• తాజా వార్తలు
  •  

సెల్ఫీ ట్రెండ్.. తెలుసా ఫ్రెండ్..!!


సెల్ ఫోన్ స్మార్టుగా మారిపోయాక దానికి కెమేరా వచ్చి చేరడంతో ప్రపంచం ఎంతో మారిపోయింది. ఆ కెమేరా కాస్త ఫోన్ కు ముందువైపునా వచ్చేయడంతో ప్రపంచం ఇంకా పూర్తిగా మారిపోయింది. అది సరదాయో, పిచ్చో, అవసరమో, ఆసక్తో, ఆనందమో కానీ మొత్తానికైతే సెల్ఫీ ట్రెండనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా పాకేసింది. ఇండియాలోనూ అది జోరు మీదుంది. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ఇది రోజురోజుకు పెరుగుతుంది. చాలామంది సెల్ఫీలు తీసుకోవడం కోసమే స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తున్నారట. 2014 తర్వాత వీటిని కొనుగోలు చేసినవారు కనీసం వారానికో సెల్ఫీ దిగుతున్నారట. అంతేకాదు.. సెల్ఫీలు దిగడంలో పురుషుల కంటే మహిళలే ముందున్నారట. ఫొటో నచ్చినట్లు రావడానికి ఒక్కొక్కరు మూడు సార్లు ఫొటో దిగుతున్నారు. సెల్ఫీ ట్రెండ్ పై ఏసీ నీల్సన్‌ సంస్థ చేసిన సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
గ్రూప్ సెల్ఫీలు..
పది సెల్ఫీల్లో ఆరు గ్రూపుగా దిగేవే ఉంటున్నాయి. ఫొటోలు తీసుకునేందుకు పది కెమెరాలు వినియోగిస్తుంటే అందులో ఆరు మొబైల్ ఫ్రంట్ కెమేరాలే. గ్రూప్ సెల్ఫీలు తీసుకోవడంలో దాదాపుగా అందరు ఒకే రకమైన ఇబ్బంది పడుతున్నారట.. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకే ఫ్రేమ్ లో ఇమడక ఇబ్బంది పడుతున్నారు.
సెల్ఫీ తీసేయ్.. సోషల్ మీడియాలో పెట్టేయ్
స్వీయచిత్రాలు దిగడమే ఆలస్యం.. క్షణం ఆలస్యం చేయకుండా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వాటిని ఉంచుతున్నారు. తమ అనుభవాలను అందరితో పంచుకునేందుకు అలా చేస్తున్నామంటూ 75 శాతం మంది సర్వేలో తెలిపారు. 82 శాతం మంది ఫేస్‌బుక్‌లోనే పోస్ట్‌ చేస్తున్నారు.
అంత ఈజీయేం కాదులే..
సెల్ఫీలు తీసుకోవడంలోనూ కష్టాలున్నాయట. 66 శాతం మంది గ్రూపుగా ఫొటో తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కచ్చితంగా అది వచ్చేందుకు 96 శాతం మంది ఎక్కువ సార్లు తీసుకుంటున్నారు. సగటున మూడుసార్లు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నిస్తే ఒకే ఫ్రేమ్‌లోకి అందరూ రాకపోవడంతో తప్పడం లేదని 66 శాతం తెలిపారు. మరో 50 శాతం మందేమో వెలుతురు సక్రమంగా లేకపోవడమూ ఒక కారణమని చెప్పారు. 47 శాతం మంది ఫొటో వెనుక ప్రదేశం సరిగ్గా రాలేదని వివరించారు. ఈ అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ సెల్ఫీలు తీసుకునేవారిలో మహిళలే ఎక్కువ. 48 శాతంతో వారు మొదటిస్థానంలో ఉన్నారు. ఇక పురుషుల విషయానికొస్తే 40 శాతమే. వయసుల వారీగా పరిశీలిస్తే 16-20 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువ తీసుకుంటున్నారు. వారి వాటా 58 శాతం కాగా.. 36-40 ఏళ్ల మధ్యనున్న వారు 23 శాతం. 89% కుటుంబసభ్యులు,మిత్రులతో, 66% తామొక్కరే , 61% ఏదైనా ప్రముఖ కట్టడం లేదా ప్రదేశం వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారట.

జన రంజకమైన వార్తలు