• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

స్మార్ట్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కాలంలో ఖ‌రీదైన ఫోన్లు కొనేందుకు వినియోగ‌దారులు ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈఎంఐలు చెల్లించైనా స‌రే యాపిల్ ఐ ఫోన్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. దాదాపు బైక్ ధ‌ర‌ల‌తో స‌మానంగా ఉండే యాపిల్ ఫోన్ల‌ను కొనేందుకు కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాళ్లు వెనుకడుగు వేయ‌ట్లేదు. అయితే ఇంత ఖ‌ర్చు పెట్టి ఫోన్ కొన్న త‌ర్వాత అక్క‌డితో ఆగం క‌దా ...! దానికి ఇంకా ఎన్నోహంగులు. . ఆర్భాటాలు అవ‌స‌రం! మ‌న మ‌న‌సుల్ని చ‌దివేందుకు టెలిఫోన్ కంపెనీలు కూడా సిద్ధంగా ఉంటాయి. అందుకే ఫోన్ కొంటే ఇది ఫ్రీ అది ఫ్రీ అని ఊద‌ర‌గొట్టేస్తాయ్‌. ఏదో రూ.1000 క‌లిసొస్తుంద‌ని రూ.50 వేల రూపాయ‌ల ఫోన్ కొనేందుకు కూడా ఆలోచించం. అంతేకాదు టెలిఫోన్ కంపెనీలు వాడే మ‌రో మాట మా ఫోన్ కొంటే ఇన్సురెన్స్ ఫ్రీ. మీ ఫోన్ పోతే మాదీ బాధ్య‌త లాంటి మాట‌లు వాడేస్తారు. మ‌రి నిజంగా ఇన్సురెన్స్‌తో అంత ఉప‌యోగం ఉందా! అస‌లు ఇంత ధ‌ర పెట్టి ఫోన్‌లు అమ్మే కంపెనీలు బాధ్య‌త‌గా ఉంటాయా!

మాట‌ల వ‌ర‌కేనా!
చాలా కంపెనీల‌తో పాటు బిగ్‌సీ, సంగీత లాంటి ఔట్ లెట్టు కూడా ఇన్సురెన్స్ ఇస్తాం.. అది ఇదీ ఇస్తాం అనే మాట‌ల‌తో వినియోగ‌దారులను ఆక‌ర్షించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాయి. ఇంత డ‌బ్బులు పెట్టి కొంటున్నాం ఇన్సురెన్స్ లేక‌పోతే ఎలా అని వినియోగ‌దారులు కూడా అనుకుంటారు. నిజానికి ఇన్సురెన్స్ డ‌బ్బులు కూడా ఫోన్ ధ‌ర‌లోనే వేసేస్తాయి కంపెనీలు. ఈ విష‌యం తెలియ‌ని క‌స్ట‌మ‌ర్లు మ‌న‌కు ఇన్సురెన్స్ ఉంద‌ని సంబర‌ప‌డ‌తారు. నిజానికి ఇన్సురెన్స్ క‌న్నా వారెంటీ బెట‌ర్‌. క‌నీసం ఏడాదిలోపు మ‌న ఫోన్‌కు ఏమైనా డ్యామేజ్ జ‌రిగినా.. రిపేర్ వ‌చ్చినా వారెంటీ ఉంటే ఉచితంగా స‌ర్వీస్ అయినా చేసి పెడ‌తారు. కానీ ఇన్సురెన్స్‌తో డ‌బ్బులు పోవ‌డంతో పాటు ఆ స‌మ‌యానికి మాకు సంబంధం లేద‌ని చేతులెత్తేస్తాయి ఈ కంపెనీలు. ఇలా చాలామంది వినియోగ‌దారులు ఇబ్బంది ప‌డ్డారు. ఫోన్ అమ్మ‌డం వ‌ర‌కే మా బాధ్య‌త ఇన్సురెన్స్ కంపెనీకి వెళ్లి మీరు మిగిలిన విష‌యాలు తేల్చుకోవాలి అని తేల్చేస్తాయి.

నియ‌మ నిబంధ‌న‌ల్లోనే ఉన్నా..
చాలామంది ఫోన్లు కొన్న మోజులో ఏం ప‌ట్టించుకోరు. కానీ ఎక్స‌స‌రీస్ ఎన్ని వ‌చ్చాయో కూడా చూసుకోరు. ఇంక నియ‌మ నిబంధ‌న‌ల గురించి ఏం ప‌ట్టించుకుంటారు? అయితే విష‌యం అంతా వాటిలోనే ఉంటుంది. టెలిఫోన్ కంపెనీలు ప్రోమిస్ చేసేది ఒక‌టి రియాలిటీ వేరొక‌టి. మీ హ్యాండ్‌సెట్‌కు ఏమైనా డ్యామేజ్ జ‌రిగినా, పోగొట్టుక‌న్నా, ఇంకేదైనా న‌ష్టం జ‌రిగినా మా సంస్థ‌కు సంబంధం లేద‌ని టెలిఫోన్ కంపెనీలు చెబుతున్నాయి. అంతేకాదు వారెంటీలోనూ త‌మ‌కు పూర్తి బాధ్య‌త లేద‌ని ఎయిర్‌టెల్ లాంటి పెద్ద సంస్థే చెబుతోంది. ఏమైనా స్క్రీన్‌గార్డ్ పోతేనో లేక చిన్న చిన్న వాటికి మాత్ర‌మే స‌ర్వీసు ఉంటుంది కానీ సాఫ్ట్‌వేర్ పోయినా లేక ఇంకేం న‌ష్టం జ‌రిగినా ఫోన్ కంపెనీకి ఎలాంటి బాధ్యత ఉండ‌ద‌ని ఈ నియ‌మ నిబంధ‌న‌లు చెబుతున్నాయి. కానీ వినియోదారులు మాత్రం ఇవేమి ప‌ట్టించుకోరు.

ఎఫ్ఐఆర్ ఉండాల్సిందే..
ఫోన్ దొంగ‌తానికి గురైతే పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ వ‌స్తేనే ఏమైనా యాక్ష‌న్ ఉంటుంది. లేక‌పోతే అంతే. కానీ ఫోన్ పోగొట్టుకున్న ప్ర‌తి వారు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లలేరు. ఒక వేళ వెళ్లినా పోలీసులు తేలిగ్గా తీసుకుంటారు. చాలాసార్లు కేసు న‌మోదే చేయ‌రు. ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ ఎక్క‌డిది? మ‌రి ఇన్సురెన్స్ మాటేంటి? ఎఫ్ఐఆర్ కాపీ ఉంటేనే మ‌న కేసు ముందుకు నడుస్తుంది లేక‌పోతే ఖ‌రీదైన ఫోన్ అయినా ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. అందుకే ఫోన్ ఇన్సురెన్స్ చేసే ముందు నియ‌మ నిబంధ‌న‌లు స‌రిగా చ‌దివి.. అనుమానాలు నివృత్తి చేసుకున్న త‌ర్వాతే కొనుగోలు చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు