• తాజా వార్తలు
  •  

రివ్యూ - 4జీ మనల్ని ఎటు తీసుకెళ్తుంది.. ఒక స్పెషల్ రివ్యూ

ఇండియాలో  సెల్‌ఫోన్ ప్ర‌వేశించి పాతికేళ్లు దాటింది.  2జీతోనే దాదాపు 20 సంవ‌త్స‌రాలు మొబైల్స్ న‌డిచాయి.  ఆ త‌ర్వాత 3జీ కొన్నాళ్లు హ‌డావుడి చేసింది.  ఆ త‌ర్వాత వ‌చ్చిన 4జీ మొబైల్ నెట్‌వ‌ర్క్  దేశాన్నే ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు దాదాపు అన్ని మొబైల్ కంపెనీలు 4జీ నెట్‌వ‌ర్క్‌ను అందిస్తున్నాయి. అయితే నిజంగా 4జీ స్టార్టింగ్‌లో ఉన్నంత గొప్ప‌గా ప‌నిచేస్తుందా? ఈ నెట్‌వ‌ర్క్‌కు ఇంకెన్నాళ్లు ఆద‌ర‌ణ ఉంటుంది? అస‌లు 4జీ నెట్‌వ‌ర్క్ ప‌ని అయిపోయిందా? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధాన‌మే ఈ ఆర్టిక‌ల్‌.
స్టేబుల్ స్పీడ్ లేదు
4జీ మొబైల్ నెట్‌వర్క్ ఓ స్థిరమైన స్పీడులో లభించడం లేదు.  పెద్ద పెద్ద సిటీల్లో అది కూడా అతి కొద్ది స‌మయం మాత్ర‌మే 20 ఎంబీపీఎస్ స్పీడ్ వ‌స్తుంది. మ‌రో ప‌క్క ఇప్ప‌టికీ దేశంలోని రూర‌ల్ ఏరియాల్లో 4జీ క‌వ‌రేజ్ పూర్తిగా రాలేదు.  స్థిరమైన 4జీ నెట్‌వర్క్‌ను అందించటంలో టెలికం ఆపరేటర్లు విఫలమవుతున్నారు. 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో యూజర్లు 4కే క్వాలిటీ వీడియోల‌ను సైతం ఎటువంటి బఫరింగ్ లేకుండా స్ట్రీమ్ చేసుకునేవారు. యూజర్ల సంఖ్య పెరిగే కొద్ది 4జీ నెట్‌వర్క్ స్పీడ్ తగ్గతూ వచ్చింది. నెట్‌వర్క్ ఆపరేటర్ల వద్ద లిమిటెడ్ స్థాయిలో మాత్రమే స్పెక్ట్రమ్ అందుబాటులో ఉండటంతో ఏ ఆప‌రేట‌ర్‌ కూడా తమ యూజర్లను సంతృప్తిపరచలేక పోతున్నారు. 
పోర్ట్ రిక్వెస్ట్‌లు పెరుగుతున్నాయి..
మొబైల్ ఇంటర్నట్‌ను ఎక్కువ‌గా వాడుతున్న మ‌న దేశంలో డేటా స్పీడ్ అనేది పెద్ద స‌మ‌స్యే.  మరోవైపు ఇదివ‌ర‌క‌టిలా 20, 30 రూపాయ‌ల రీఛార్జి చేయించుక‌ని నెలంతా న‌డిపేసే క‌స్ట‌మ‌ర్ల‌ను కంపెనీలు మెల్ల‌గా ప‌క్క‌న పెట్టేస్తున్నాయి. ఇలా తక్కువ రెవెన్యూను జనరేట్ చేస్తున్న కస్టమర్‌లను వ‌దిలించుకోవ‌డానికి పెద్ద టెలికం కంపెనీలు టారిఫ్‌లు పెంచ‌డం మొద‌లుపెట్టాయి. దీంతో  అలా త‌క్కువ యూసేజ్‌చేసే రూర‌ల్ యూజ‌ర్ల నుంచి దేశీయ టెలికం నెట్‌వ‌ర్క్ బీఎస్ఎన్ఎల్‌కు మార‌తామంటూ పెద్ద ఎత్తున పోర్ట్ రిక్వెస్ట్‌లు వ‌స్తున్నాయి. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు 2,3వేల‌కే దొరుకుతుండడం 100, 150 రూపాయ‌లు పెడితే నెలంతా ఫ్రీ కాల్స్‌తోపాటు కొంత డేటా కూడా వ‌స్తుండ‌డంతో ఆ త‌ర‌హా  యూజ‌ర్లు కూడా త‌గ్గుతున్నారు.  
బండిల్డ్ ప్లాన్స్‌తో భార‌మే
ఫ్రీ ఆఫ‌ర్ల‌తో ఇండియ‌న్ టెలికం సెక్ట‌ర్‌ను షేక్ చేసి మార్కెట్లో భారీ షేర్ ద‌క్కించుంది జియో. దీంతో  పోటీపడ‌డానికి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా వంటి కంపెనీలు నెట్‌వర్క్ క్వాలిటీని బలోపేతం చేసుకున్నాయి. అంతేకాదు జియోతో పోటీగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో కూడిన బండిల్డ్ డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో యూజ‌ర్ల సంఖ్య భారీగా పెరిగి 4జీ నెట్‌వ‌ర్క్‌లో ఉన్నా కూడా స్పీడ్ యావ‌రేజ్‌గా, కొన్నిసార్లు 2జీ స్థాయిలోనే ఉంటోంది.
డేటా స్పీడ్‌.. 10ఎంబీపీఎస్ స్ట్రాట‌జీ
ప్రస్తుత పరిస్థితుల్లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అనేవి కామన్‌గా మారిపోయినప్పటికి, ఫ్యూచర్ ఆఫ్ టెలికామ్‌గా భావిస్తోన్న డేటా సెగ్మెంట్ మాత్రం ఓ స్థిరమైన స్థానంలో నిలదొక్కుకోలేకపోతోంది.  వీడియో స్ట్రీమింగ్ సర్వీసులకు మార్కెట్లో హై-డిమాండ్ నెలకొన్నా 4కే మొబైల్ డిస్‌ప్లేలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో 20mbps కంటే ఎక్కువ స్పీడ్‌తో న‌డిచే మొబైల్ డేటాను సమకూర్చవల్సిన అవ‌స‌రం టెలికం ఆపరేటర్స్‌కు లేకుండా పోయింది. ప్రస్తుత టెలికం మార్కట్ 10mbps స్ట్రాటజీ మీద నడుస్తోంది. ఈ స్పీడును మాత్రం టెలికం సంస్థలు నికరంగా అందించగలుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇండియాలో 4జీ నెట్‌వ‌ర్క్‌కు క‌స్ట‌మ‌ర్లు భారీగా పెరిగారు కానీ దాని పెర్‌ఫార్మెన్స్ మాత్రం పూర్‌గానే ఉందంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు.