• తాజా వార్తలు

ఆటోమేషన్ దెబ్బను ఎదుర్కోవడానికి బిల్ గేట్స్ ప్లాన్ ఇదీ..

వాహనం కొంటే పన్ను, అందులో పెట్రోలు పోయిస్తే పన్ను.. ఏ వస్తువు కొన్నా ట్యాక్సు.. ఏం తిన్నా ట్యాక్సే.. ఉద్యోగం చేస్తే పన్ను.. సంపాదించిన డబ్బుపై పన్ను.. ఇలా ప్రతిదానికీ ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. అలాంటప్పుడు  మనిషికి ప్రత్యామ్నాయంగా ఎన్నో పనులు చక్కబెట్టేయగలిగే నయా రోబోలకు ఎందుకు పన్ను వేయకూడదు..? మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు ప్రపంచం ముందు ఇదే ప్రశ్న ఉంచారు. మనుషుల ఉద్యోగాలను తన్నుకుపోతున్న రోబోలపైనా(ఆటోమేషన్‌) పన్నులు వేయాల్సిందేనంటున్నారాయన.
       కార్యాలయాల్లో ఆటోమేషన్‌ తో పనులు చేయిస్తే అందుకు కచ్చితంగా పన్నులు ఉండాల్సిందేనన్నది బిల్ మాట. ప్రస్తుతం ఒక ఉద్యోగి ఫ్యాక్టరీలో 50,000 డాలర్ల విలువైన పనిచేస్తే ఆ ఆదాయంపై ఆదాయపన్ను, సామాజిక భద్రతా పన్ను వంటివి ఉన్నాయి. ఒకవేళ ఇదే పనిని చేసేందుకు ఓ రోబో వస్తే దానిపైనా ఇదే స్థాయిలో పన్ను విధించాలన్నది ఆయన వాదన.  రోబోలను వినియోగిస్తున్న కంపెనీలపై ప్రభుత్వాలు పన్నులు విధించాలని ఆయన సూచిస్తున్నారు.
       అయితే, గేట్స్ ఇంతకీ ఈ ప్రపోజల్ ఎందుకు తెచ్చారో తెలుసా.. ఆటోమేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీసం కోట్లాది ఉద్యోగాలు పోతాయన్నది అంచనా. దీంతో ఆటోమేషన్‌ స్పీడుకు బ్రేకులేసేందుకు ఇది అవసరం అంటున్నారాయన. మానవులు మాత్రమే చేయగలిగే పనులు చాలా ఉంటాయని... వాటికి కావాల్సిన నిధులను మిగతా రంగాల్లో ఆటోమేషన్ పై విధించిన పన్ను నుంచి సమీకరించుకోవాలని బిల్ చెబుతున్నారు.  అంతేకాదు.. ఇలాంటి పన్ను లేకుంటే మానవ వనరులు తగ్గిపోవడం వల్ల ప్రభుత్వాలకు పన్ను ఆదాయం బాగా తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
       అయితే, గేట్స్‌ సూచన పూర్తిగా ఆమోదయోగ్యం కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు.  మరోవైపు రోబోల వల్ల ఉపాధి కోల్పోయేవారికి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా నిధుల కోసం రోబో యజమానులపై పన్నుల విధింపు ప్రతిపాదన ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ చట్టసభ ముందుకు వచ్చింది. కానీ.. అక్కడి సభ్యులు దాన్ని తిరస్కరించారు.
 ఆటోమేషన్ ఎఫెక్టు మామూలుగా ఉండదు..
 ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే ఆటోమేషన్ వైపు మళ్లుతోంది. ఇది ఉద్యోగాలను పోగొట్టడం ఖాయమంటున్నారు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు. ఆటోమేషన్, టెక్నాలజీ అభివృద్ధి వల్ల దేశంలో 2025 నాటికి 20 కోట్ల మంది మధ్యతరగతి యువతకు ఉపాధి అవకాశాలు దూరం కావొచ్చని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ గతంలో అంచనా వేశారు.
 * 2025 నాటికి 21-41 ఏళ్ల మధ్యలో ఉన్న వారి సంఖ్య 20 కోట్లుగా ఉంటుంది. ఆటోమేషన్ పూర్తిస్థాయిలో వచ్చేస్తే వీరందరికీ ఉద్యోగాలు దొరకడం కష్టమే.
 * కంపెనీలు ఆటోమేషన్ వైపు చూస్తుండడంతో కొన్ని రకాల ఉద్యోగాలు పోవడం గ్యారంటీ. అయితే.. ఇవన్నీ ఆల్‌గరిథమ్ బేస్డ్ కావడంతో  సృజనాత్మకత అవసరమైన ఉద్యోగాలకు భయం ఉండకపోవచ్చు.
 * ఇప్పటికే ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు రోబోలతో పని చేయించుకుంటున్నాయి.
 * ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాల్లో ఆటోమేషన్ ముప్పు ఎక్కువగా ఉంది.
 * ఏటీఎం, డిజిటల్ పేమెంట్స్ వంటి వాటి వల్ల చెల్లింపుల వ్యవస్థలో ఆటోమేషన్ ప్రవేశించడంతో బ్యాంకింగ్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. దీనికి అమెరికాయే ఉదాహరణ. ఆటోమేషన్ కారణంగా గడచిన కొన్ని ఏళ్లుగా అక్కడ కాల్ సెంటర్స్‌లో ఉద్యోగాలు తగ్గిపోయాయి.
 * ఫిలిప్పీన్స్, యూకేలోనూ ఇలాంటి పరిస్థితులే ఇప్పటికే వచ్చేశాయి.

జన రంజకమైన వార్తలు