• తాజా వార్తలు
  •  

మనిషనేవాడెవడూ ఈ ఫోన్ లో డాటా దొంగిలించలేడు


* కంప్లీట్ హ్యాక్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్


* ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..
సైబర్ సెక్యూరిటీ... ఈ టెక్ ప్రపంచంలో అత్యంత కీలకాంశం. ఇంట్లోవాడే డెస్కు టాప్ నుంచి నిత్యం మనతో ఉండే స్మార్ట్ ఫోన్ వరకు ప్రతి గాడ్జెట్ కు సైబర్ భద్రత సవాలే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక లోపం. ఎక్కడో ఒక చోట మన డాటా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం. మన పేరు, ఊరు తెలిస్తే పెద్ద ప్రమాదమేమీ లేకపోవచ్చు.. కానీ, మనం స్మార్టు ఫోన్ తోనే సమస్త పనులు చక్కబెడుతుండడంతో మనకు సంబంధించిన ఎంతో కీలక సమాచారం కూడా ఆ పనుల్లో భాగంగా ఫోన్లో టైప్ చేస్తుంటాం. ఫోన్లో బ్యాంకింగ్ పనులు చేసేటప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారం, మన ఖాతాల వివరాలు, ఆధార్ నంబర్లు, మన పర్సనల్ ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు వంటివన్నీ అందులోనే టైప్ చేస్తుంటాం. ఒక్కోసారి ఇలాంటి సమాచారం లీకై తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇవే కాదు... మనపై నిఘా పెట్టేవారు కూడా కేవలం ఫోన్ల ఆధారంగా మన కార్యకలాపాలను తెలుసుకోగలుగుతున్నారు.

మెకాఫీ చేతి నుంచి..

సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు మన సమాచారాన్ని చోరీ చేయడమే కాదు వారి సరదా తీర్చుకోవడానికి మన గాడ్జెట్లకు వైరస్ పంపించి అవి నాశనమయ్యేలా చేసే ప్రమాదముంది. వీటన్నిటినీ సమర్థం ఎదుర్కొని మన గాడ్జెట్, సమాచారాన్ని సురక్షితంగా కాపాడుకోవాలంటే నమ్మకమైన యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లు వేసుకోవడమే కాకుండా మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినా కూడా మహామహా టెక్ నిపుణులే సైబర్ నేరగాళ్ల దెబ్బకు దొరికిపోతున్నారు. చివరకు ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఇక రకరకాల గాడ్జెట్లు వినియోగించే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? దీనికి సమాధానం... అత్యంత సురక్షితమైన కొత్త స్మార్టు ఫోన్. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఫోన్లోనూ లేనంత సురక్షిత వ్యవస్థ ఇందులో ఉంది. దీన్ని తయారు చేసింది యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ల రంగంలో తిరుగులేని ఆధిపత్యం గల జాన్ మెకాఫీ. ఇప్పటికీ కంప్యూటర్ విజ్ఞానం ఈ ఫోన్ ను పాఠకులకు పరిచయం చేసింది.. ఇప్పుడు మరిన్ని వివరాలను అందిస్తోంది.

ఇంకేదీ సాటిరాదు
మొబైల్ ఫోన్ల చరిత్రలోనే ఇంతవరకు లేనంత సురక్షితమైన స్మార్టు ఫోన్ ను తయారు చేస్తున్నట్లు జాన్ మెకాఫీ ప్రకటించారు. దీని ధర 1100 డాలర్లుగా నిర్ణయించారు. త్వరలో రాబోయే ఐఫోన్ 8 అయినా, ఇంకేదైనా కానీ సైబర్ సెక్యూరిటీ విషయంలో దీని ముందు దిగదుడుపే. జాన్ మెకాఫీ సీఈవోగా ఉన్న ఎంజీటీ కేపిటల్ ఇన్వెస్టిమెంట్స్ అనే సంస్థ, నార్డిక్ ఐటీ సోర్సింగ్ అసోసియేషన్ తో కలిసి ఈ ఫోన్ ను తయారుచేస్తోంది.

సంస్థలకు మోస్ట్ సూటబుల్
తొలి దశలో దీన్ని కార్పొరేట్, వ్యాపార సంస్థల కోసం తయారుచేస్తున్నారు. సాధారణ ప్రజల కంటే సైబర్ సెక్యూరిటీ సమస్యలు వారికే ఎక్కువగా ఉండడం... వాటి వల్ల కలిగే నష్ట తీవ్రతా వారికే ఎక్కువగా ఉండడంతో తొలుత వారికోసమే తయారుచేస్తున్నారు. అయితే... ప్రభుత్వాలు, ప్రత్యర్థులు నిఘా పెట్టడం.. కార్యకలాపాలు తెలుసుకోవడం.. ట్రాక్ చేయడం ఎక్కువవుతుండడంతో అలాంటి వ్యక్తులూ వీటిని వాడుకునేందుకు వీలుగా డెవలప్ చేస్తున్నారు.

రెండు వెర్షన్లు..
ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను మెకాఫీ ఇంతవరకు వెల్లడించలేదు. అయితే, ఇందులో రెండు వెర్షన్లు రిలీజ్ చేస్తున్నారు. ఒక వెర్షన్ ఇప్పటి వరకు ఉన్న అన్ని ఫోన్ల కంటే భద్రమైనదే అయినా పూర్తిగా హ్యాక్ ప్రూఫేమీ కాదని చెబుతున్నారు. అతి తక్కువ శాతం హ్యాకింగ్ ప్రమాదం దానికీ ఉంది. అయితే.. 2018లో రిలీజ్ చేయబోయే రెండో వెర్షన్ ను హ్యాక్ చేయడం మానవమాత్రులకు సాధ్యం కాదని నమ్మకంగా చెబుతున్నారు.

ఇవీ కొన్ని ప్రత్యేకతలు..
ఈ స్మార్టు ఫోన్ బ్యాక్ కవర్ కు స్విచ్ లు ఉంటాయి. వీటి సహాయంతో బ్యాటరీ, వైఫై యాంటెనాస్, బ్లూటూత్, జియో లొకేషన్, కెమేరా, మైక్రోఫోన్లను ఫిజికల్ గా డిస్ కనెక్ట్ చేయొచ్చు. అంతేకాదు.. ఇది ఎలాంటి స్టింగ్ ఆపరేషన్ పరికరాలు, ఐఎంఎస్ఐ క్యాచర్లు, ఇతర నిఘా పరికరాలకు కనెక్ట్ కాదు.

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ తోనే పనిచేస్తుంది. ఈ ఏడాది రెండో భాగంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు