• తాజా వార్తలు
  •  

ఏమిటీ ఫేస్‌బుక్ అతి పెద్ద స్కాండ‌ల్‌.. 10 పాయింట్స్‌లో సంక్షిప్తంగా ప్రత్యేక విశ్లేష‌ణ‌

ఫేస్‌బుక్ వేదిక‌గా రాజ‌కీయ పార్టీలు, సినిమా యాక్ట‌ర్ల ఫాన్స్ ఒక‌రినొక‌రు దుమ్మెత్తి పోసుకుంటారు. అయితే ఈసారి ఫేస్‌బుక్‌నే దుమ్మెత్తి పోసే ప‌రిస్థితి తలెత్తింది. దాదాపు 5కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల ప్రైవేట్ డేటాను డేటా మైనింగ్ కంపెనీ కేం బ్రిడ్జి ఎన‌లిటికా వారికి తెలియ‌కుండానే సేక‌రించింద‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ స‌మాచారాన్ని 2015లో అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో స‌పోర్ట‌ర్లుగా వాడుకున్నార‌న్న‌ది ఆరోప‌ణ‌.  అంతేకాదు ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల్లోనూ ప‌లు పెద్ద రాజ‌కీయ పార్టీల‌తో కేంబ్రిడ్జి ఎన‌లిటికా టైఅప్ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఖాతాదారుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని కాపాడ‌కుండా ఇలా దుర్వినియోగం చేసినందుకు అమెరికాలో ఫేస్‌బుక్‌పై కేసు న‌మోదైంది. విచార‌ణ జ‌రుగుతోంది. ఇత‌ర దేశాలూ ఫేస్‌బుక్‌కు వార్నింగ్‌లు ఇస్తున్నాయి. అస‌లు ఈ కుంభ‌కోణం ఏమిటో 10 పాయింట్ల‌లో క్లుప్తంగా విశ్లేష‌ణ‌.

1. గ‌త శ‌నివారం లండ‌న్‌,న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లు ఈ వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తెచ్చాయి. డేటా మైనింగ్ కంపెనీ కేంబ్రిడ్జి అన‌లిటికా సంస్థ దాదాపు  5కోట్ల మంది ఫేస్‌బుక్ యూజ‌ర్ల ప్రైవేట్ డేటాను వారి అనుమ‌తి లేకుండా తీసుకున్న‌ట్లు కేంబ్రిడ్జి మాజీ ఉద్యోగులు చెప్పినట్లు ప్ర‌క‌టించింది.

2. యూజ‌ర్ల ప్రైవేట్ డేటా మిస్ యూజ్ అయింద‌ని 2015లో తెలుసుకున్న‌ట్లు ఫేస్‌బుక్ చెప్పింది. అయితే ఈ విష‌యం పత్రిక‌ల్లో రావ‌డానికి ఒక్క‌రోజు ముందు అంటే గ‌త శుక్ర‌వార‌మే ప్ర‌క‌టించ‌డం అనుమానాల‌కు తెర‌లేపింది. కేంబ్రిడ్జి అన‌లిటికా అకౌంట్స్‌ను స‌స్పెండ్‌చేశామ‌ని, వారు క‌లెక్ట్ చేసిన యూజ‌ర్ల డేటాను డిలీట్‌చేయాల‌ని కోరామ‌ని చెప్పింది. అయితే వాళ్లా ప‌ని చేయ‌లేద‌ని త‌ర్వాత తెలిసింద‌ని చెప్పింది.

3.కేంబ్రిడ్జి యూనివ‌ర్సిటీకి చెందిన సైకాల‌జిస్ట్ అలెగ్జాండ‌ర్ కోగెన్ ఫేస్‌బుక్ బేస్డ్ క్విజ్‌యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా ప‌ర్స‌నాలిటీ ప్రెడిక్ష‌న్ చెబుతామ‌ని కోగెన్ చెప్ప‌డంతో 2,70,000మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా యాక్సిస్ సంపాదించి యూజ‌ర్ల డేటాను తీసుకున్నారు.

