• తాజా వార్తలు
  •  

ట్రిపుల్ ఐటి నూజివీడు లో అనుభవాలు.

నా పేరు నామతోటి  శివ .మాది గుంటూరు జిల్లా లోని ఒక మారుమూల పల్లెటూరు.పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించినందుకు గానూ నూజివీడు నందలి ట్రిపుల్ ఐటి లోని ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు లో ప్రవేశం లభించింది.

ఆంధ్రపదేశ్ ట్రిపుల్ ఐటి విద్యాసంస్థల లో మాది మొదటి బ్యాచ్ అయినందుకు ఒకింత గర్వం గానూ మరింత ఆనందం గానూ అనిపించింది.నేడు పేరుమోసిన కార్పోరేట్ విద్యాసంస్థల తో పోల్చితే ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపించింది. ఎందుకంటే మన రాష్ట్రం లోని ఏ కార్పోరేట్ జూనియర్ కాలేజీ లో చదివినా సరే రెండు సంవత్సరాలకు కలిపి సుమారు లక్ష రూపాయల ఖర్చు అయి ఉండేది.ఆ రకంగా మా కుటుంబానికి లక్ష రూపాయల వరకూ ఆదా అయింది.డబ్బు ఆదా  మాత్రమే కాక నాణ్యమైన విద్యను పొందగలిగాను. ట్రిపుల్ ఐటి నూజివీడు కొత్తగా ప్రారంభించిన విద్యాసంస్థ అయినప్పటికీ అత్యద్భుతమైన సౌకర్యాలను సరికొత్తగా అందించింది. అక్కడ మొదటిగా రెండు సంవత్సరాల PUC కోర్సు (ఇంటర్ మీడియట్ ) ఉంటుంది.దీనిని MBIPC అని పిలుస్తారు.కామన్ కోర్సులైన మాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ లతో పాటు గా బయాలజీ ని కూడా నేర్చుకున్నాము.నా PUC లో నేను 93.7 మార్కులను సాధించాను.ఇంటర్ తర్వాత మేము ఇంజినీరింగ్ కోర్సు చదవవలసి వచ్చింది.కానీ ఇంజినీరింగ్ లో ఏ కోర్సు చదవాలి అన్న విషయం పై నాకు అవగాహన లేదు. ప్రస్తుతం మార్కెట్ లో బాగా గిరాకీ ఉన్న కోర్సు కంప్యూటర్ సైన్సు అయినప్పటికీ ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్,మెకానిక్స్ ల గురించి విచారణ చేయడం మొదలు పెట్టాను.మా మావయ్య అయిన శివయ్య ఎలక్ట్రికల్ లో డిప్లొమా చేసి ఉండడంతో దాని గురించి కొంచెం అవగాహన ఉంది. నాకు ఏం కావాలన్నా ఆయననే అడిగే వాడిని.ఉద్యోగ అవకాశాలు,ఉన్నత విద్య తదితర అంశాలను విశ్లేషణ చేసుకుని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేయాలని  నిర్ణయించుకున్నాను.కానీ మా ట్రిపుల్ ఐటి విద్యా సంస్థ ఆ కోర్సు ను ఆఫర్ చేయడం లేదు కాబట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ను ఎంచుకున్నాను.నా జీవితంలో విజయానికి దారితీసిన రెండవ అడుగు గా దీనిని అభివర్ణించవచ్చు.

ఏ విద్యార్ధి అయినా ఈ దశలో ఇంజినీరింగ్ లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని మదన పడే వారికీ ఒక చిన్న సలహా.మీకు అభిరుచి ఉన్న రంగాన్ని ఎంచుకోండి.తర్వాత ఇంజినీరింగ్ లో ఉండే మిగతా బ్రాంచ్ ల గురించిన సమాచారాన్ని సేకరించి మీ అభిరుచికి తగినట్లు విశ్లేషణ చేసుకుంటే ఒక స్పష్టమైన అవగాహన వస్తుందనేది నా అభిప్రాయం.

ట్రిపుల్ ఐటి లో నా ఇంజినీరింగ్ విద్య చాలా బాగా గడిచింది.నేను తరగతి లో నేర్చుకోని చాలా విషయాలను నేర్చుకునే అవకాశం ఇంజినీరింగ్ నాకు కల్పించింది.ఉపాధ్యాయుల మీద తక్కువ ఆధార పడుతూ నా స్వంతంగా నేర్చుకునే తత్వాన్ని నేను అక్కడ అలవరచుకున్నాను.బట్టీ పట్టే విధానానికి బదులు అలోచించి కష్టపడి నేర్చకునే తత్త్వం కూడా నాకు అక్కడ అలవడింది.నాలాగా తెలుగు మీడియం నుండి వచ్చిన విద్యార్థులకు ఇంగ్లీష్ ఖచ్చితంగా ఒక సమస్య గా ఉంటుంది.కానీ ఆ సమస్యను అత్యంత చాకచక్యం గా అధిగమించే పరిస్థితులను నాకు ట్రిపుల్ ఐటి కల్పించింది.ఆ సమస్యను అధిగమించడానికి నేను హిందూ న్యూస్ పేపర్ ను బిగ్గరగా చదివే వాడిని.అది నా ఆంగ్ల బాషా ఉచ్చారణ,రచనా నైపుణ్యాలను ఎంతగానో మెరుగు పరిచింది.అప్పుడప్పుడూ మేము  తరగతి గదిలో నిర్వహించే చిన్న చిన్న చర్చలలో పాల్గొనడం ద్వారా నా సంభాషణా నైపుణ్యాలను కూడా మెరుగు పరచుకోగలిగాను.కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాదు గానీ అకడమిక్ సబ్జెక్టు లలో కూడా మేము బృందాలుగా ఏర్పడి చర్చించుకోవడం ద్వారా మా సందేహాలను చాలా వరకూ నివృత్తి చేసుకోగలిగే వారము.అంతేగాక వాటిద్వారా మా ఆలోచనలను ఒకరికి ఒకరం పంచుకునే వారము.గ్రూప్ స్టడీస్ అనేవి ప్రతి ఒక్క విద్యార్థికీ చాలా అవసరం.ట్రిపుల్ ఐటి లో మాకు ఆ అవకాశం దొరికింది.నేను  అక్కడ చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నాను.నా స్నేహితుల నుండి చాలా నేర్చుకున్నాను.ఎక్కడా కూడా మేము మా చదువును నిరక్ష్యం చేయలేదు.అలాంటి వాతావరణాన్ని మాకు మా కాలేజి కల్పించింది.

ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు గేట్ ఎంట్రన్స్ రాయడం ద్వారా IIT గౌహతి లో ఎం.టెక్ చదవడానికి అడ్మిషన్ లభించింది.ఆ వివరాలను IIT వ్యాసం లో ఇవ్వడం జరిగింది.

నామతోటి  శివ, C.V.R.,  I.I.T. గౌహతి

 

జన రంజకమైన వార్తలు