• తాజా వార్తలు
  •  

స్మార్ట్‌ఫోన్ల‌లో ఆన్‌లైన్ ఓన్లీ.. శ‌కం ముగిసిన‌ట్టేనా!

ఒక‌ప్పుడు ఫోన్ కొనాలంటే అదో పెద్ద తంతు... షాప్‌కు వెళ్లాలి.. మ‌న‌కు న‌చ్చిన ఫోన్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. అక్క‌డ ఏ ఫోనూ న‌చ్చ‌క‌పోతే మ‌రో షాప్‌పు వెళ్లాలి. సేల్స్‌మ‌న్‌ను అదేమిటి ఇదేమిటి అని వేధించాలి.  ఇలా చాలా హ‌డావుడి ఉండేది. ఎంత‌గా చూసినా మ‌న‌కు న‌చ్చ‌క‌పోతే మ‌ళ్లీ ఫోన్ కాన్సిల్ కూడా చేసుకునేవాళ్లం. కానీ ఆన్‌లైన్ వ‌చ్చాక ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. జ‌స్ట్ కంప్యూట‌ర్‌లో బొమ్మ చూసి ఎంత ఖ‌రీదు పెట్టైనా ఫోన్ కొనేస్తున్నాం. ఎంత‌లో ఎంత తేడా?  ఈ నేప‌థ్యంలోనే ఆన్‌లైన్ ఓన్లీ ఫోన్ల హ‌వా మొద‌లైంది. మోట‌రోలా లాంటి కంపెనీలు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ఫోన్ల‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఫోన్లు అంద‌రికి అందుబాటులోకి రావ‌ట్లేదు. దీంతో మారిన ప‌రిణామాల దృష్ట్యా ఆన్‌లైన్ ఓన్లీ ఫోన్ల  శ‌కం ముగిసిన‌ట్టే క‌నిపిస్తోంది. 

మ‌ళ్లీ పాత బాట‌లోనే...
గ‌తంలో భార‌త ఫోన్ కంపెనీలు, విదేశీ ఫోన్ కంపెనీల‌న్నీ ఏక‌తాటిపై ఉండి రిటైల్ మార్కెట్లో ఫోన్ల‌ను విక్ర‌యించేవి. దీంతో ప్ర‌తి చోట రిటైల్ ఔట్ లెట్లు వెలిశాయి. బిగ్ సి, సంగీత, యూనివ‌ర్స‌ల్ లాంటి ఔట్ లెట్ల‌కు ఒక‌ప్పుడు బాగా గిరాకి ఉండేది. అప్పుడు నోకియా, శాంసంగ్‌, సోని ఎరిక్స‌న్ లాంటి ఫోన్ల‌కు డిమాండ్ ఉండేది. కానీ ఇ-వాణిజ్యం పెరిగిన త‌ర్వాత అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీలు భార‌త మార్కెట్‌ను క‌మ్మేసిన త‌ర్వాత ఆన్‌లైన్ ఓన్లీ అనే ఫోన్లు బ‌య‌ల్దేరాయి. జ‌నం కూడా వీటిని బాగానే కొన్నారు. జియోమి, ఒప్పో, వివో లాంటి చైనా కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌ను ఆన్‌లైన్ ద్వారా మాత్ర‌మే అమ్మ‌డం మొద‌లుపెట్టాయి. అయితే భార‌త్ లాంటి పెద్ద దేశంలో ఆన్‌లైన్‌లో ఎంత మార్కెట్ ఉందో ఆఫ్ లైన్ స్టోర్‌ల ద్వారా అంత‌కంటే ఎక్కువ మార్కెట్ ఉంద‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన ఫోన్ల కంపెనీలు ఇప్పుడు మ‌ళ్లీ పాత బాట‌లోకి వ‌చ్చాయి. 

రెండు విధాలుగా..
ఆఫ్ లైన్ మీద దృష్టి పెట్టినంత మాత్ర‌న ఆన్‌లైన్‌ను వ‌దులుకోకూడ‌ద‌ని చైనీస్ కంపెనీలు భావిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఎక్కువ శాతం అమ్ముడుపోతున్న ఫోన్ల‌ను గుర్తించి వాటిని రిటైల్ మార్కెట్లోనూ అమ్మ‌డానికి ప్ర‌య‌త్నిస్తే క‌చ్చితంగా మ‌రింత లాభాలు ఆర్జించే అవ‌కాశాలు ఉంటాయ‌ని చైనీస్ మాన్యుఫాక్చ‌ర్లు భావిస్తున్నారు.  అందుకే కేవ‌లం ఒకే విధానంపై దృష్టి పెట్ట‌కుండా టూ వే ప‌ద్ధ‌తిలో ముందుకెళ్లాల‌ని జియోమి, ఒన్ ప్ల‌న్‌, మోటరోలా, ఒప్పో, వివో లాంటి  సంస్థ‌లు వ్యూహ ర‌చ‌న చేస్తున్నాయి.  ఈ నేప‌థ్యంలో ఓన్లీ ఆన్‌లైన్ అనే శ‌కానికి ఇక తెర‌ప‌డిన‌ట్లేన‌ని నిపుణులు భావిస్తున్నారు. 

జన రంజకమైన వార్తలు