• తాజా వార్తలు

మీరు చెప్పండి.. అమెజాన్ అలెక్సా అది చేస్తుంది

    దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్ అలెక్సాను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో తెలుసు కదా.. ఇప్పుడు అలెక్సా ఇంగ్లీష్ రానివారికి కూడా ఉపయోగపడబోతోంది. అవును... ఇండియాలోని పలు రీజనల్ లాంగ్వేజెస్ కు అలెక్సా సపోర్టు చేసేలా అమెజాన్ మార్పులు తీసుకొస్తోంది. 
    ఈ ఏడాది చివరి నాటికి అలెక్సా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. తొలి దశలో... మరాఠీ, తమిళ్, హిందీ భాషల్లో వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఉన్న ఎకో స్పీకర్లను అందుబాటులోకి తేనుంది.  ప్రాథమికంగా ఇవి ఇంగ్లీష్ కు మాత్రమే సపోర్టు చేసే ఇంటర్ ఫేస్ తో వస్తున్నా తరువాత దశలో రీజనల్ లాంగ్వేజెస్ కు కూడా సపోర్టు  చేసే విధంగా అప్ డేట్ చేస్తారు.
    కాగా...  ఈ మల్టీ లింగ్యువల్ ఇంటర్ ఫేస్ ను చెన్నై కేంద్రంగా అమెజాన్ టీం అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ఇండియాలోని టెక్ ప్రియులు నోటి మాటతో ఎన్నో పనులు చేసుకోవచ్చు. అంటే ఉబర్ వంటివాటిలో క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, లేదంటే మన ఆఫీస్ లో కంప్యూటర్లకు కమాండ్ ఇవ్వాలన్నా... ఇంట్లో ఆటోమేషన్ అటాచ్డ్ పరికరాలను ఆన్ ఆఫ్ చేయాలన్నా, వాటితో పనిచేయించాలన్నా కూడా మనం వాయిస్ కమాండ్లు ఇస్తే సరి. విఠలాచార్య సినిమాల్లో మాదిరి అంతా మంత్రశక్తితో జరిగిపోయినట్లుగా జరిగిపోతుంది. వినడానికే అద్భుతంగా ఉంది.. కదా.. ఇంకెందుకాలస్యం, ఓ కంట కనిపెడుతుండండి.. ఈ సదుపాయం అందుబాటులోకి రాగానే మీరూ ట్రై చేయండి.
 

జన రంజకమైన వార్తలు