జీఎస్టీ పుణ్యమా అని ట్యాక్స్ సాఫ్టువేర్ లు రూపొందించే సంస్థల పంట పండుతోంది. ట్యాక్సేషన్, సాఫ్ట్ వేర్ రెండింట్లోనూ పట్టున్న నిపుణులకూ డిమాండు పెరుగుతోంది. జీఎస్టీ సాఫ్ట్వేర్ విక్రయించడానికి, ఐటీ సేవలందించడానికి 34 సంస్థలు ఇప్పటికే రెడీ అయ్యాయి.
మరోవైపు జీఎస్టీతో దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను క్యాష్ చేసుకోవడానికి సంస్థలు వ్యూహాలు పన్నుతున్నాయి. జీఎస్టీ పన్ను చెల్లింపుల నిర్వహణ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఇప్పటికే పలు కంపెనీలు నిమగ్నమయ్యాయి. జీఎస్టీ నిపుణులను సిద్ధం చేయడానికి పలు సంస్థలు ఇప్పటికే జీఎస్టీ శిక్షణ కోర్సులు మొదలెట్టగా... ఇంకొన్ని ఆన్లైన్ కోర్సులు కూడా ఆరంభించేశాయి. పన్ను రిజిస్ట్రేషన్, చెల్లింపులకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, దాన్ని థర్డ్ పార్టీ పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు విక్రయించే సువిధ ప్రొవైడర్లూ బిజీగా మారిపోయారు.
ఫీచర్ల బట్టే సాఫ్టువేర్ ధరలు
వీరే కాకుండా అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్లూ (ఏఎస్పీ) జీఎస్టీ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇవి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సాఫ్ట్వేర్లను ఆధారం చేసుకొని పన్ను చెల్లింపుదారుల క్రయ విక్రయాల డేటాను సేకరించి... జీఎస్టీ రిటర్న్‌కు బదలాయించి పన్నులు దాఖలు చేస్తాయి. వీటి ధరలు రూ.2,700 నుంచి ఉన్నాయి. మరోవైపు జీఎస్టీ సాఫ్ట్వేర్ ధరలు కూడా అందులో ఉన్న ఫీచర్లను బట్టి మారుతున్నాయి. ఇవి రూ.10 వేల నుంచి రూ.40 వేల ధరలో దొరుకుతున్నాయి.