• తాజా వార్తలు
  •  

ఇంటర్నెట్ ఎకానమీలో ఇండియా పరుగు


ఇండియాలో ఇంటర్నెట్ ఎకానమీ మరో మూడేళ్లలో విపరీతంగా వృద్ధి చెందనుంది. ఆన్ లైన్ వినియోగదారులు... డాటా వినియోగం శర వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు వస్తోంది. ఇప్పుడున్న జోరే కొనసాగితే 2020 నాటికి భారత ఇంటర్నెట్‌ ఎకానమీ 250 బిలియన్‌ డాలర్ల స్థాయికి (సుమారు రూ. 1,60,67,500 కోట్లు) చేరనుంది. ప్రస్తుతం ఇండియా ఇంటర్నెట్ ఎకానమీ సుమారు 13,000 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే ఇది మన స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 5 శాతం వాటా ఆక్రమిస్తోందన్నమాట.
ఈ–కామర్స్, ఆర్థిక సేవల రంగం విస్తరణ... డాటా అందుబాటుతనం, డాటా వేగం వంటి సానుకూల మార్పులతో 2020 నాటికల్లా ఇంటర్నెట్‌ ఎకానమీ 215–265 బిలియన్‌ డాలర్ల స్థాయికి (జీడీపీలో 7.5 శాతం) చేరవచ్చని ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో అంచనా వేశాయి.
దేని వాటా ఎంత?
ఈ మొత్తం వృద్ధిలో .. ఈ–కామర్స్, ఆర్థిక సేవల వాటా 40–50 బిలియన్‌ డాలర్లు వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ–కామర్స్‌ ఉత్పత్తుల వాటా 45–50 బిలియన్‌ డాలర్లు, డిజిటల్‌ మీడియా .. అడ్వర్టైజింగ్‌ వాటా 5–8 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండనుంది. ఇందులో అత్యధికంగా ఇన్‌ఫ్రాపై ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల రూపంలో ఉండవచ్చని నివేదిక వివరించింది. వాటి విలువ 50–60 బిలియన్‌ డాలర్లకు ఉండొచ్చని అంచనా. ఇక కనెక్టివిటీపరమైన వాటా 45–55 బిలియన్‌ డాలర్ల స్థాయిలో, డివైజ్‌ల వాటా 30–40 బిలియన్‌ డాలర్ల మేర ఉంటుందని లెక్క కట్టారు.
సగం ఇండియా ఇంటర్నెట్ మయం
బోస్టన్ రిపోర్టు ప్రకారం సుమారు 39.1 కోట్ల మంది యూజర్లతో భారత్‌ ఇప్పటికే మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులపరంగా అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉంది. 2020 నాటికల్లా ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటికి మన ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 65 కోట్లకు చేరనుంది.
డాటా వినియోగం పది రెట్లు వృద్ధి
* 2020 నాటికి డాటా వినియోగం 10 నుంచి 14 రెట్లు పెరగనుందని బోస్టన్ రిపోర్టు అంచనా వేసింది.
* అప్పటికి సగటున ప్రతి వినియోగదారుడు నెలకు 7 నుంచి 10 జీబీ డాటా వినియోగిస్తారని అంచనా.
* హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ వాడకం పెరగడం వల్ల యూజర్లు ఆన్‌లైన్‌లో గడిపే సమయం కూడా 3–4 రెట్లు పెరగనుంది.
* ఈ ఇంటర్నెట్ విప్లవానికి 4జీ పరికరాలు, హై స్పీడ్‌ డేటా, డిజిటల్‌ కంటెంట్‌ పెరగడం కారణం కానున్నాయి.

జన రంజకమైన వార్తలు