• తాజా వార్తలు
  •  

గూగుల్ లొకేష‌న్‌.. మీరెక్క‌డున్నా చెప్పేస్తుంది

గూగుల్‌.. ఇది పేరుకే సెర్చ్ ఇంజిన్ కానీ స‌ర్వాంత‌ర్‌యామి అని చెప్పొచ్చు. కేవ‌లం కంప్యూట‌ర్లో మ‌న‌కు కావాల్సిన వివ‌రాల‌ను వెతికిపెట్ట‌డ‌మే కాదు వినియోగ‌దారుల‌కు అవ‌స‌రమైన కీలక సేవ‌లను తీర్చ‌డానికి ఈ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం ఎప్పుడూ ముందంజ‌లో ఉంటుంది. స్మార్టుఫోన్ల విప్లవం నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. కేవ‌లం కాల్స్‌కు మాత్ర‌మే ఫోన్ల‌ను ఉప‌యోగించే రోజులు పోయాయి. ఇంట‌ర్నెట్ వాడ‌క‌మే ప్ర‌ధానంగా ఫోన్ల‌ను కొనుగోలు చేస్తున్నారు వినియోగ‌దారులు. అలాంటి వారి కోసం గూగుల్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు మంచి ఆప్ష‌న్ల‌ను అంద‌జేస్తోంది. అందులో కీల‌క‌మైంది గూగుల్ లొకేష‌న్‌. ఒక‌ప్పుడు ఎక్క‌డికైనా వెళ్లాలంటే చాలా తిప్ప‌లు. తెలియ‌ని ప్ర‌దేశంలో అడుగుపెట్టిన త‌ర్వాత ఫ‌లానా అడ్రెస్ కావాలంటే ఎంతమందిని అడిగినా స‌రైన స‌మాధానం వ‌చ్చేది కాదు. పైగా చెప్పిన వాళ్లు రాంగ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇచ్చినా.. మ‌నం త‌ప్పుగా అర్థం చేసుకున్నా ఎంతో స‌మ‌యం వృథా. శ్ర‌మ వృథా. ఈ ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌డానికి గూగుల్ మ్యాప్స్ స్మార్టుఫోన్ వినియోగ‌దారుల‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. మ‌న గ‌మ్య స్థాన‌మెంటో జస్ట్ గూగుల్ మ్యాప్‌లో టైప్ చేసి స్టార్ట్ బ‌ట‌న్ నొక్కితే చాలు మ‌నం ఎక్క‌డికి వెళ్లాలో అక్క‌డ అడ్రెస్‌కు చేరుస్తుంది ఈ యాప్.
గూగుల్ లొకేష‌న్‌
గూగుల్ మ్యాప్ కొత్త‌గా స‌మ‌ర్పిస్తుంది గూగుల్ లొకేష‌న్‌. దీని ద్వారా మ‌నం ఎక్క‌డ ఉన్నామో మ‌న ఆప్తులు సుల‌భంగా తెలుసుకోచ్చు. మ‌నం చేయాల్సింద‌ల్లా మ‌న స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఆప్ష‌న్ ఉంచుకోవ‌డ‌మే. మ‌నం ఏదైనా దూర ప్రాంతాల‌కు ఒంట‌రిగా వెళ్లిన‌ప్పుడు కొంచెం బెరుకుగానే ఉంటుంది. తెలియ‌ని ప్రాంతం.. తెలియ‌ని మ‌నుషులు ... అనే ఫీలింగ్! ముఖ్యంగా అమ్మాయిల‌కు ఈ ఇబ్బంది చాలా ఎక్కువ‌. అందుకే గూగుల్ కొత్త తెర‌మీద‌కు తెచ్చింది గూగుల్ లొకేష‌న్ ఆప్ష‌న్‌. మ‌నం ప్రయాణాల్లో ఉన్న‌ప్పుడు ఎక్క‌డికి వెళుతున్నామో.. ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నామో.. మ‌రికొద్దిసేప‌ట్లో ఎక్క‌డికి వెళ్ల‌బోతామో లాంటి అంశాల‌ను మ‌నం స్నేహితుల‌కు, బంధువుల‌కు పంపించుకోవ‌చ్చు. ఫేస్‌బుక్‌లో చెక్డ్ ఇన్ అనే ఒక ఆప్ష‌న్ ఉంది. అంటే మ‌నం ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నామో తెలిపే ఆప్ష‌న్ అది. అయితే దీన్ని చాలా త‌క్కువ‌మంది ఉప‌యోగిస్తారు. అందుకే గూగుల్ లొకేష‌న్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.
రియ‌ల్ టైమ్ షేరింగ్‌
మ‌నం ఎక్క‌డ ఉన్న‌ది.. ఏం చేస్తుంది అనే విష‌యాల‌ను గూగుల్ లొకేష‌న్ ఆప్ష‌న్ ద్వారా రియ‌ల్ టైమ్‌లో షేర్ చేసుకునే అవ‌కాశఃం ఉంటుంది. దీని వ‌ల్ల మ‌నం ఎక్క‌డ ఉన్నామో మ‌న‌వాళ్ల‌కు వెంట‌నే తెలిసిపోతుంది. మ‌న లొకేష‌న్ వివ‌రాల‌ను మ‌నం మూడు రోజుల వ‌ర‌కు మ‌న బంధువులు, స్నేహితుల‌కు పంపే అవ‌కాశం ఉంది. కొన్ని స్పెసిఫిక్ ట్రిప్‌ల‌కు సంబంధించిన డేటాను కూడా షేర్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల‌తో పాటు ఐఓఎస్ ద్వారా కూడా స‌దుపాయాన్ని వాడుకోవ‌చ్చు. మ‌నం షేర్ చేసిన స‌మాచారం కూడా సుర‌క్షితంగా ఉంటుంద‌ని గూగుల్ చెప్పింది. ఏదేమైనా గూగుల్ అందిస్తున్న ఈ కొత్త లొకేష‌న్ ఆప్ష‌న్ మ‌న భ‌ద్ర‌త‌కు ప‌క్కా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.

జన రంజకమైన వార్తలు