• తాజా వార్తలు
  •  

ఇక మరింత కరెక్టుగా గూగుల్ ట్రాన్సలేషన్

గూగుల్ ఇండియా విభాగం ఇక్కడ ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి ఆదరణ పొందేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో దూసుకెళ్తోంది. తాజాగా తన ఆన్ లైన్ ట్రాన్సలేషన్ టూల్ ను మరింత మెరుగుపరచడమే కాకుండా కొత్తగా మరో 11 రీజనల్ లాంగ్వేజెస్ కు విస్తరించింది.

గూగుల్ ట్రాన్సలేషన్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటికే గూగుల్ ట్రాన్సలేషన్లో ఇండియాలోని 11 రీజనల్ లాంగ్వేజెస్ కు అనువాదం చేసుకునే అవకాశం ఉండేది. అయితే.. అందులో పదాలకు అర్థాలు వస్తాయే కానీ, వాక్యాలుగా మాత్రం సరైన అర్థం వచ్చేది కాదు. దీంతో డిక్షనరీకి దీనికి పెద్దగా తేడా లేకుండా పోయింది. ట్రాన్సలేషన్ టూల్ అన్న పేరు ఉన్నా కూడా కేవలం డిక్షనరీలా మాత్రమే ఉపయోగపడేది. కానీ.... ఇప్పుడు గూగుల్ దీన్ని పూర్తిగా మార్చేసింది. ఏడాది కిందట ప్రవేశపెట్టిన ‘న్యూరల్‌ మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌’ టెక్నాలజీతో కచ్చితమైన ట్రాన్సలేషన్లు చేస్తోంది. అయితే... ఇది ప్రస్తుతం 9 భారతీయ భాషలకు పనిచేస్తోంది. ఇంగ్లిష్‌ వాక్యాలను బెంగాలీ, మరాఠీ, తమిళ్, తెలుగు, గుజరాతీ, పంజాబీ, మలయాళం, కన్నడ భాషలోకి కరెక్టుగా అనువాదం చేస్తుంది.

క్రోమ్‌ బ్రౌజర్‌లో ఇది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. అంటే యూజర్లు వెబ్‌ కంటెంట్‌ను తొమ్మిది భాషల్లో పొందొచ్చు. ‘న్యూరల్‌ మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌’ టెక్నాలజీ సేవలను గూగుల్‌ సెర్చ్, మ్యాప్స్‌కు కూడా విస్తరించినట్లు కంపెనీ తెలిపింది.

ఇక జీ–బోర్డు కీబోర్డు యాప్‌ 22 దేశీ భాషలను సపోర్ట్‌ చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ గూగుల్‌ సెర్చ్‌కు హిందీ డిక్షనరీని కలిపింది. ‘భారత్‌లో 23.4 కోట్ల మంది ఆన్‌లైన్‌ యూజర్లు దేశీ భాషలను ఉపయోగిస్తున్నారు. ఇంగ్లిష్‌ వెబ్‌ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉంది. వచ్చే నాలుగేళ్లలో మరో 30 కోట్ల మంది దేశీ భాషలను విరివిగా వాడే వారు ఆన్‌లైన్‌లోకి రావొచ్చు’ అని గూగుల్‌ అంచనా వేస్తోంది.

జన రంజకమైన వార్తలు