్యంగా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతుందని చెప్పే కన్ఫైడ్ యాప్ ఆ సంస్థ చెబుతున్నట్లుగా అత్యంత సురక్షితమైనదేమీ కాదన్నది ఫిర్యాదు. మన్ హట్టన్ కు చెందిన జెరెమీ ఆమన్ ఈ ఫిర్యాదు చేశారు. కాన్ఫైడ్ లో సందేశాలను చదివేసిన తరువాత అవేవీ ఆటోమేటిగ్గా డిలీట్ కావు కాబట్టి సురక్షితమైనవని చెప్పలేం. అలాగే.. స్క్రీన్ షాట్ తీసుకునే వీలుంది కాబట్టి సురక్షితం ఎంతమాత్రం కాదన్నది ఫిర్యాదుదారు వాదన.

జెరేమీ ఆమన్ 7 డాలర్లు పెట్టి కాన్ఫైడ్ యాప్ లో సభ్యత్వం తీసుకున్నారు. ఆ సంస్థ ప్రచారం ప్రకారం అందులో వచ్చే సందేశాలు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటాయని.. స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుందని నమ్మారు. అయితే... మెసేజిలు సేవ్ చేసుకునే వీలు కలుగుతుండడం.. ఎంతసేపయినా డిలీట్ కాకపోవడంతో సురక్షిత కాదంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో వైట్ హౌస్ వర్గాల అధికారిక కమ్యూనికేషన్లు ఎంతవరకు భద్రమన్న ప్రశ్న తలెత్తుతోంది.