• తాజా వార్తలు
  •  

ఆధార్ డాటా లీక్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష


ఎంతో కీలకమైన ఆధార్ సమాచారం ఇట్టే బట్టబయలవుతోంది. ఏకంగా ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచే లీకవుతోంది. దీనిపై ఇప్పటికే ఎందరో అనుమానాలు వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆధార్ డాటాకు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని చెబుతోంది. కానీ.. మొన్న జార్ఖండ్ లో.. నిన్న ఛండీగడ్ లో ఆధార్ డాటా లీకైన నేపథ్యంలో కేంద్రం సీరియస్ గా ఉంది. ఇలా డాటా లీకేజికి కారణమైతే మూడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.

వ్యక్తుల ఆధార్ వివరాలను బహిర్గతం చేస్తే మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పదని కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను హెచ్చరించింది. ఏదైనా అధికార వెబ్ సైట్లో ఆధార్ వివరాలను ఉంచితే, ఆయా శాఖల అధికారులదే బాధ్యతని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, ఎవరి ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తమతమ వెబ్ సైట్లలో లేకుండా అన్ని శాఖలూ సమీక్షించుకోవాలని సూచించింది.

జార్ఖండ్ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షనర్ల ఆధార్ వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్లో కనిపించి కలకలం సృష్టించిన నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు లేఖలు పంపామని, ఐటీ చట్టం 2000, ఆధార్ చట్టం 2016 ప్రకారం నిబంధనలు మీరితే చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.

జన రంజకమైన వార్తలు