• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - జియో పేమెంట్స్ బ్యాంక్ షురూ

ఇండియ‌న్ టెలికం సెక్టార్లో ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి దిగ్గ‌జ కంపెనీలను అధిగ‌మించి యూజ‌ర్ల మ‌న‌సుల్లో నిలిచిన జియో.. ఇప్పుడు పేమంట్స్ బ్యాంక్ పోటీలోకి  వ‌చ్చేసింది.  జియో పేమెంట్స్ బ్యాంక్ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. జియో  పేమెంట్స్ బ్యాంక్‌లో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల‌కు 70: 30 వాటాలున్నాయి.
 

ఆరో బ్యాంక్‌
ఇండియాలో పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుచేయ‌డానికి 2015 ఆగ‌స్టులో 11 సంస్థ‌లు అప్ల‌యి చేసుకున్నాయి. వీటిలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌,ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఇప్ప‌టికే ఆప‌రేష‌న్స్ ప్రారంభించాయి. ఇప్పుడు జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఇండియాలోని పేమెంట్స్ బ్యాంక్‌లో ఆర‌వ‌ది. ఆర్‌బీఐ నిబంధ‌నల ప్ర‌కారం పేమెంట్స్ బ్యాంక్‌లు ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు డిపాజిట్లు తీసుకోవ‌చ్చు. డెబిట్ కార్డ్‌లు ఇవ్వ‌చ్చు. కానీ లోన్స్ ఇవ్వ‌డానికి వీల్లేదు.

కేవైసీ రూల్స్‌తో క‌ష్ట‌మే
జియో పేమెంట్స్ బ్యాంక్ రంగంలోకి వ‌చ్చేస‌రికి పేమెంట్స్ బ్యాంక్‌లకు సంబంధించిన రూల్స్ మారాయి. ఆర్‌బీఐ సూచ‌న‌ల ప్ర‌కారం మొబైల్ వాలెట్ల‌కు కేవైసీ నిబంధ‌న‌లు పెట్ట‌డంతో వాటి యూసేజ్ బాగా తగ్గింది.  మ‌రోవైపు టెలికం ఆప‌రేట‌ర్లు పేమెంట్స్ బ్యాంక్‌లు ర‌న్ చేస్తే వాటి కేవైసీని సొంతంగా నిర్వ‌హించుకోవ‌డానికి వీల్లేద‌ని సెంట్ర‌ల్ బ్యాంక్ నిబంధ‌న తీసుకొచ్చింది. అంటే థ‌ర్డ్ పార్ట్ ద్వారా కేవైసీ వెరిఫై చేయించాలి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ లాంటి వాటికి ఈ రూల్‌తో అద‌న‌పు ఖ‌ర్చు త‌ప్ప‌దు. ఆ ఖ‌ర్చును అవి  యూజ‌ర్ల నెత్తినే వేసే ప్ర‌మాదం కూడా ఉంది.

జియో మ‌నీని ఏం చేస్తారు?
జియో సొంత మొబైల్ వాలెట్ జియో మ‌నీ ఇప్ప‌టికే అమ‌ల్లో ఉంది. జియో యూజ‌ర్లు రీఛార్జికి, బిల్‌పేమెంట్స్ వంటి అవ‌స‌రాల‌కు జియో మనీ వాలెట్‌నే వాడుతున్నారు.  పేమెంట్స్ బ్యాంక్ వ‌చ్చాక దీని ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది తెలియ‌డం లేదు.  ఐడియా లాగా వాలెట్‌ను పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌తో మెర్జ్‌చేయాలా?  లేదంటే పేటీఎంలా వాలెట్‌ను,   పేమెంట్స్ బ్యాంక్‌ను విడివిడిగా మెయింటెయిన్ చేయాలా అనే దానిపై జియో ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. పేటీఎంకి అంటే కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లు ఉంటారు కాబ‌ట్టి వాలెట్‌, బ్యాంక్ విడివిడిగా న‌డ‌పొచ్చు. జియో అలా చేయ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు అంటున్నారు నిపుణులు.

జన రంజకమైన వార్తలు