• తాజా వార్తలు

త్వరలో ఇండియాలో డాటా బూత్ లు



మొబైల్ ఫోన్ విప్లవం రాకముందు కాయిన్ బాక్సులు కొన్నాళ్లు రాజ్యమేలాయి. అంతకుముందు నుంచి పబ్లిక్ కాల్ ఆఫీస్(పీసీఓ)లు ఉన్నాయి. వీటిని టెలిఫోన్ బూత్ అనేవారు. అయితే... మొబైల్ ఫోన్లు వచ్చాక అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు పీసీవోలు కాకపోయినా అదే తరహాలో పబ్లిక్ డాటా ఆఫీస్(పీడీవో)లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ సీ-డాట్ వీటిని డెవలప్ చేస్తోంది.

500 మీటర్ల రేడియస్ లో..
పీడీవోల్లో మొబైల్ ఫోన్ వినియోగదారులకు చౌకగా వై-ఫై సేవలందించనున్నారు. వీటిని కిరాణా షాపులు, చిల్లర దుకాణాలతోపాటు తోపుడు బండ్లలో సైతం ఇన్‌స్టాల్ చేయవచ్చు. వీటి ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు చౌక వై-ఫై డాటా ప్యాక్‌లను విక్రయిస్తారు. పీడీవో నుంచి 2జీ, 3జీ, 4జీ సిగ్నల్స్ ద్వారా వై-ఫై హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసి 500 మీటర్ల పరిధిలో ఏక కాలంలో వంద మొబైళ్లకు నెట్ సౌకర్యం అందించే వీలుంటుంది. ఇది ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు అంతంతమాత్రంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ పీడీవోల్లో మొబైల్ టవర్ల నుంచి నేరుగా సిగ్నళ్లు అందుకునే ఏర్పాట్లు చేస్తారు. సిమ్ కానీ, కేబుల్ తో నడిచే నెట్ సౌకర్యం లేకుండానే ఇది పనిచేస్తుంది.

రిటైల్ ఇంటర్నెట్ లో విప్లవం
ఇప్పటివరకు దేశంలో నెట్ వర్క్ ప్రొవైడర్లు మాత్రమే రిటైల్ ఇంటర్నెట్ ఇస్తున్నారు. పీడీవోలు వస్తే ఈ గుత్తాధిపత్యం తగ్గుతుంది. ఈ పీడీవో టెక్నాలజీని ఇండియన్ టెలికాం, ఇంటర్నెట్ ఎక్విప్ మెంటు తయారు చేసే సంస్థలకు సీడాట్ ఇవ్వనుంది. ఈ పరికరాల ధర రూ.50 వేల వరకు ఉండొచ్చని అంచనా.

జన రంజకమైన వార్తలు