• తాజా వార్తలు
  •  

యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాద‌న ఎలా ఉంటుందో తెలుసా!

ఇంట‌ర్నెట్ ఓపెన్ చేయ‌గానే గూగుల్ త‌ర్వాత ఎక్కువ‌మంది ఉప‌యోగించేది యూట్యూబ్ అంటే అతిశ‌యోక్తి కాదు. ఏం వీడియో కావాల‌న్నా మ‌నం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తాం. రోజూ కొన్ని కోట్ల వీడియోల‌ను ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు చూస్తున్నారు. నెట్ బాగా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత యూట్యూబ్ వాడ‌కం కూడా బాగా పెరిగిపోయింది. అయితే యూట్యూబ్‌లు చూడ‌డం మాత్ర‌మే కాదు యూట్యూబ్‌లో వీడియోలు పెట్ట‌డం ద్వారా పెద్ద ఎత్తున సంపాదించేవాళ్లు మ‌న మ‌ధ్యేనే చాలామంది ఉన్నారు. కానీ చాలా మందికి అస‌లు యూట్యూబ్‌లో వీడియోలు పెడ‌తారో. . వాటి ద్వారా నిజంగా డ‌బ్బులు వ‌స్తాయా అనే అనుమానాలు ఉంటాయి. కానీ మ‌నం స‌రిగా ప్లాన్ చేసుకుని.. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకెళితే యూట్యూబ్ నిజంగా ఒక అక్ష‌య‌పాత్రే.

సంపాద‌న ఎలా!
యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోలు అప్‌లోడ్ చేస్తే చాలు డ‌బ్బులు వ‌చ్చేస్తాయ్ అనుకుంటారు చాలా మంది. కానీ యూట్యూబ్‌లో సంపాదించాలంటే చాలా ఫ్యాక్ట‌ర్లు ఉన్నాయి. యూట్యూబ్ పెట్టి ఐదేళ్లు గ‌డిచి ప్ర‌తి నెలా.. 1 మిలియ‌న్ వ్యూస్ వస్తుంటే మీకు డ‌బ్బులు కూడా బాగానే వ‌స్తున్న‌ట్లు లెక్క‌. అయితే మీరు 1000 వ్యూస్‌కు డ‌బ్బులు వ‌స్తాయా అనే లెక్క‌లు వేసుకున్న‌ట్ల‌యితే డ‌బ్బుల గురించి ఆలోచించ‌క్కర్లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఎర్నింగ్ చాలా కార‌కాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. నిజానికి మ‌హా మ‌హా పండితులే దీనికి స‌రైన లెక్క‌లు చెప్ప‌లేక‌పోయారు. కాస్ట్ ఫ‌ర్ థౌజండ్ వ్యూస్, కాస్ట్ ఫ‌ర్ ఇంప్రెష‌న్ లాంటివి యూట్యూబ్ ఎర్నింగ్స్‌లో కీల‌కం. అంతేకాదు దేశం, వీడియో టైప్‌, యాడ్స్ ధ‌ర‌లు, యాడ్ బ్లాక్ ఇవ‌న్నీ కీల‌క పాత్ర పోషిస్తాయి.

యూట్యూబ్ పార్ట‌న‌ర్ ప్రోగ్రామ్‌
యూట్యూబ్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి ప్ర‌ధాన మార్గం పార్ట‌న‌ర్ ప్రోగ్రామ్‌. ప్ర‌తి వీడియో ప్లే అయ్యే ముందు వ‌చ్చే 5-10 సెక‌న్ల యాడ్స్‌ ఈ ప్రోగ్రామ్‌లో భాగ‌మే. కానీ ఈ యాడ్స్ మీకు రావాలంటే ముందు మీ ఛానల్‌ను మోనిటైజ్ చేసుకోవాలి. అంతేకాదు ఒరిజిన‌ల్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయాలి. కాపీరైట్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తే వెంట‌నే యాడ్స్ డిజ్ అపీయ‌ర్ అవుతాయి. ఈ వీడియోల్లో ఉంచే యాడ్స్ ద్వారానే మీకు ఆదాయం వస్తుంది. వీడియోల‌కు వ‌చ్చే ట్రాఫిక్‌ను బ‌ట్టే ఆదాయం వ‌స్తుంది. అంటే ఒక యాడ్‌కు అడ్వ‌ర్టేజ‌ర్ 100 డాల‌ర్లు ఇస్తే హోస్టింగ్ చేసినందుకు గూగుల్ 45 డాల‌ర్లు తీసుకుని మ‌న‌కు 55 డాల‌ర్లు ఇస్తుంది.

సెకండ‌రీ ఆదాయం..
పార్ట‌న‌ర్ ప్రోగ్రామ్ ద్వారా వ‌చ్చే ఆదాయం కాకుండా ఇది మ‌న సొంత ఆదాయం. మ‌న ఛానెల్ పాపుల‌ర్ అయిన త‌ర్వాత మ‌న‌కు భారీగా స‌బ్‌స్కైబ‌ర్లు పెరిగిన త‌ర్వాత అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి పెద్ద సంస్థ‌లే మ‌న‌ల్ని అప్రోచ్ అవుతాయి. త‌మ బ్రాండ్ యాడ్స్‌ను మీ యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాల్సిందిగా కోర‌తాయి. దీని ద్వారా వ‌చ్చే ఆదాయం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అంటే స్పాన్స‌ర్డ్ వీడియోల‌కు 400 నుంచి ౨౦౦౦ డాల‌ర్ల వ‌ర‌కు మ‌నం సంపాదించొచ్చు. అంటే ఫుల్‌టైమ్ యూట్యూబ‌ర్ల‌కు ఇది చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

ప్ర‌ముఖ ఛానెల్స్‌కు ఎంత వ‌స్తుందంటే..
గేమింగ్ వీడియోల‌కు పాపుల‌ర్ అయిన ప్యూడిపై ఛానెల్ 2013లోనే ఏడాదికి 4 మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం సంపాదించింది. ఈ ఛానెల్‌కు స‌బ్‌స్కైబ‌ర్ల సంఖ్య 3 మిలియ‌న్ల మంది అంటే ఏ స్థాయిలో పాపుల‌ర్ అయిందో అర్థం చేసుకోవ‌చ్చు. బ్యూటీ టిప్స్‌కు పేరుగాంచిన ఓల్గా కే ఆదాయం విష‌యంలోనూ ముందుంది. 8 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్న ఈ ఛానెల్ గ‌త మూడేళ్లుగా ల‌క్ష డాల‌ర్ల నుంచి 1,30,000 డాల‌ర్ల మ‌ధ్య స్థిరంగా ఆదాయం సంపాదిస్తున్న‌ట్లు తెలిపింది. ప్ర‌తి 1000 వ్యూస్‌కి ఈ ఛానెల్‌కు 5 డాల‌ర్లు ఆదాయం వ‌స్తోంది. అన్ని ర‌కాల కంటెంట్ల‌తో వీడియోలు పెట్టే వీక్సిడ్ ఛానెల్‌కు 3 ల‌క్ష‌ల మందికి పైగా స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. ఇది 18 మిలియ‌న్ వ్యూస్‌కే 26 వేల డాల‌ర్లు సంపాదించింది ఈ ఛానెల్‌. పిల్ల‌ల ఛానెల్ చూ చూ టీవీ కూడా ఈ రేసులో ముందంజ‌లో ఉంది.

జన రంజకమైన వార్తలు