• తాజా వార్తలు

ఇచ్చిన మాట త‌ప్పుతున్న జియో.. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు

జియో.. భార‌త్‌లో సంచ‌ల‌నం ఈ పేరు. ఇది అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టిదాకా  భిన్న‌మైన ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటూ టెలికాం ఇండస్ట్రీలో కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింది ఈ ఫోన్‌. ఉచిత డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్‌, మెసేజ్‌ల‌తో పాటు త‌క్కువ ధ‌ర‌కు డేటా ప్యాక్‌ల‌తో అంద‌రిని ఆక‌ర్షించింది జియో. ఇప్పుడు తాజాగా తీసుకొస్తున్న ఫీచ‌ర్ ఫోన్‌తోనూ జియో ప్ర‌కంప‌న‌లు రేపింది. రూ.1500కే ఫోన్ అంటూ ల‌క్ష‌ల మందిని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న జియో..నియ‌మ నిబంధ‌న‌ల‌ను మార్చ‌డం కాస్త అయోమ‌యానికి గురి చేస్తోంది.  ఇచ్చిన మాట త‌ప్పేలా క‌నిపిస్తోంది ఈ ముఖేశ్ అంబాని సంస్థ‌.                                                                                                           

రూ.1500 రీఛార్జ్ చేయాల్సిందే..
జియో ఫోన్ తెర మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు రియ‌ల‌న్స్ చెప్పిన మాట‌లు వేరు. ఇప్ప‌టి మాట‌లు వేరు. ల‌క్ష‌లాది మంది ఈఫోన్ కోసం రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. ఇప్పటికే చాలామందికి ఆ సంస్థ మెసేజ్‌లు కూడా పంపింది ఫోన్ క‌లెక్ట్ చేసుకోమ‌ని. ఇదంతా బాగానే ఉంది కానీ ఆరంభంలో ఉన్న నియ‌మ నిబంధ‌న‌లు ఇప్ప‌టి నియ‌మ నిబంధ‌న‌లు మార‌డ‌మే కాస్త గంద‌ర‌గోళానికి తావిస్తోంది. జియో ఫీచ‌ర్ ఫోన్ వాడుతున్న వాళ్ళు ఏడాదికి క‌నీసం రూ.1500 రీఛార్జ్ చేయాల‌నే నిబంధ‌న రావ‌డం కాస్త ఆశ్చ‌ర్య‌ప‌రిచేదే. ఎందుకంటే ఫీచ‌ర్ ఫోన్ కొనేవాళ్లు అంద‌రూ ఏడాదికి ఇంత రీఛార్జ్ చేసుకోవ‌డం క‌ష్ట‌మే. మ‌రి  జియో ఎందుకు ఈ నిబంధ‌న పెట్టిందో తెలియ‌దు. రూ.153, రూ.23 ఓవ‌ర్ల‌తో రీఛార్జ్ చేయించుకుంటే స‌రిపోతుంద‌ని చెప్పిన ఈ సంస్థ ఇప్పుడు యాగ్రిగేట్‌గా రూ.1500 రీఛార్జ్ చేయాల‌ని చెబుతోంది.

రిఫండ్ ఉంటుందా?
చాలామంది జియో ఫీచ‌ర్ ఫోన్‌ను బుక్ చేయ‌డానికి కార‌ణం రిఫండే. మూడేళ్ల త‌ర్వాత రిఫండ్ వ‌స్తుంద‌నే చాలామంది బుక్ చేశారు. కానీ నియ‌మ నిబంధ‌లను పాటిస్తేనే రిఫండ్ ఉంటుంద‌నే సందేశాన్ని రిల‌య‌న్స్ అంత‌ర్లీనంగా చెబుతోంది. ఒక‌ప్పుడు ఆరు నెల‌ల‌కు ఉచితంగా డేటాను ఇచ్చిన రిల‌య‌న్స్‌.. ఇప్పుడు మూడు నెల‌ల రీఛార్జ్ కోసం రూ399 వ‌సూలు చేస్తోంది. తాజాగా ఇది రెండు నెల‌ల‌కు చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. కొన్ని రోజుల‌కు నెల‌కు రూ.399 అన్నా ఆశ్చ‌ర్యం లేదు. ఈ నేప‌థ్యంలో జియో ఫీచ‌ర్ ఫోన్ విష‌యంలో కొన్ని సందేహాలు త‌లెత్తుతున్నాయి.  జియో మాట మారుస్తుందా.. లేదా ముందుగా చెప్పిన‌ట్లే ముందుకు సాగుతుందా అనేది చూడాలి.

జన రంజకమైన వార్తలు