4. ఫేస్‌బుక్ యూజ‌ర్లు కోగెన్‌కు త‌మ సిటీ, ఇష్టాయిష్టాలు, ఫ్రెండ్స్‌, గ్రూప్  త‌దిత‌ర వివ‌రాలకు యాక్సెస్ ఇవ్వ‌డంతో  వాటిని కోగెన్ తీసుకుని కేంబ్రిడ్జి అన‌లిటికాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.దీంతో కోగెన్ ఫేస్‌బుక్ పాల‌సీని బ్రేక్‌చేశారంటూ అత‌ని అకౌంట్‌ను స‌స్పెండ్ చేసింది.

5.కోగెన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారు, వారి ఫ్రెండ్స్‌, వారి ఫ్రెండ్స్‌కు ఫ్రెండ్స్ ఇలా దాదాపు 5 కోట్ల మంది వివ‌రాల‌ను కేంబ్రిడ్జి అన‌లిటికా సేక‌రించిన‌ట్లు ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పారు.

6.  2016లో జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు మ‌ద్ద‌తుగా సాగిన ప్ర‌చారంలో ఈ డేటాను కేంబ్రిడ్జి అన‌లిటికా వాడుకుంద‌ని ఓ విజిల్ బ్లోయ‌ర్ (ప్ర‌జా వేగు)చెప్పారు. ఇలా సేక‌రించిన డేటాను కేంబ్రిడ్జి ఇప్ప‌టికీ తొలగించ‌లేదు.

7. కేంబ్రిడ్జి అన‌లిటికా సంస్థ‌కు ఫండింగ్ చేస్తున్న రాబ‌ర్ట్ ముర్స‌ర్ ట్రంప్‌కు మ‌ద్దతుదారు.  అంతేకాదు ట్రంప్ సీనియ‌ర్ అడ్వ‌యిజ‌ర్ స్టీఫెన్ బానన్  కేంబ్రిడ్జి బోర్డు మీటింగ్స్‌లో కూడా కూర్చుంటారు. అంతేకాదు ఈ సంస్థ ట్రంప్‌కు ఎన్నికల్లో ప్ర‌చారం చేసింది కూడా.

8. న్యూయార్క్‌, వాషింగ్ట‌న్‌, లండ‌న్‌, బ్రెజిల్‌, మ‌లేషియాల్లో  పొలిటిక‌ల్‌, మార్కెటింగ్ డివిజ‌న్లు, ఆఫీస‌లున్న కేంబ్రిడ్జి అన‌లిటికా.. ఇలా డేటా మైనింగ్ ద్వారా సేక‌రించిన డేటాను ర‌క‌ర‌కాల ప‌నుల‌కు వాడుకుంటుంది. 2016లో ట్రంప్ విజ‌యంలో ఈ సంస్థతోపాటు సీఈవో అలెగ్జాండ‌ర్ నిక్స్ కూడా కీల‌క‌పాత్ర పోషించారు.

9. ఫేస్‌బుక్ ఇలా త‌మ యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని అప‌రిచితుల చేతిలో పెట్టడంపై విమ‌ర్శ‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి.  ఇప్ప‌టికే యూఎస్‌, యూరోపియ‌న్ అధికారులు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బ‌ర్గ్‌ను పిలిపించి దీనిమీద వివ‌ర‌ణ కోరుతున్నారు.

10. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఫేస్‌బుక్‌ను తొల‌గించాలంటూ #DeleteFacebook పేరిట సాగుతున్న ప్ర‌చారానికి వాట్సాప్ కో ఫౌండ‌ర్ బ్ర‌యాన్ ఆక్ట‌న్ కూడా మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ ప‌రిణామాల‌న్నింటితో సోమ‌, మంగ‌ళ‌వారాల్లోనూ ఫేస్‌బుక్ షేర్ 10% న‌ష్టాలు మూట‌గ‌ట్టుకుంది.
 

జన రంజకమైన వార్తలు