• తాజా వార్తలు
  •  

స్మార్టు ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడానికి గైడ్

    స్మార్ట్ ఫోన్ ను వదల్లేకపోతున్నారా? డేటా అయిపోతుంటే టెన్షన్ వచ్చేస్తుందా... వై-ఫై సిగ్నల్ రాకుంటే కోపమొస్తుందా? బ్యాటరీ అయిపోతుంటే ప్రాణం పోతున్నట్లుగా ఉందా? అయితే మీరు 'నోమోఫోబియా'తో బాధపడుతున్నట్టే.  అర్థం కాలేదా..? నో మొబైల్ ఫొబియా... ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. స్మార్టు ఫోన్ అడిక్షన్ అన్నమాట. విదేశాల్లో తీవ్ర స్థాయిలో ఉన్న ఈ ఫోబియాతో ఇండియాలోనూ చాలామంది బాధపడుతున్నారు. 
    స్మార్ట్ ఫోన్ల యుగంలో తిండి, నిద్ర.. చివరకు సంసారాన్ని కూడా పక్కనపెట్టి ఫోన్ కు అంకితమైపోతున్నారు చాలామంది. ప్రధాని నుంచి చిట్టిపొట్టి చిన్నారుల వరకు అందరికీ సెల్ఫీలు, వాట్సప్ లు, ఫేస్ బుక్ లు… అన్నింటికీ అదే మంత్రం. దీంతో అంతా దానికి బానిసలవుతున్నారు. 
    అమెరికాలోని పలు సంస్థలు నోమో ఫోబియాపై సర్వే కూడా చేశాయి. ఈ సర్వేలో.. జనాభాలో 66 శాతం ఈ ఫోబియోతో బాధపడుతున్నారని తేలింది. మహిళల్లో ఈ ఫోబియా 70 శాతం ఉండగా.. పురుషుల్లో ఇది 61 శాతంగా ఉంది. నిద్రపోయే టైంలో పక్కన ఫోన్ పెట్టుకుని పడుకునే వారు 66శాతంగా ఉన్నారు. 18 నుంచి 24 ఏళ్ల వయసున్న వారిలో నోమో ఫోబియోతో బాధపడుతున్న వారు.. అత్యధికంగా 77శాతం ఉన్నారు. ఇక రెండు మొబైల్ ఫోన్లు యూజ్ చేస్తున్న వారు 47 శాతంగా ఉన్నట్లు సర్వే సంస్థలు తెలిపాయి. నోమో ఫోబియో అనేది మానసిక వ్యాధి అని... వీలైనంత వరకు ఫోన్ కు దూరమైతే ఈ జబ్బు తగ్గిపోతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు.

బయటపడాలంటే...
స్మార్టు ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడం అనేది మన చేతుల్లోనే ఉంది. అవసరం మేరకే ఫోన్ ను వాడితే ఈ నోమోఫోబియా నుంచి బయటపడొచ్చు.
ఏమేం చేయాలి...?
* అత్యవసరమైన అంశాలకు తప్ప మిగతావాటికి నోటిఫికేషన్లు పెట్టొద్దు
* అలారం కోసం ఫోన్ వాడొద్దు. అలా వాడితే దాన్ని నిద్రపోయేటప్పుడు మన పక్కనే ఉంచుతాం. అందుకు బదులుగా అలారం వాచీని అలారం కోసం వాడాలి. పడుకునేటప్పుడు ఫోన్ ను చేతికి అందనంత దూరంలో ఉంచాలి.
* మన చదువుకో, పనికో ఉపయోగపడేవి కాకపోతే చాలా యాప్స్ ను ఫోన్ నుంచి తొలగించేయొచ్చు. గేమ్స్ వంటివి లోడ్ చేయొద్దు. అలాగే.. ఈకామర్స్ యాప్స్ కూడా డిజేబుల్ చేసి ఉంచి అవసరమైనప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి.
* ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా డిజిటల్ డీటాక్సింగ్ యాప్స్ వాడి ఈ ఫోబియా నుంచి బయటపడొచ్చు. డిజిటల్ డీటాక్సింగ్ యాప్స్ మన ఫోన్ వాడకాన్ని విశ్లేషించి ఎంత సమయం వాడుతున్నాం.. ఏం వాడుతున్నాం వంటివన్నీ చెప్పి ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తుంది. ఎప్పుడు ఆపాలో చెప్తాయి.
ఐఓఎస్ లో మూమెంట్, ఫారెస్టు... ఆండ్రాయిడ్ లో ఫారెస్ట్, క్వాలిటీ టైం వంటి యాప్స్ ఇందుకు ఉపయోగపడతాయి.
 

జన రంజకమైన వార్తలు