• తాజా వార్తలు
  •  

త్వరలో పోస్టాఫీసుల్లో ఆధార్ జారీ

అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారమైన సమయంలో అందులో ఉంటున్న కొన్ని తప్పులు ఒక్కోసారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే ఆధార్ కార్డు లేనివారు వాటిని పొందడంలోనూ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిరునామా, ఫొటోలు, ఇతర వివరాల అప్ డేషన్లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నారు కొందరు. ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్యలు, ఇతర ఇబ్బందులు ఆధార్ విషయంలో కొత్త కష్టాలు కలిగిస్తున్నాయి. అయితే, మరో నెల రోజుల్లో వీటన్నిటికీ చెక్ పడనుంది. త్వరలో పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి రానుండడంతో ఇవన్నీ సులభం కానున్నాయి.
రెండు మూడు నెలల్లో ప్రారంభం
దేశవ్యాప్తంగా ఆధార్‌ సమస్యలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తేవాలని భారత తపాలా శాఖ ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించింది. అందుకు కేంద్రం నుంచి కూడా ఆమోదం లభించింది. దీంతో ఇటీవలే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూడీఐఏ)తో తపాలా అధికారులు సంప్రదింపులు జరిపారు. ఆధార్‌ యంత్రాలను సమకూర్చి మే నెలలో ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి యంత్రాల సరఫరాకు టెండర్లు కూడా పిలిచారు. రెండు, మూడు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి ఆధార్‌ కార్డుల జారీ ప్రారంభించనున్నారు.
ఇవన్నీ సానుకూలమే..
పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉండడం... ప్రజలతో మమేకమైన సిబ్బంది వారికి ఉండడం... ఉపాధి హామీ వేతనాల వంటి విషయాల్లో ఇప్పటికే చురుగ్గా పనిచేస్తుండడంతో పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రజల ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు.

జన రంజకమైన వార్తలు