• తాజా వార్తలు

కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లకు ఉద్యోగం వరించకపోవడానికి కారణాలు ఇవే

మన దేశం లో ఇంజినీరింగ్ కాలేజీ లకు కొదువలేదు. ఇక ప్రతీ సంవత్సరం ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటకు వస్తున్నవిద్యార్థులు సంఖ్య అయితే లక్షల్లోనే ఉంటుంది. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు వృత్తి విద్యా పట్టా తీసుకుని బయటకు వస్తుంటే వీరిలో ఎంత మంది ఉద్యోగం సంపాదిస్తున్నారు? అనే ప్రశ్న వేస్తే మాత్రం దిగ్భ్రాంతి కరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతీ 100 మంది లో కనీసం పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా క్యాంపస్ ఇంటర్ వ్యూ లలో సెలెక్ట్ కాలేకపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిని విశ్లేషించాలి అంటే అది ఒక పెద్ద గ్రంథం అవుతుందేమో! అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇంజినీరింగ్ పట్టా ద్వారా వస్తున్న ఉద్యోగాలు. సాధారణంగా నైపుణ్యాలు ఉన్న విద్యార్థులు క్యాంపస్ ఇంటర్ వ్యూ లలో సెలెక్ట్ అవుతారు. మిగతా ఉద్యోగార్థులు తమ పట్టా తీసుకున్న తర్వాత ఆయా ఉద్యోగానికి కావలసిన సాంకేతిక నైపుణ్యాలను వివిధ కోర్సులు నేర్చుకోవడం ద్వారా మెరుగు పరచుకుని ఆ తర్వాత ఉద్యోగం పొందుతారు. ఇది గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ పట్టబద్రులు ఉద్యోగాలు పొందుతున్న సరళి. అయితే గత సంవత్సరం నుండీ ఈ ట్రెండ్ కు బ్రేక్ పడింది. ఐటి కంపెనీలు క్యాంపస్ ఇంటర్ వ్యూ ల ద్వారా తీసుకునే ఉద్యోగుల సంఖ్య ను భారీగా తగ్గించేసాయి. ఇక మిగతా వారి సంగతి సరే సరి. దీనికి కారణాలు విశ్లేషించే ముందు ఐటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను ఏ స్థాయిలో తగ్గిస్తున్నాయో గణాంకాల తో సహా చూద్దాం. అ తర్వాత కారణాలు విశ్లేషిద్దాం.

ఐటి కంపెనీలలో ఉద్యోగ నియామకాల సరళి

గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల కాలం లో భారతదేశం లోని టాప్ 6 ఐటి కంపెనీలు తమ ఉద్యోగులలో 13,402 మందిని తొలగించడం జరిగింది. దీనికి ముందు సంవత్సరం ఇదే సమయానికి 60,240 మందిని క్రొత్తగా చేర్చుకోవడం విశేషం.

గత సెప్టెంబర్ 30 వ తేదీనాటికి విప్రో యొక్క ఉద్యోగుల సంఖ్య 1,63,759 గా ఉండగా కేవలం మూడు నెలలలో అంటే డిసెంబర్ నాటికి సుమారు 1200 ల ఉద్యోగాలు తగ్గి వీరి సంఖ్య 1,62,553 గా ఉంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS ) కూడా తన ఉద్యోగుల సంఖ్య ను భారీగా తగ్గించివేసింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఇది 3,657 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంది. ఒక సంవత్సరం ముందు ఇదే సమయానికి ఈ కంపెనీ చేర్చుకున్న 24,654 మంది ఉద్యోగులతో పోలిస్తే ఇది 85% తక్కువ.

గత సంవత్సరం విప్రో క్యాంపస్ ఇంటర్ వ్యూ ల ద్వారా అడ్వాన్సు గా సుమారు 40,000 ల ఉద్యోగాలు కల్పిస్తే ఈ సంవత్సరం ఆ పరిస్థితి ఏ మాత్రం కనపడడం లేదని విప్రో చెబుతుంది.

గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి దేశం లోని టాప్ 4 ఐటి కంపెనీలు కలిపి కేవలం 14,421 ఉద్యోగాలు మాత్రమే కల్పించగలిగాయి. క్రితం సంవత్సరం తో పోలిస్తే ఇది 43% తక్కువ.

దీనికి కారణాలు ఏమిటి?

ఐటి కంపెనీలలో ఈ స్థాయిలో ఉద్యోగాల సంఖ్య లో కోత పడడానికి కారణం ఆటోమేషన్ మరియు ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ గా చెప్పుకోవచ్చు. ఆటోమేషన్ వలన కొంతమంది వ్యక్తులు కలిసి చేసే పనిని ఒక్క యంత్రం చేస్తుండడం తో మానవ వనరులపై ఆధార పడవలసిన అవసరం లేకుండా పోయింది. దీని ఫలితం ఉద్యోగాలపై పడింది. క్యాంపస్ ఇంటర్ వ్యూ ల ద్వారా ఎక్కువ సంఖ్య లో నియామకాలు చేసుకునే ఐటి కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అడ్వాన్స్డ్ నైపుణ్యాలు ఉన్న వారిని మాత్రమే రిక్రూట్ చేసుకుంటూ ఉండడం తో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. అంటే క్యాంపస్ ఇంటర్ వ్యూ ల ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన అనేది ఇక గతం అవ్వనుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అడ్వాన్స్డ్ నైపుణ్యాలు మరియు మారుతున్న టెక్నాలజీ కి తగ్గట్లు తమ స్కిల్స్ ను మెరుగుపరచుకోగల సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే ఇకపై ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉండడం తో మామూలు ఇంజినీరింగ్ పట్టభద్రుల సంగతి అగమ్య గోచరంగా ఉంది. వీరిలో మెజారిటీ శాతం మంది ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ రంగం లో ఉద్యోగాల  కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. మిగిలిన వారు తమ నైపుణ్యాలు మెరుగుపరచుకునే పనిలో ఉండగా ఎక్కువ మంది ఏదో ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం లో చేరి అది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా సర్దుకుపోతున్నారు.ఇండియా లో ప్రస్తుతం 3.9 మిలియన్ ల మంది ఐటి ఉద్యోగులు ఉన్నారు. 2022 నాటికి ఇండియా మరియు US లో ఉన్న ఐటి ఉద్యోగుల సంఖ్య 7-10% తగ్గే అవకాశం ఉందని Hfs రీసెర్చ్ సర్వే చెబుతుంది.

 

జన రంజకమైన వార్తలు