• తాజా వార్తలు
  •  

షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్ సేల్‌లోనే అమ్మ‌తుంది. రెండు మూడు రోజుల‌కోసారి జ‌రిగే ఈ ఫ్లాష్ సేల్ ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవాలి. ప‌ట్టుమ‌ని ప‌ది నిముషాలు కూడా లేకుండానే అవుటాఫ్ స్టాక్ మెసేజ్ క‌నిపిస్తుంది. దీంతో ఆఫ్‌లైన్‌లో రెడ్‌మీ ఫోన్ల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. డిమాండ్ ఉండ‌డంతో ఈ ఫోన్ల‌ను ఆఫ్‌లైన్ వ్యాపారులు (సెల్‌ఫోన్ షాపుల‌వారు)500 నుంచి 2500 వ‌ర‌కు పెంచి అమ్ముతున్నారు. దీన్ని ఓ రిపోర్ట‌ర్ల టీం  స్వ‌యంగా వెళ్లి ప‌లు షాపుల్లో తిరిగి నిర్ధారించుకుంది.  
 

ఎక్స్‌ట్రా ఖ‌ర్చ‌వుతుంది.. 
ఈ రిపోర్ట‌ర్ల టీమ్ ఢిల్లీ, చుట్టుప‌క్క‌ల ప‌లు ప్రాంతాల్లో చిన్న‌చిన్న‌రిటైల్ స్టోర్ల‌కు వెళ్లి ప‌రిశీలించింది. ఇందులో ఎంఐ ప్రొడ‌క్ట్స్ అమ్మ‌డానికి డైరెక్ట్‌గా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రిఫ‌ర్డ్ పార్ట‌న‌ర్ దుకాణాలు కూడా ఉన్నాయి. ప్రిఫ‌ర్డ్ పార్ట్‌న‌ర్ స్టోర్స్‌లో షియోమి ఫోన్లున్నాయా అని అడ‌గ్గానే మీకెందుకు సార్‌.. ఏ మోడ‌ల్ కావాలో చెప్పండి. క్ష‌ణాల్లో ఇస్తాం. కానీ కొంత ఎక్స్‌ట్రా అమౌంట్ అవుతుంద‌న్నారు. ఫోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్ ఇచ్చి బిల్ చేయ‌మంటే ఫోన్ ఒరిజినల్ రేట్‌కే బిల్లు పే చేస్తామ‌ని, తాము అడిగిన ఎక్స్‌ట్రా అమౌంట్‌తోపాటు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్ష‌న్ చేసినందుకు 2.5% (నూటికి రెండున్నర రూపాయ‌ల) చొప్పున మొత్తాన్ని క్యాష్‌గా ఇవ్వాల‌ని చెప్ప‌డంతో ఆ టీమ్ అవాక్క‌యింది. డిజిటల్ ట్రాన్సాక్ష‌న్లు గురించి గ‌వ‌ర్న‌మెంట్లు గొప్ప‌లుచెప్పుకుంటుంటే దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్ష‌న్‌కు 2.5% ఎక్స్‌ట్రా ఛార్జి అడ‌గడంతో వారంతా షాక్ అయ్యారు. అంతేకాదు మోడల్‌ను బ‌ట్టి షియోమి ఫోన్ కాస్ట్ కంటే 500 నుంచి 2500 వ‌ర‌కు ఎక్కువ అడిగారు. రెండు, మూడు దుకాణాలు తిరిగినా ఇదే ప‌రిస్థితి. ఇక షియెమి పార్ట‌న‌ర్లు కాని షాపుల వారి ద‌గ్గ‌ర మ‌రింత ఎక్కువ ధ‌ర ఉంది.
ఎంత తేడానో చూడండి

* రెడ్‌మీ 5ఏ .. 2జీబీ ర్యామ్ ధ‌ర రూ.5,999. ప్రిఫ‌ర్డ్ పార్ట్‌న‌ర్ ద‌గ్గ‌ర రూ.6,500 నుంచి రూ.6,700 వ‌ర‌కు ఉంటే నాన్ ప్రిఫ‌ర్డ్ పార్ట్‌న‌ర్ షాపుల్లో రూ.6,700 నుంచి రూ.7వేల వ‌ర‌కు ఉంది.

*రెడ్‌మీ 5 .. 2జీబీ ర్యామ్ ధ‌ర రూ.5,999. ప్రిఫ‌ర్డ్ పార్ట్‌న‌ర్ ద‌గ్గ‌ర రూ.6,500 నుంచి రూ.6,700 వ‌ర‌కు ఉంటే నాన్ ప్రిఫ‌ర్డ్ పార్ట్‌న‌ర్ షాపుల్లో రూ.6,800 నుంచి రూ.7,200 వ‌ర‌కు అమ్ముతున్నారు. 

*రెడ్‌మీనోట్‌ 5 .. 3జీబీ ర్యామ్ ధ‌ర రూ.13,999. ప్రిఫ‌ర్డ్ పార్ట్‌న‌ర్ ద‌గ్గ‌ర రూ.15,500 నుంచి రూ.16,000 వ‌ర‌కు ఉంటే మిగ‌తా  షాపుల్లో రూ.11,800 నుంచి రూ.12,300 వ‌ర‌కు అమ్ముతున్నారు.  ఇలాగే మిగిలిన మోడల్స్ ఫోన్ల‌కు ఎక్కువ రేటు తీసుకుంటున్నారు. ఢిల్లీ అనేకాదు దేశంలోచాలాచోట్ల ఇలాంటి బాగోత‌మే న‌డుస్తోంది.

అస‌లు కార‌ణ‌మేంటి?
షియోమి ఫ్లాష్‌సేల్ అంటూ పెట్టి 10 నిముషాల్లో స్టాక్ అయిపోయిందంటుంది.  ఫోన్ దొర‌క‌డం లేద‌ని హైప్ సృష్టించి జ‌నానికి దానిమీద ఆస‌క్తి పెరిగేలా చేస్తుంది.  ఫ్లాష్‌సేల్‌లో ఫోన్ కొందామ‌ని ట్రై చేసి చేసి విసిగిపోయిన‌వారు పోతే పోయింది 500, 1000 అనుకుని ఇలాంటి షాపుల వారి ద‌గ్గ‌ర కొనేస్తున్నారు. ప్రిఫ‌ర్డ్ పార్టన‌ర్స్ త‌మ‌కొచ్చిన స్టాక్‌ను ఇలా ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతున్నారు. 

* అయితే తాము షియోమి పార్టన‌ర్లుగా చేరాలంటే 7 నుంచి 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ముందు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తేనే కంపెనీ త‌మ‌కు ఫోన్లు స‌ప్లై చేస్తుంద‌ని ప్రిఫ‌ర్డ్ పార్టన‌ర్లు చెబుతున్నారు. అలా ముందు డ‌బ్బులు క‌ట్టేశాక విడ‌త‌ల‌వారీగా ఫోన్లు పంపిస్తార‌ని, అదీ 
తాము అడిగినవి కాకుండా వాళ్ల ద‌గ్గ‌ర స‌ర‌కు ఏది ఉంటే అది పంపుతార‌ని వారు చెప్పారు. తాము వ్యాపారం చేసేవాళ్లం కాబ‌ట్టి దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నుకుంటామ‌ని, అందుకే రేటు పెంచి అమ్ముతున్నామ‌ని చెబుతున్నారు.

* ఇక మిగిలిన రిటైల్ షాపుల‌వాళ్లు ప్రిఫ‌ర్డ్ పార్ట్‌న‌ర్ దుకాణాల నుంచి స‌ర‌కు కొంటారు. వాళ్లే వీళ్ల‌కు అధిక ధ‌ర‌కు అమ్మ‌తుంటే దానిపైన 500 నుంచి 1000 రూపాయ‌ల వ‌ర‌కు వీరు ఎక్స్‌ట్రా వేసుకుని అమ్ముతున్నారు. 

*షియోమి కూడా సాధ్య‌మైనంత మంది క‌స్ట‌మ‌ర్ల‌ను పోగేసుకోవాల‌ని చూడ‌కుండా త‌మ ఫోన్ల‌కు గిరాకీ ఉంది క‌దాని ఫ్లాష్‌సేల్స్ పెట్టి ఊరించ‌డం, త‌క్కువ ఫోన్లు అమ్మి స్టాక్ అయిపోంద‌న‌డం, ల‌క్ష‌లు ల‌క్ష‌లు ముందే కట్టించుకుని షాపుల వాళ్ల‌కు ఏదో కాస్త స‌ర‌కు పంపించ‌డం ఇవన్నీ ఇలా మార్కెట్లో వినియోగ‌దారుణ్ని అడ్డ‌గోలుగా దోచుకోవ‌డానికి కార‌ణ‌మ‌ని గ్రౌండ్ రిపోర్ట్ తేల్చింది.  దీనిపై వాళ్లు షియోమి కంపెనీని సంప్ర‌దించినా ఎలాంటి రిప్ల‌యి ఇవ్వ‌లేదు.
 

జన రంజకమైన వార్తలు