• తాజా వార్తలు
  •  

గూగుల్ ఎర్త్ కొత్త రూపం ఇదీ..


గూగుల్ పదిహేనేళ్ల క్రితం విడుదల చేసిన గూగుల్ ఎర్త్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పీసీల్లో సాఫ్ట్‌వేర్ రూపంలో లభ్యమయ్యే దీన్ని ఇన్ స్టాల్ చేసుకుని వాడాల్సి వచ్చేంది. పీసీలో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయకుండానే నేరుగా ఇంటర్నెట్ బ్రౌజర్ నుంచే గూగుల్ ఎర్త్‌ను చూడవచ్చు. అందుకు గాను గూగుల్ తన ఎర్త్ అప్లికేషన్‌కు చెందిన వెబ్ వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. అయితే ఇది కేవలం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. విండోస్ పీసీల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్న యూజర్లు గూగుల్ ఎర్త్‌ను అందులో ఓపెన్ చేయవచ్చు. అందుకు వారు ఆ బ్రౌజర్ అడ్రస్ బార్‌లో https://www.google.com/earth/ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే చాలు అప్పుడు గూగుల్ ఎర్త్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో భూమికి చెందిన 3డీ ఇమేజ్ వస్తుంది. దాన్ని జూమ్ ఇన్, ఔట్ చేయడం ద్వారా భూమిపై ఉన్న ఏ ప్రాంతాన్నయినా వీక్షించవచ్చు. అలా జూమ్ ఇన్, ఔట్ చేసేందుకు మౌస్ స్క్రోలింగ్ వీల్ ఉపయోగపడుతుంది. మౌస్‌కు చెందిన లెఫ్ట్, రైట్ బటన్ల ద్వారా ఎర్త్ ఇమేజ్‌ను అటు, ఇటు మూవ్ చేయవచ్చు.
జీమెయిల్‌తో లాగిన్ అయితే..
గూగుల్ ఎర్త్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఫీచర్లలో ముఖ్యమైన ఫీచర్లు ఈ వెబ్ వెర్షన్ గూగుల్ ఎర్త్‌లో లభిస్తున్నాయి. యూజర్లు తమ జీమెయిల్‌తో సైనిన్ అయితే తమ తమ ప్లేస్‌లను సేవ్ చేసుకోవచ్చు. మ్యాప్స్ స్టైల్స్ ను కూడా మార్చుకోవచ్చు. మ్యాప్ ఎంత వేగంగా లోడ్ అవ్వాలో సెట్టింగ్స్ ఆప్షన్‌లో సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లను గూగుల్ ఎర్త్ వెబ్‌సైట్‌లో ఎడమ వైపు యాక్సెస్ చేయవచ్చు. అదేవిధంగా కుడివైపు కింది భాగంలో యూజర్లకు 3డీ/2డీ వ్యూ, స్ట్రీట్ వ్యూ, నావిగేషన్, లొకేషన్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి.
వాయేజర్ ఫీచర్
గూగుల్ సంస్థ తన ఎర్త్ అప్లికేషన్‌కు చెందిన వెబ్ వెర్షన్‌ను విడుదల చేయడంతోపాటు యూజర్లకు కొత్తగా Voyager పేరిట మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో ప్రపంచంలో ఉన్న ప్రముఖ ప్రదేశాలకు చెందిన వివరాలను తెలుసుకోవచ్చు. ఆయా ప్రాంతాలను 3డీలో గైడెడ్ టూర్ సహాయంతో వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కింద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20వేలకు పైగా ప్రముఖ ప్రాంతాలు 3డీ వ్యూ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వాటిని 3డీ స్ట్రీట్ వ్యూలో చూడవచ్చు. దీంతో ఆయా ప్రదేశాల్లో ఉండి వాటిని వీక్షిస్తున్న భావన కలుగుతుంది. ఇకపై వారానికి 50 ప్రదేశాలను వాయేజర్ లో కొత్తగా పెట్టనున్నారు.
ట్రావెల్ నేచర్
గూగుల్ ఎర్త్ వెబ్ వెర్షన్‌లో ఉన్న వాయేజర్ ఫీచర్‌లో ఎడిటర్స్ పిక్స్, ట్రావెల్, నేచర్, కల్చర్, హిస్టరీ అనే విభాగాల కింద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రదేశాల వివరాలు లభిస్తున్నాయి. వాటిని యూజర్లు వీక్షించవచ్చు. అందుకు గాను వెబ్ వెర్షన్‌లో ఎడమ వైపు భాగంలో ఉన్న మెనూను క్లిక్ చేసి అందులో వచ్చే వాయేజర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం దాంట్లో ముందు చెప్పిన విభాగాలు వస్తాయి. వాటిలో దేన్ని ఎంపిక చేసుకుంటే ఆ విభాగానికి చెందిన ప్రదేశాలను చూడవచ్చు. ఇదే సెక్షన్‌లో త్వరలో మరిన్ని ప్రదేశాలను అందివ్వనున్నారు.
కొద్దిరోజుల్లో ఇతర బ్రౌజర్లకూ
గూగుల్ ఎర్త్ వెబ్ వెర్షన్ ఇప్పటికైతే క్రోమ్ బ్రౌజర్‌లోనే లభిస్తోంది. త్వరలోనే మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఓపెరా వంటి బ్రౌజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అయితే గూగుల్ ఎర్త్‌కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ఇప్పటికే సంబంధిత యాప్ స్టోర్‌లలో లభిస్తున్నాయి. వాటిని యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుని తమ తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంతో గూగుల్ ఎర్త్‌ను ఆయా యాప్స్‌లో వీక్షించవచ్చు. కాగా గూగుల్ ఎర్త్ ఆండ్రాయిడ్ యాప్ ప్రస్తుతానికైతే భారత్‌లోని యూజర్లకు అందుబాటులో లేదు. త్వరలో దీన్ని మన దగ్గర కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

జన రంజకమైన వార్తలు