• తాజా వార్తలు

లైక్ చేసేముందు జాగ్రత్త

ముందే ఎక్కువ లైక్స్ ఉన్న పోస్ట్ ని ఎడిట్ చేసి

కొత్త పోస్ట్ గా బ్రమింప చేస్తున్న కేటుగాళ్ళు 

ఈ మధ్య కాలంలో ప్రపంచం లో అత్యంత ప్రభావశీల వ్యసనాలలో మొదటివరుసలో నిలిచే వ్యసనం ఫేస్ బుక్. అవును ఇది ఖచ్చితంగా నిజం. దీని గురించి మన కంప్యూటర్ విజ్ఞానం వార్షికోత్సవ సంచికలో ప్రత్యేకంగా కవర్ పేజి కథనాన్ని ఇవ్వడం జరిగింది. సరే ఇంతకీ విషయం ఏమిటంటే ఫేస్ బుక్ ఉపయోగించేవారు తరచుగా చేసే పని వారికి నచ్చిన పోస్ట్ ను లైక్ ,కామెంట్ లేదా షేర్ చెయ్యడం. ఆ తర్వాత తాము పోస్ట్ లేదా షేర్ చేసిన దానికి ఎన్ని లైక్ లు షేర్ లు వచ్చాయో చూసి మురిసిపోవడం. ఇంతవరకూ బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు కథ మొదలయింది. మీరు ఏదైనా పోస్ట్ ను లైక్ లేదా షేర్ చేసేటపుడు ఆ పోస్ట్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు చూస్తున్నారా? లేక ఆకర్షణీయంగా ఉంది కదా అని గుడ్డిగా లైక్ చేసేస్తున్నారా? ఒక వేళ మీరు గుడ్డిగా చేస్తునట్లయితే మీరు ఆన్ లైన్ మోసగాళ్ళ లేదా నేరగాళ్ళ వలలో పడినట్లే! అది ఎలాగంటరా ? అయితే ఈ ఆర్టికల్ చదవండి.

పెరుగుతున్న టెక్నోలజి తో పాటుగా ఎంతో చక్కగా అప్ డేట్ అయ్యే రంగం ఏదైనా ఉంది అంటే అది నేర రంగమే. అవును ఇక్కడ ఫేస్ బుక్ లో కూడా సరిగా ఇలాగే జరుగుతుంది. ఫేస్ బుక్ లో ఎక్కువ లైక్ లు లేదా షేర్ పొందిన పోస్ట్ అన్నింటికంటే ముందు వరుసలో ఉంటుంది.అంటే ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని ఆధారంగా తీసుకున్న ఆన్ లైన్ నేరగాళ్ళు తమ అతివాద విస్తరణకు ఫేస్ బుక్ ను వేదికగా మలచుకుంటున్నారు. ఉదాహరణకు ఎంతో ఆకర్షణీయం గా గానీ లేదా ఎంతో ప్రభావ కారకంగా గానీ ఉండే విధంగా లేదా చూడగానే ఆకట్టుకునే విధంగా గానీ ఉండే విధంగా ఉండే ఒక అంశాన్ని వీరు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తారు. సాధారణంగానే అందరూ దానిని లైక్ మరియు షేర్ చేస్తారు. ఇక్కడనుండీ ఈ నేరగాళ్ళు తమ తెలివితేటలను ఉపయోగిస్తారు. వీరు కోరుకున్న సంఖ్యలో లైక్ లూ, షేర్ లు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ లో ఉన్న అంశాన్ని తమకు నచ్చిన విధంగా ఉండేలా ఎడిట్ చేస్తారు. ఈ ఎడిట్ చేసిన అంశం ఉగ్రవాద సంబందితం అయి ఉండవచ్చు, లేదా యువతను పెడదారి పట్టించేది అయి ఉండవచ్చు, లేదా ఆన్ లైన్ మోసాలకు సంబందించినది అయి ఉండవచ్చు, లేదా కొంతమంది తమ గొప్పలను చెప్పుకునే అంశం అయి ఉండవచ్చు. అంటే మీకు తెలియకుండా ఒక అపరిచిత పోస్ట్ కు మీరు చేసిన లైక్ లేదా షేర్ వల్ల ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ మీరు మోసగాళ్ళకు సహాయపడుతున్నారన్నమాట!

అంతేకాదు ఈ నేరగాళ్ళు, వినియోగదారుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లనుండి నగదును తస్కరించడానికి కొన్ని ఉత్పత్తులను అమ్మేవిధంగా ఉండే నకిలీ పేజి లను కూడా సృష్టిస్తున్నారు. ఆ వస్తువులను కొనే మోజులో పడి మీ కార్డు తో ఖరీదు చేసినట్లయితే మీరు మోసపోయినట్లే. మీ కార్డు వివరాలతో పాటు మీ డబ్బు కూడా చోరీ చేయబడుతుంది. కాబట్టి ఫేస్ బుక్ లో లైక్ లేదా షేర్ చేసేటపుడు కానీ ఏదైనా వస్తువును కొనాలని అనుకున్నపుడు కానీ తస్మాత్ జాగ్రత్త!

 

జన రంజకమైన వార్తలు