ఇతర టెలికాం కంపెనీలకు చుక్కలు చూపిస్తూ.. వినియోగదారులకు డేటా సర్వీసులతో ముంచెత్తుతున్న రిలయన్స్ జియో నెలవారీ డేటా ట్రాఫిక్ ఎంతో తెలుసా...? ఊహకందనంత.. ఏకంగా నెలకు 110కోట్ల జీబీ కంటే ఎక్కువగానే జియో డేటా ట్రాఫిక్ ఉంది. రోజుకు 220 కోట్ల వాయిస్, వీడియో కాల్ మినిట్స్ జియో అందిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సర ఫలితాల సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించిన గణాంకాలు తెలియగా సాధారణ వినియోగదారులే కాదు పోటీ సంస్థలు కూడా షాకవుతున్నాయి.
ప్రపంచ చరిత్రలోనే రికార్డు
ప్రపంచ టెలికాం చరిత్రలోనే ఉచిత సేవలనుంచి పెయిడ్ సర్వీసుల్లోకి మారిన అత్యంత పెద్ద కంపెనీ జియో. ప్రపంచంలోనే అత్యంత చవకైన డేటా, వాయిస్ సర్వీసులను అందిస్తూ.. కస్టమర్లకు అత్యంత నాణ్యత సేవలందించడానికి అంకితభావంతో జియో ముందుకు వెళ్తుందని అంబానీ ప్రకటించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరుతో ఈ టెలికాం వ్యాపార సేవలను గతేడాదే లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పటి నుంచి మొన్నటిదాకా అంటే మార్చి ఆఖరి వరకు ఉచిత సేవలను అందించి, ఏప్రిల్ 1 నుంచే టారిఫ్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది ఈ కంపెనీ.
తిరుగులేని సర్వీసులు
ప్రీపెయిడ్ కస్టమర్లకు, పోస్టు పెయిడ్ కస్టమర్లకు బంపర్ రీఛార్జ్ ఆప్షన్లను అందిస్తోంది. రూ.19, రూ.49, రూ.96, రూ.149, రూ. 309, రూ.509, రూ.999, రూ.1,999, రూ.4,999, రూ.9,999 రీఛార్జ్ ఆప్షన్లను జియో తన వినియోగదారులకు కల్పిస్తూ.. అద్భుతమైన వాయిస్, వీడియో కాలింగ్, డేటా సర్వీసులను అందిస్తోంది.
వేల కోట్లు ఉచితంగానే..
జియో సంస్థ వెల్లడించిన ప్రకారం నెలకు 110 కోట్ల జీబీ అంటే జియో రాకమునుపు ఉన్న డాటా ధరలతో లెక్కేస్తే వేల కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అంటే.... దేశవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులకు రిలయన్స్ ఏ స్థాయిలో ఫ్రీ డాటాను అందించిందో ఊహించుకోవచ్చు.