• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - క్రిప్టో క‌రెన్సీ ఫ్యాన్స్ కోసం బ్లాక్ చైన్ ప‌వ‌ర్డ్ స్మార్ట్‌ఫోన్‌- ఫిన్నె

గ‌త కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ల‌లో విపరీత‌మైన మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఆకారంలోనే కాదు బ‌రువు, సాఫ్ట్‌వేర్‌, కెమెరా, ర్యామ్ ఇలా ప్ర‌తి స్పెసిఫికేష‌న్లోనూ ఏ ఫోన్‌కు ఆ ఫోనే ప్ర‌త్యేకంగా త‌యారవుతున్నాయి. కొన్ని కంపెనీలైతే ఇంకా ముందుకెళ్లి భిన్నంగా ఆలోచిస్తున్నాయి. హువీయ్ కంపెనీ ఇటీవ‌లే పీ20 ప్రొ అనే ఫోన్‌ను విడుద‌ల చేసింది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది. ఇలా భిన్న‌మైన ఆలోచ‌న‌ల నుంచి వ‌చ్చిందే ఫిన్నె స్మార్ట్‌ఫోన్. దీని ప్ర‌త్యేక‌త ఏంటంటే బ్లాక్ చైన్ ప‌వ‌ర్డ్ ఫోన్ కావ‌డం. క్రిప్టో క‌రెన్సీ ఫ్యాన్స్ కోసం ప్ర‌త్యేకించి ఇది త‌యారైంది. మ‌రి ఏంటో దీని స్పెషాలిటీ చూద్దామా...

సిరిన్ ల్యాబ్స్ ద్వారా..
సిరిన్ ల్యాబ్స్ ద్వారా ఈ ఏడాది అక్టోబ‌ర్ నాటిక‌ల్లా మార్కెట్లోకి రావ‌డానికి ఫిన్నె స్మార్ట్‌ఫోన్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్ప‌టికే ఈ కంపెనీ 25000 ప్రి  ఆర్డ‌ర్స్‌ను సంపాదించుకుంది. ఈ ఏడాది ఆఖ‌రి క‌ల్లా ల‌క్ష యూనిట్లు అమ్మాల‌నేది సిరిన్ ల్యాబ్ ప్ర‌ణాళిక‌. త్వ‌ర‌లోనే ఓఈఎంఎస్ సౌజ‌న్యంతో బ్లాక్‌చైన్ ప‌వ‌ర్డ్ స్మార్ట్‌ఫోన్ల‌ను అమ్మాల‌ని సిరిన్ ల్యాబ్ భావిస్తోంది. ప్ర‌పంచంలోనే ఫోన్ల త‌యారీలో మూడో స్థానంలో ఉన్న హువీయ్‌తో ఇప్ప‌టికే సిర‌న్ ల్యాబ్స్ సంప్ర‌దింపులు జ‌రిపింది.

ధ‌ర రూ.65 వేలు
ఫిన్నె స్మార్ట్‌ఫోన్ ధ‌ర అమెరికా డాల‌ర్ల ప్ర‌కారం 999 (సుమారు రూ.65 వేలు) ఉండ‌బోతోంది. బిట్ కాయిన్ల లెక్క‌లో అయితే ఇది 0.15 బిట్‌కాయిన్‌తో స‌మానం. త్వ‌ర‌లోనే ఇది రిటైల్ షాప్‌ల‌లోనే అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది. అయితే క్రిప్టో క‌రెన్సీ చ‌లామ‌ణీలో ఉన్న ఎనిమిది న‌గ‌రాల్లో ముందుగా ఫిన్నె ఫోన్ అందుబాటులోకి వ‌స్తుంది. ప్ర‌స్తుతం వియ‌త్నాం, ట‌ర్కీల్లో ఈ ఫోన్ ఫిజిక‌ల్‌గా అందుబాటులోకి వ‌స్తుంది. భార‌త్‌లో ఈ ఫోన్ రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. 

అదిరే ఫీచ‌ర్లు
ఫిన్నె స్మార్ట్‌ఫోన్ అంద‌ర్ని ఆక‌ర్సించ‌డానికి కార‌ణం ఇది మిగిలిన స్మార్ట్‌ఫోన్ల క‌న్నా సెక్యూర్ అని ప్ర‌చారం జ‌ర‌గ‌డం వ‌ల్లే. అయితే వాడ‌కంలోకి వ‌స్తే కానీ అస‌లు విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌దు. 5.5 అంగుళాల డిస్‌ప్లే, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌... 6 జీబీ ర్యామ్‌తో పాటు 12 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. అయితే ఈ స్పెసిఫికేష‌న్లు ఫైన‌ల్ కాద‌ని ఇంకా మారే అవ‌కాశాలున్నాయి సిరిన్ ల్యాబ్స్ తెలిపింది. 

జన రంజకమైన వార్తలు