• తాజా వార్తలు
  •  

రైలు ప్ర‌మాదాల‌ నివారణకు కొత్త టెక్నాలజీ

భార‌త్‌లో ఉన్న అతి పెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ ఇండియ‌న్ రైల్వేస్‌. ఇంత పెద్ద వ్య‌వ‌స్థ‌ను మెయిన్‌టెన్ చేయ‌డం.. ఇబ్బందుల‌ను గుర్తించి స‌రి చేసుకోవ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. కానీ భార‌తీయ రైల్వే ఎక్క‌డిక్క‌డ జోన్ల‌ను ఏర్పాటు చేసుకుని.. సిబ్బందిని నియ‌మించుకుని ఇబ్బందుల‌ను తొల‌గించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఐతే చిన్న చిన్న ఇబ్బందులైతే ఏదో విధంగా స‌ర్దుకోవ‌చ్చు. కానీ అదే ప్ర‌మాద‌మైతే!! ఊహించ‌డానికే భ‌యం వేస్తుంది క‌దా! ఒక‌సారి ప్ర‌మాదం జ‌రిగితే వంద‌లాది ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. అందుకే ర‌క్ష‌ణ విష‌యంలో రైల్వే చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. సిబ్బందిని నియ‌మించినా ప్ర‌మాదాల‌ను అరిక‌ట్ట‌డంలో భార‌తీయ రైల్వే విఫ‌లం అవుతూనే ఉంది. ముఖ్యంగా ఉగ్ర‌వాదుల క‌దలిక‌లు ఉన్న ప్రాంతాల్లో రైల్వే జోన్లు ఎప్పుడూ ప్ర‌మాదానికి ద‌గ్గ‌ర్లోనే ఉంటాయి.

అయితే ఇటువంటి ప్ర‌మాదాల‌ను అరిక‌ట్ట‌డానికి రైల్వే శాఖ టెక్నాల‌జీని వాడుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఉంది. ఇప్ప‌టికే ఆ సంస్థ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నా అది కేవ‌లం టిక్కెట్ల బుకింగ్ ఇత‌ర స‌దుపాయాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. కానీ తాజాగా ప్ర‌మాదాల‌ను నియంత్రించ‌డం కోసం, ప్ర‌మాదాల‌ను గుర్తించ‌డం కోసం ప్ర‌త్యేకంగా టెక్నో సాయం తీసుకోవాల‌ని రైల్వే శాఖ నిర్ణ‌యించింది.

ట్రాక్ మోనిట‌రింగ్‌
రైలు న‌డ‌వాలంటే కీల‌క‌మైంది ప‌ట్టాలే. మ‌రి ఆ ప‌ట్టాల‌కు ఏమైనా అయితే సెక‌న్ల‌లో ప్ర‌మాదం సంభ‌విస్తుంది. రైళ్లు ప‌దే ప‌దే ప‌ట్టాలు త‌ప్ప‌డానికి కూడా ఇదే కార‌ణం. అయితే వీటిని మోనిట‌రింగ్ చేయ‌డానికి రైల్వేకు ఉన్న వ్య‌వ‌స్థ చాలా తక్కువే. కొంత‌మంది సిబ్బంది దీని కోసం ఉన్నా వారు అన్ని వేళ‌లా అన్ని చోట్ల‌కు వెళ్లి ప‌రిస్థితిని స‌మీక్షించ‌లేని స్థితి. ఈ స్థితి టెక్నాల‌జీ తోడుంటే సుల‌భంగా ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌చ్చ‌ని రైల్వే శాఖ భావిస్తోంది. దీని కోసం ట్రాక్ మోనిట‌రింగ్ టెక్నాల‌జీని ఉప‌యోగించాల‌నే ఆలోచ‌న‌లో ఉంది. దీని వ‌ల్ల భార‌త్‌లో ఉన్న అన్ని ట్రాక్‌ల‌ను మోనిట‌రింగ్ చేయ‌డానికి టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఏమైనా ఇబ్బంది ఉంటే రైల్వే శాఖ‌కు వెంట‌నే సిగ్న‌ల్స్ అందుతాయి. దీని వ‌ల్ల అధికారులు త‌క్ష‌ణం అప్ర‌మ‌త్త‌మై స్థానిక‌ జోన్‌కు స‌మాచారం అందిస్తారు. దీని వ‌ల్ల వెంట‌నే ప్ర‌మాదాల‌ను అరిక‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.
అడ్వాన్స‌డ్ టెక్నాల‌జీ
ప్ర‌స్తుతం న‌డుస్తోంది డిజిట‌ల్ యుగం. ఈ నేప‌థ్యంలో భార‌త రైల్వే కూడా ఇందుకు త‌గ్గ‌టే ఉండాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్ర‌మాదాల‌ను నియంత్రించ‌డానికి మాత్ర‌మే కాదు వినియోగదారుల‌కు సౌక‌ర్యాల‌ను పెంచ‌డానికి కూడా అడ్వాన్స‌డ్ టెక్నాల‌జీని వాడాల‌నేది వారి ఆలోచ‌న‌. ఇప్ప‌టికే దేశంలోని దాదాపు అన్ని పెద్ద రైల్వే స్టేష‌న్ల‌లో వైఫై సౌక‌ర్యాల‌ను క‌ల్పించారు. ఇక ప్ర‌మాదాల‌ను నియంత్రించ‌డానికి కూడా అధునాత సాంకేతిక‌త వాడాల‌ని ఇటీవ‌ల జ‌రిగిన రెండు రోజుల స‌మీక్ష స‌మావేశంలో రైల్వే శాఖ తీర్మానించింది. .జీపీఎస్ ద్వారా రైల్వే ట్రాక్‌ల స్థితి గ‌తులు తెలుసుకోవ‌డం మాత్ర‌మే కాదు.. రైల్వే ట్రాక్‌ల మీద ఎవ‌రైనా మందుపాత‌ర‌లు ఉంచారా.. బాంబులు ఉంచారా లాంటి విష‌యాల‌ను గుర్తించ‌డానికి కూడా టెక్నాల‌జీని వాడాల‌ని రైల్వే శాఖ భావిస్తోంది. వారి ఆలోచ‌న‌లే అమ‌ల్లోకి వ‌స్తే క‌నుక తీవ్ర‌వాదుల దుష్ట ఆలోచ‌న‌ల‌కు క‌ళ్లెం వేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు