• తాజా వార్తలు

అభిమానుల కోసం ఐపీఎల్ ఆట‌గాళ్ల ఎమోజీలు త‌యారు చేసిన ట్విట‌ర్

ప్ర‌పంచంవ్యాప్తంగా ట్విట‌ర్‌ను ఉప‌యోగించే వారి సంఖ్య పెరుగుతోంది. భార‌త్‌లో వీరి సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థ ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. భార‌త్‌లో ఇప్పుడు ఐపీఎల్ సీజ‌న్. క్రికెట్ ప్రియులు త‌మ అభిమాన ఆట‌గాళ్ల‌ను చూడ‌టానికి స్టేడియాల‌కు క్యూ క‌డుతున్నారు. కుద‌ర‌ని వాళ్లు టీవీల ముందు వాలిపోతున్నారు. అదీ కుద‌ర‌ని వాళ్లు సోష‌ల్ మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఐపీఎల్ స్కోర్లు, ఐపీఎల్ ఆట‌గాళ్లకు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అందించ‌డానికి సోష‌ల్ మీడియా సైట్లు ట్విటర్‌, ఫేస్‌బుక్ పోటీప‌డుతున్నాయి.
ఫేస్‌బుక్ నుంచి పోటీని త‌ట్టుకోవ‌డానికి ట్వ‌ట‌ర్ భిన్న ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాంటి భిన్న ప్ర‌య‌త్న‌మే ఆట‌గాళ్ల ఎమోజీలు. ఎమోజీలు సాదార‌ణంగా చాటింగ్‌లో వాడుతుంటాం. కానీ ట్విట‌ర్ త‌న చాటింగ్‌లో ఈ ఎమోజీలను తీసుకొచ్చింది. అభిమానులు త‌మ‌కు న‌చ్చిన ఆట‌గాడికి సంబంధించిన ఫొటోతో ట్విట్లు చేయ‌చ్చు. అదీ ఈ ఎమోజీల ప్ర‌త్యేక‌త‌. ట్విట్ చేసే ముందు హాష్ టాగ్ పెట్టి త‌మ అభిమాన ఆట‌గాడి పేరు టైప్ చేస్తే... ఆ ఆట‌గాడి ఎమోజీ వ‌చ్చేస్తుంది. ఆ త‌ర్వాత మ‌నం ట్విట్ చేయ‌చ్చు. ఉదాహ‌ర‌ణకు మీకు విరాట్ కోహ్లి ఇష్ట‌మైతే అత‌ని పేరు ముందు హాష్‌టాగ్ పెట్ట‌గానే ఎమోజీ ప్ర‌త్య‌క్షం అవుతుంది. ఆ త‌ర్వాత మ‌నం ట్విట్ చేసుకోవ‌చ్చు.
ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్‌లో ఆడుతున్న 30 మంది పెద్ద స్టార్ల ఎమోజీల‌ను త‌యారు చేసి ట్విట‌ర్ సిద్ధంగా ఉంచింది. ఇక వాడుకోవ‌డం అభిమానుల వంతు. ఏ ఆట‌గాడికి ఎంత‌మంది అభిమానుల మద్ద‌తు ఉందో ఈ హాష్‌టాగ్‌ల ద్వారా వ‌చ్చిన ట్విట్ల‌ను కౌంట్ చేసి లైవ్ బ్రాడ్‌కాస్టింగ్‌లో చూపించనున్న‌ట్లు ఐపీఎల్ నిర్వాహ‌కులు తెలిపారు. అంతేకాదు ఈసారి ప‌దో ఐపీఎల్ సీజ‌న్ సంద‌ర్భంగా కూడా ట్విట‌ర్ కొన్ని ప్ర‌త్యేక ఎమోజీల‌ను అందుబాటులో ఉంచింది. యాష్‌టాగ్ పెట్టి ఐపీఎల్ అని టైప్ చేస్తే ఎమోజీ వ‌స్తుంది. అప్పుడు మ‌నం ట్విట్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు