• తాజా వార్తలు
  •  

క్యారియర్స్, మాన్యుఫ్యాక్చరర్స్ కుమ్మక్కై ఫోన్ తొందరగా పాడయ్యేట్టు చేస్తున్నారు తెలుసా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్  ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ డివైస్‌లకు ఇంతలా ఆదరణ లభించటానికి ప్రధానమైన కారణం వాటిలోని యూజర్ ఫ్రెండ్లీ స్వభావమే. ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం కావటంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. ఈ అనుకూలతను ఆసరాగా చేసుకుని సెల్యులార్ క్యారియర్స్ దగ్గర నుంచి ఫోన్ తయారీదారుల వరకు తమకు కావల్సిన విధంగా ఫోన్‌లను అభివృద్ధి చేస్తూ, వాటిని జనానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు, ఆండ్రాయిడ్ ఇస్తోన్న స్వేచ్చను కొందరు డెవలపర్స్ మంచి ప్రయోజనాల నిమిత్తం వినియోగించుకుంటుంటే మరికొందరు మాత్రం స్వలాభం కోసం వాడుకుంటున్నారు. నెట్‌వర్క్ క్యారియర్స్‌తో కుమ్మక్కవుతోన్న ఫోన్ తయారీ కంపెనీలు తమ బిజినెస్ మోడల్‌లో భాగంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను తమకిష్టమొచ్చినట్లు కస్టమైజ్ చేస్తూ వివిధ మోడల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. వీటి వల్ల కొన్ని సందర్బాల్లో ప్రమాదకర సమస్యలను ఆండ్రాయిడ్ ఎదుర్కోవల్సి వస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అన్‌ఇన్‌స్టాల్ చేయలేని విధంగా బ్లోట్‌వేర్ సమస్య..
                  విండోస్ ఆధారిత కంప్యూటర్స్ మాదిరిగానే ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ రోజురోజుకు బ్లోట్‌వేర్ (Bloatware) సమస్య పెరిగిపోతోంది. బ్లోట్‌వేర్ అనేది ముందుగానే ప్రీ-ఇన్‌స్టాల్ చేయబడిన యాప్స్ ద్వారా ఫోన్‌లలోకి చొరబడుతుంది. ఈ అదనపు సాఫ్ట్ వేర్‌ను ఫోన్‌లో జొప్పించటం ద్వారా ఫోన్ మానుఫ్యాక్చురర్ లతో పాటు యాప్ తయారీదారుల పరస్పరం ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ఫోన్‌‌లలో అదనంగా యాడ్ అయ్యే సాఫ్ట్ వేర్‌ల వల్ల కొంతలో కొంత లాభం ఉన్నప్పటికి స్టోరేజ్ స్పేస్ పరంగా మాత్రం ఇవి భారీగా స్పేస్‌ను ఆక్రమించేసుకుంటున్నాయి. సిస్టమ్ పార్టీషన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉండే ఈ సాఫ్ట్ వేర్‌ను సాధారణ రీతిలో రిమూవ్ చేయటం సాధ్యపడదు. వీటిని డిసేబుల్ చేయాలంటే ఫోన్‌లోని డెవలపర్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుని కస్టమ్ రోమ్‌ లేదా రూట్ ఓన్లీ యాప్స్ ను ప్రయోగించాల్సి ఉంటుంది.
తొలగించలేని విధంగా కస్టమ్ స్కిన్స్        
                 ఆండ్రాయిడ్ ఫోన్‌లను తయారు చేస్తోన్న సామ్‌సంగ్, హెచ్‌టీసీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లుక్‌ను పూర్తిస్థాయిలో మార్చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా అభివృద్ధి చేస్తోన్న వివిధ యూజర్ ఇంటర్‌ఫేస్‌లను హోమ్‌స్ర్కీన్ క్రింద ఇవి ఆఫర్ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ కోడ్‌ను మాడిఫై చేయటం ద్వారా తమకు అనుకూలమైన స్ర్ర్కీన్ లాంచర్‌లను అభివృద్ధి చేసుకుంటోన్న ఫోన్ తయారీ కంపెనీలు ఆండ్రాయిడ్‌తో డీఫాల్ట్ గా వచ్చే ఇంటర్‌ఫేస్‌ను మాత్రం దాచిపెట్టేస్తున్నాయి. ఉదాహరణకు సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్‌లను మనం పరిశీలించినట్లయితే వీటీలో సామ్‌సంగ్ టచ్‌విజ్ ఇంటర్‌ఫేస్ మాత్రమే పొందుపరచబడి ఉంటుంది. ఒకవేళ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ ను ఈ ఫోన్‌లో కోరుకున్నట్లయితే నోవా లాంచర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించిన యూజర్ ఇంటర్‌పేస్ ఎంతోకొంత స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్  ను ఆఫర్ చేస్తున్నప్పటికి అది నామమాత్రంగానే మిగులుతోంది. ఫోన్‌‌లతో పాటుగా కంపెనీలు అంటగడుతోన్న కస్టమ్ ఇంటర్‌ఫేస్‌ను యూజర్ వద్దనుకన్నట్లయితే, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ కోసం లైనేజ్‌ ఓఎస్ వంటి కస్టమ్ ROMలను స్మార్ట్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

 యాప్‌లను బ్లాక్ చేస్తోన్న వైనం..
                   ఫోన్ తయారీదారులతో ముందుగానే కుమ్మక్కవుతోన్న నెట్‌వర్క్ క్యారియర్లు తమ బిజినెస్ మోడల్ స్మార్ట్ ఫోన్‌లలో ముందస్తుగానే కొన్ని యాప్‌లను బ్లాక్ చేసేస్తున్నాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నప్పటికి అది సాధ్యపడటం లేదు. ఈ మధ్యన నెట్‌వర్క్ క్యారియర్లు సరికొత్త వ్యూహానికి తెరలేపాయి. తామందిస్తోన్న స్మార్ట్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ పే, సామ్‌సంగ్ పే వంటి డిజిటల్ వాలట్ యాప్‌లను బ్లాక్ చేసి వాటి స్థానంలో తమ సొంత డిజిటల్ వాలెట్‌లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. బ్లాక్ చేయబడిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఫోన్‌ను రూట్ చేసుకోవటం తప్ప యూజర్‌కు వేరే మార్గం లేదు.
అప్‌డేట్‌లను రిలీజ్ చేయటంలో జాప్యం..
               నెట్‌వర్క్ క్యారియర్ల కోసం వివిధ వెరైటీలలో స్మార్ట్ ఫోన్‌లను ఉత్పత్తి చేస్తోన్న తయారీదారులు, వాటికి సిస్టం అప్‌డేట్‌లను అందించే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తన్నారు. వీటికి సంబంధించి సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌లను బిల్డ్ చేస్తన్నప్పటికి వాటిని క్యారియర్స్ అనుమతి లేకుండా రిలీజ్ చేయటం లేదు. కేవలం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు మాత్రమే రెగ్యులర్ అప్‌డేట్స్ అనేవి వర్తిస్తున్నాయి. లో-బడ్జెట్ ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి అప్‌డేట్స్ అందటమనేది గగనంగా మారిపోయింది. అప్‌డేట్‌ల విషయంలో ఈ విధమైన జాప్యం జరుగుతుండటం వల్ల ఫోన్‌ల పనితీరు పై ఆ ప్రభావం చూపుతోంది. నెట్‌వర్క్ క్యారియర్ల కోసం ఓ వైపు ఎక్స్ క్లూజివ్ స్మార్ట్ ఫోన్‌లను అందిస్తూనే, మరోవైపు అన్ని క్యారియర్లను సపోర్ట్ చేసే విధంగా క్వాడ్-బ్యాండ్ అలానే అన్‌లాక్డ్ ఫోన్‌లను తయారీ సంస్థలు అందిస్తున్నాయి. ఇది కొంత ఊరిటనిచ్చే విషయంగా మనం భావించవచ్చు.
ఇబ్బందికరంగా మారుతోన్న లాక్డ్ బూట్‌లోడర్స్
             ప్రముఖ బ్రాండ్‌ల అభివృద్ధి చేస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు లాక్డ్ బూట్‌లోడర్స్ అనేవి ప్రధానమైన అవరోధంగా నిలుస్తున్నాయి. వీటి కారణంగా తనకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టంను యూజర్ తన ఫోన్‌లో బూట్ చేసుకోలేకపోతన్నాడు. అన్‌లాకబుల్ బూట్‌లోడర్‌తో వస్తోన్న గూగుల్ పిక్సల్ వంటి ప్యూర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్ తనకు కావల్సిన విధంగా బూట్‌లోడర్‌ను అన్‌లాక్ చేసుకునినచ్చిన ఆపరేటింగ్ సిస్టంను ఇన్ స్టాల్ చేసుకునే వీలుంటుంది. బూట్‌లోడర్‌ను అన్‌లాక్ చేయటం ద్వారా కొన్ని సందర్బాల్లో ఫోన్ వారంటీ దెబ్బతినే అవకాశముంది.
          కంప్యూటర్ తరహాలోనే ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా రెండు అకౌంట్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి అడ్మినిస్ట్రేటర్‌ది అయితే మరొకటి గెస్ట్ అకౌంట్. ఫోన్ తయారీదారుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌ను లాక్ చేసి గెస్ట్ అకౌంట్‌ను మాత్రమే యూజర్‌కు అందుబాటులో ఉంచుతాడు. అంటే మనం గెస్ట్ అకౌంట్‌ను మాత్రమే వినియోగించుకోగలం. ఇక్కడ రూటింగ్ అంటే ఫోన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌లోకి ప్రవేశించటమే. ఫోన్‌ను రూటింగ్ చేయటం వలన ఆపరేటింగ్ సిస్టంను మార్చేయవచ్చు. పలు సందర్భాల్లో రూటింగ్ పూర్తి అయిన తరువాత ఫోన్ పనితీరు చాలా మందగిస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ డస్ట్ బ్యాగ్‌లా తయారయ్యే ప్రమాదముంది

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు