• తాజా వార్తలు
  •  

రివ్యూ - గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వీస్‌ల‌న్నీ ఒకేచోట అందించే బెస్ట్ యాప్‌.. ఉమాంగ్‌

డిజిట‌ల్ ఇండియా ఇనీషియేష‌న్‌లో భాగంగా కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ర్వీసులను ఒకే ఫ్లాట్‌ఫాంపై అందించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం గ‌త న‌వంబ‌ర్ నెల‌లో ఉమాంగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇదొక యూనిఫైడ్ యాప్‌. అంటే ర‌క‌ర‌కాల స‌ర్వీసుల‌ను అందిస్తుంది. ఈపీఎఫ్‌వో,  ఆధార్‌, ట్యాక్స్ పేమెంట్ సంబంధిత స‌ర్వీసుల‌న్నింటినీ ఒకే యాప్‌లో చ‌క్క‌బెట్టుకోవ‌డానికి ఉమాంగ్ మంచి టూల్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ యాప్‌లో ఉండే స‌ర్వీసులేమిటి? ఎలా ఉప‌యోగ‌ప‌డతాయి వంటి వివ‌రాల‌ను ఈ రివ్యూలో చూద్దాం.
రిజిస్ట్రేష‌న్ ఇలా..
ఉమాంగ్ యాప్ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మొబైల్ లేదా ఆధార్ నెంబ‌ర్‌తో లాగిన్ కావ‌చ్చు. ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విట్ట‌ర్ ప్రొఫైల్తో కూడా లాగిన్ కావ‌డానికి అవ‌కాశం ఉంది. అయితే ముందుగా హోం పేజీలో న్యూ యూజ‌ర్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే ఓటీపీ నెంబ‌ర్ వ‌స్తుంది. ఓటీపీ ఎంట‌ర్ చేస్తే త‌ర్వాత ఆధార్ నెంబ‌ర్ అడుగుతుంది. ఆధార్ నెంబ‌ర్ ఇవ్వ‌కుండా కూడా ముందుకు వెళ్లొచ్చు.అయితే ఈ యాప్‌లో గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వీసుల‌ను కూడా పొందే అవ‌కాశం ఉంది. వాట‌న్నింటికీ ఆధార్ నెంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి కాబ‌ట్టి ఆధార్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేసి లింక్‌చేసుకోవ‌డం బెట‌ర్‌. త‌ర్వాత  ప్రొఫైల్ ఇన్ఫ‌ర్మేష‌న్ పేజీలో మీ వివ‌రాలు ఎంట‌ర్ చేస్తే రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ పూర్తవుతుంది.
ఈజీ ఇంట‌ర్‌ఫేస్‌
హోం పేజీలో వెళితే క్లియ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ క‌నిపిస్తుంది. దీనిలో ప్ర‌ధానంగా 5 సెక్ష‌న్లుంటాయి.
Recenlty viewed సెక్ష‌న్‌లో మీరు ఇటీవ‌ల చూసిన స‌ర్వీస్‌ల వివ‌రాలు క‌నిపిస్తాయి.
New and Updated సెక్ష‌న్‌లో కొత్త‌గా ఉమాంగ్‌లో యాడ్ చేసిన స‌ర్వీస్‌లు, అప్‌డేట్ అయిన స‌ర్వీసుల వివ‌రాలుంటాయి.
Trendingలోకి వెళితే  ఈ యాప్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్న స‌ర్వీసుల వివ‌రాలు క‌నిపిస్తాయి.ఇందులో ఈపీఎఫ్‌వో, పాస్‌పోర్ట్ సేవ‌, ప్ర‌ధాన మంత్రి బీమా యోజ‌న గ‌వ‌ర్న‌మెంట్ స్కీమ్స్ క‌నిపిస్తాయి.
Top Ratedలో యూజ‌ర్లు ఎక్కువ రేటింగ్‌లు ఇచ్చిన స‌ర్వీసుల వివ‌రాలు ఉంటాయి.
Suggestedలోకి వెళితే యూజ‌ర్ల‌కు ఉమాంగ్ యాప్ స‌జెస్ట్ చేసే స‌ర్వీసులు క‌నిపిస్తాయి.
ఇక యాప్ హోం పేజీలో టాప్ బార్‌లో హోమ్ త‌ర్వాత‌ Favourites, All Services, State ట్యాబ్‌లో క‌నిపిస్తాయి
Favouritesలోకి వెళ్లి మీకు న‌చ్చిన స‌ర్వీస్‌ను లవ్ సింబల్‌తో మార్క్ చేస్తే అది మీ ఫేవ‌రెట్స్ లిస్ట్‌లోకి వ‌స్తుంది.
All Servicesలో అన్ని స్టేట్‌, సెంట్ర‌ల్ గ‌వర్న‌మెంట్ స్కీమ్స్‌కు సంబంధించిన స‌ర్వీసులు ఉంటాయి.
State ట్యాబ్‌ను క్లిక్ చేసి మీకు కావ‌ల్సిన స్టేట్‌ను సెలెక్ట్ చేసుకోవ‌చ్చు.డిఫాల్ట్‌గా ఉన్న‌స్టేట్ పేరును మార్చుకోవ‌చ్చు.
యూజ‌ర్ ఫ్రెండ్లీ
హోం  పేజీలో కింద ఫిల్ట‌ర్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏ ర‌క‌మైన స‌ర్వీస్ కావాలి?స‌్టేట్‌, సెంట్ర‌ల్ వంటివి సెలెక్ట్ చేసి ఫిల్ట‌ర్ చేస్తే అవే స‌ర్వీసులు మాత్రమే చూడొచ్చు. పైన ఉండే సెర్చ్ బార్‌లో కూడా టైప్‌చేసి సెర్చ్‌చేసుకోవ‌చ్చు. సెర్చ్ ప‌క్క‌న ఉంటే మూడు గీత‌ల మార్క్‌ను క్లిక్ చేస్తే మ‌రిన్ని ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. అక్క‌డ మీ ప్రొఫైల్‌ను యాడ్ చేసుకోవ‌డం, ఎడిట్ చేసుకోవ‌చ్చు. స‌ర్వీస్ డైరెక్ట‌రీ, ట్రాన్సాక్ష‌న్ హిస్ట‌రీ చూసుకోవ‌చ్చు. డిజిటల్ రూపంలో మీ డాక్యుమెంట్లు దాచుకోవ‌డానికి డిజి లాక‌ర్ సౌక‌ర్యాన్నివాడుకోవ‌చ్చు. సెట్టింగ్స్ మార్చుకోవ‌చ్చు.  ఏదైనా సందేహాలుంటే లైవ్‌చాట్ ఆప్ష‌న్ క్లిక్ చేస్తే ఉమాంగ్ స‌పోర్ట్ టీం సిద్ధంగా ఉంటుంది.
ఎన్నో సేవ‌లు
పాన్ కార్డ్ ఆన్‌లైన్‌లో అప్ల‌యి చేసుకోవ‌చ్చు. క‌రెక్ష‌న్ చేసుకోవ‌చ్చు. పాస్‌పోర్ట్ సేవ ద్వారా పాస్‌పోర్ట్ అప్లికేష‌న్ ప్రాసెస్ స్టార్ట్ చేయ‌వచ్చు. ఈపీఎఫ్ స‌ర్వీస్ ద్వారా ఈపీఎఫ్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు.  ఇలాంటివి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన ప‌దుల కొద్దీ స‌ర్వీసులు ఉమాంగ్‌లో అందుబాటులో ఉంచారు.  కొత్త‌గా సీఐఎస్ఎఫ్ స‌ర్వీస్‌ను ఉమాంగ్‌లో ఎంట‌ర్ చేశారు.  విమాన ప్ర‌యాణికులు త‌మ ల‌గేజ్ ఏమైనా మిస్స‌యితే ఈ సీఐఎస్ఎఫ్ స‌ర్వీస్ ద్వారా కంప్ల‌యింట్ చేయొచ్చు. మీ కంప్ల‌యింట్ స్టేట‌స్‌ను ట్రాక్ చేయొచ్చు కూడా. అంతేకాదు. వీటిలో చాలా సేవ‌ల‌ను ఆఫ్‌లైన్‌లో కూడా ఉప‌యోగించుకునే వీలుంది.