• తాజా వార్తలు

విశ్లేషణ - టెక్నాల‌జీ వ‌ల్ల స్ట్రెస్ ఎందుకు వ‌స్తుంది?  నివార‌ణ ఎలా?

సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, పీసీ.. పొద్దున లేస్తే అంతా టెక్నాల‌జీ మ‌యం. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ‌ర్ నుంచి వీధి చివ‌ర సూప‌ర్ మార్కెట్లో బిల్ కౌంట‌ర్లో అటెండెంట్ వ‌ర‌కు అంద‌రికీ టెక్నాల‌జీ లేనిదే ప‌ని న‌డ‌వదు. అనివార్యంగా వాడాల్సింది కొంత‌.. సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ల్లో సోష‌ల్ మీడియా పోస్ట్‌లు, వాట్సాప్ చాటింగ్‌లతో కోరి తెచ్చుకున్న‌ది కొంత మొత్తంగా టెక్నాల‌జీ లేకుండా రోజు గ‌డ‌వ‌క‌పోవ‌డం అంద‌రికీ అనుభ‌వంలోకి వ‌చ్చేసింది. అయితే ఈ విప‌రీత‌మైన టెక్ వినియోగం మ‌న‌ల్ని స్ట్రెస్‌కు గురిచేస్తుందా అంటే క‌చ్చితంగా అవునంటున్నారు నిపుణులు. 
యాంగ్జ‌యిటీ, డిప్రెష‌న్‌, నిద్ర‌లేమి
టెక్నాల‌జీ వాడ‌కంతో మ‌న మెద‌డుకు ప‌దును త‌గ్గిపోతోంది. ప‌ట్టుమ‌ని ప‌ది ఫోన్ నెంబ‌ర్లు కూడా గుర్తుపెట్టులేక‌పోతున్నాం. మొబైల్ వాలెట్లు, బ్యాంక్ యాప్‌లు వ‌చ్చాక ఏటీఎం పిన్ నెంబ‌ర్ మ‌ర్చిపోతున్న‌వాళ్లూ త‌క్కువేం కాదు. ఇంత‌గా ఆధార‌ప‌డుతున్న‌ప్పుడు ఆ డివైస్ ప‌నిచేయ‌క‌పోతే మ‌న ఆందోళ‌న అంతా ఇంతా కాదు. మ‌రోవైపు రోజంతా డివైస్ స్క్రీన్ల‌ను చూడ‌డం మ‌న‌మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.  సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిపోయి ప‌ది మందిలో కూర్చున్నా ఫేస్‌బుక్‌, వాట్సాపే చూస్తున్నాం. మ‌నుషుల‌తో మాట్లాడ‌డం మ‌ర్చిపోవ‌డం స్ట్రెస్‌కు దారి తీస్తోంది.  కంప్యూట‌ర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్ల విప‌రీత‌మైన వినియోగం స్ట్రెస్ లెవెల్స్ పెర‌గ‌డానికి, యాంగ్జ‌యిటీ, డిప్రెష‌న్‌, నిద్ర‌లేమి స‌మ‌స్య‌లకు కార‌ణ‌మ‌ని రీసెర్చ‌ర్లు తేల్చారు.  అంతేకాదు మ‌న అటెన్ష‌న్ స్పాన్‌ను కూడా త‌గ్గిస్తుంద‌ట‌.  ఆటోమేష‌న్ వ‌ల్ల త‌మ ఉద్యోగాలు పోతాయేమోన‌ని భ‌యంతో కూడా చాలా మంది ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 
ప‌రిష్కార‌మేంటి?  
* సోషల్ మీడియా వాడ‌కాన్ని తగ్గించండి. క‌నీసం బెడ్‌రూమ్‌లోకి వెళ్లాక అయినా ఫోన్‌ను ప‌క్క‌న‌పెట్టండి.  
*మ్యూజిక్ వినండి. మంచి గాలి పీల్చండి.  ద‌గ్గ‌రగా ఉంటే వారానికి ఒకటి రెండుసార్లయినా వెళ్లి స‌ముద్రాన్ని చూడండి. చ‌ల్ల‌టిగాలిలో బైక్‌మీద రౌండ్లు కొట్టండి. వీలైతే ధ్యానం చేయండి.  అప్ప‌టికీ మీ స్ట్రెస్ త‌గ్గ‌క‌పోతే ఆక్యుపంక్చ‌ర్ లాంటి వైద్య‌విధానాలున్నాయంటున్నారు నిపుణులు.  

జన రంజకమైన వార్తలు