• తాజా వార్తలు
  •  

ఎయిర్‌టెల్‌ మొబైల్ ట‌వ‌ర్‌తో ఆదాయం

ఎయిర్‌టెల్‌.. భార‌త్‌లో అతి పెద్ద మొబైల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ‌. ఇప్పుడంటే జియో వ‌చ్చి ఎయిర్‌టెల్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసింది కానీ.. జియో రాకముందు ఎయిర్‌టెల్‌ను కొట్టేవాళ్లే లేరు. దేశ‌వ్యాప్తంగా భార‌తీ ఎయిర్‌టెల్ బ‌లంగా పాతుకుపోయింది. ప‌ల్లె ప‌ల్లెకు వెళ్లిపోయింది. ఎయిర్‌టెల్ త‌మ వినియోగ‌దారుల‌కు మూడు నెలలు ఉచిత డేటా అందిస్తూ జియో నుంచి పోటీని త‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదే కాదు ఎయిర్‌టెల్ ద్వారా మ‌నం సంపాదించుకోవ‌చ్చు. అయితే దీనికి కొంత ప్రాసెస్ ఉంది అది ఎలా అంటారా? ఎయిర్‌టెల్ ట‌వ‌ర్ ద్వారా మ‌నం మంచి ఆదాయం పొందే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌న దేశంలో ఓపెన్ నెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేసిన తొలి టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ మాత్ర‌మే. ఈ ఓపెన్ నెట్‌వర్క్ ద్వారా వినియోగ‌దారులు ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ట‌వ‌ర్ మ్యాప్‌, వీక్‌, స్ట్రాంగ్ జోన్ల‌ను గుర్తించే అవ‌కాశాలున్నాయి. అయితే ఇది ప్ర‌మాద‌క‌ర‌మే అయినా.. వినియోగ‌దారుల‌కు త‌మ పార‌ద‌ర్శ‌క‌త తెలియాల‌నే ఉద్దేశంతో ఎయిర్‌టెల్ ఈ సాహ‌సం చేసింది. అంతేకాదు వారికి ఆదాయ మార్గాన్ని కూడా చూపిస్తోంది.
మొబైల్ ట‌వ‌ర్ ఇన్‌స్టాలేష‌న్‌
మ‌నం ఎయిర్‌టెల్ ద్వారా ఆదాయం పొందాలంటే మ‌న‌కు ఒక ప్రోప‌ర్టీ ఉండాలి. అంటే ఒక ఇంటి స్థ‌లం ఉండాలి. ఇంటి య‌జ‌మానులు త‌మ స్థ‌లాన్ని అద్దెకు ఇస్తే భారీగా డ‌బ్బులు ఇవ్వ‌డానికి ఈ టెలికాం సంస్థ ముందుకొస్తుంది. ముందు ఎయిర్‌టెల్ మొబైల్ ట‌వ‌ర్ ఇన్‌స్టాలేష‌న్‌కు మ‌నం అంగీక‌రించాలి. అంటే ఎయిర్‌టెల్ త‌న సేవ‌ల‌ను పెంచుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తోంది. ఇళ్ల మ‌ధ్య ట‌వ‌ర్ల‌ను పెట్ట‌డం వ‌ల్ల ఎలాంటి అంత‌రాయం లేకుండా సిగ్న‌ల్స్ వ‌స్తాయ‌ని ఆ సంస్థ చెబుతోంది. అందుకే త‌మ‌కు అవ‌స‌ర‌మైన ప్రాంతంలో ట‌వ‌ర్స్ నిర్మించ‌డానికి ఆ స్థ‌లం య‌జ‌మానుల‌కు ఎంత అద్దె ఇవ్వ‌డానికైనా సిద్ధ‌మ‌వుతోంది. మొబైల్ ట‌వ‌ర్ ఇన్‌స్టాలేష‌న్‌కు ఎలాంటి డ‌బ్బులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఎయిర్‌టెల్ కంపెనీ వాళ్లే ట‌వ‌ర్ సెట్ చేసి వెళిపోతారు. అయితే అద్దె విష‌యం మాత్రం ముందుగానే మాట్లాడుకోవాలి. ఎలాంటి ప్రాంతంలోనైనా క‌నీసం రూ.20 నుంచి రూ.80 వేల వ‌ర‌కు అద్దె చెల్లించ‌డానికి భార‌తీ ఎయిర్‌టెల్ సిద్ధంగా ఉంది.
ఏం చేయాలంటే...
ఎయిర్‌టెల్ సైట్లోకి వెళ్లి.. ఓపెన్ నెట‌వ‌ర్క్స్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. అక్క‌డ సెర్చ్ బార్‌లో మ‌నం ఉండే సిటీ పేరును ఎంట‌ర్ చేయాలి. అందులో రెడ్, వైట్ ఐకాన్స్ క‌న‌బ‌డ‌తాయి. రెడ్ ఐకాన్ అంటే ఎయిర్‌టెల్‌కు ఇప్ప‌టికే ట‌వ‌ర్లు ఉన్నాయ‌ని అర్థం. వైట్ ఐకాన్ ప్ర‌స్తుతం ఎక్క‌డ ట‌వ‌ర్లు కావాలో సూచిస్తుంది. ఆ ఏరియా మీరు ఉండే ప్రాంతానికి చెందుతుందో లేదో గుర్తించాలి. ఒక‌వేళ మీకు ద‌గ్గ‌ర ప్రాంతం మీ ఏరియానే అయితే వెంట‌నే ఎయిర్‌టెల్‌ను సంప్ర‌దించి ట‌వ‌ర్ ఇన్‌స్టాలేష‌న్ చేసుకోవ‌చ్చు. లేక‌పోతే ఇన్‌బాక్స్‌లో ఒక మెసేజ్ టైప్ చేసి పెడితే ఎయిర్‌టెల్ ప్ర‌తినిధులే మిమ్మల్ని సంప్ర‌దిస్తారు.

జన రంజకమైన వార్తలు