• తాజా వార్తలు
  •  

జోరందుకుంటున్న ఆన్‌లైన్ టైల‌రింగ్

క‌ప్పుడు టైల‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి కొత్త బ‌ట్ట‌లు కుట్టించుకోవాలంటే అదో పెద్ద తంతు. దుస్తులు కొన‌డం ద‌గ్గ‌ర నుంచి వాటిని టైల‌ర్ మ‌న‌కు ఇచ్చే వ‌ర‌కు పెద్ద ప్ర‌హ‌స‌న‌మే న‌డిచేది. ఎక్కువ‌గా కుట్టిన బ‌ట్ట‌లు వేసుకునే ప‌ల్లెటుళ్ల‌లో ద‌ర్జీల‌కు చేతినిండా ప‌నే.  ఐతే రెడీమెడ్ దుస్తులు మార్కెట్ల‌ను ముంచెత్త‌డంతో టైలర్ల‌కు గిరాకీ త‌గ్గినా.. ఇప్ప‌టికీ దుస్తుల‌ను కుట్టించుకునే వారి సంఖ్య ఏం త‌గ్గ‌లేదు.  మ‌న‌కు అవ‌సర‌మైనవ‌న్నీ ఆన్‌లైన్‌లో దొరుతుకుతున్న ఈ రోజుల్లో టైల‌రింగ్ కూడా ఆన్‌లైన్ బాట ప‌ట్టింది. ఆన్‌లైన్ సైట్ల‌తో టైల‌ర్లు ఒప్పందాలు కుదుర్చుకుని త‌మ వ్యాపారాన్ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ఏళ్ల త‌ర‌బ‌డి టైల‌రింగ్ చేస్తున్నా పెద్ద‌గా ఆదాయం సంపాదించ‌ని టైల‌ర్లు.. ఆన్‌లైన్ టైల‌రింగ్ ద్వారా బాగానే ల‌బ్ధి పొందుతున్నారు.  ఆన్‌లైన్‌లో దుస్తులును విక్ర‌యించే సంస్థ‌లు మైంత్రా, జబాంగ్ లాంటి సంస్థ‌ల‌తో ద‌ర్జీలు ఒప్పందాల‌ను కుదుర్చుకుంటున్నారు. 

యువ‌ర్ టైల‌ర్ అనే సైట్ కూడా టైల‌ర్ల‌కు బాగానే వ్యాపారాన్ని పెంచుతోంది. ఈ ఆన్‌లైన్ కంపెనీ రిటైల‌ర్ల‌కు, క‌స్ట‌మ‌ర్ల‌కు స్టిచింగ్‌, ఆల్ట్రేష‌న్ స‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంది. వివిధ కంపెనీల నుంచి ఆర్డ‌ర్ల‌ను తీసుకుని త‌మతో ఒప్పందం చేసుకున్న టైల‌ర్ల‌కు ఈ ప‌ని అప్ప‌జెబుతోంది. వీటిని అమ్మ‌డం ద్వారా వ‌చ్చిన ఆదాయంలో టైల‌ర్ల‌కు  కొంత ఇచ్చి తాను క‌మిష‌న్ పొందుతోంది.  దీని వ‌ల్ల ఆన్‌లైన్‌లో బ‌ట్ట‌లు విక్ర‌యించే సంస్థ‌ల ప‌ని సుల‌భం అయింది.  దీంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ బిజినెస్‌తో ద‌ర్జీలు మ‌ళ్లీ బిజీగా మారిపోయార‌ట‌. వాళ్లకెంత డిమాండ్ ఉందంటే త‌మకు వ‌చ్చిన ఆర్డ‌ర్ల‌ను ప‌క్క‌వాళ్ల‌కు ఇచ్చి కుట్టించే ప‌రిస్థితి వ‌చ్చింది.  ప్ర‌ముఖ వ‌స్త్రాల కంపెనీ రైమాండ్స్ కూడా డిజైజ‌ర్ వ‌స్త్రాల త‌యారీకి చేయి తిరిగిన స్థానిక టైల‌ర్ల కోసం వేట కొన‌సాగిస్తోంది.  ఈ కంపెనీ ఇప్ప‌టికే 5000 వేల మంది టైల‌ర్ల‌కు ఉపాధి క‌ల్పిస్తోంది. 

ఈ టైల‌ర్లకు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా ఇప్పించి వారికి న‌చ్చిన విధంగా డిజైన్ల త‌యారు చేయించుకునేందుకు బడా కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి.  ల‌క్ష మంది టైల‌ర్ల‌కు ఇలా ఉపాధి ఇప్పించాల‌నేది రైమాండ్స్ లక్ష్యం. ఒకానొక ద‌శ‌లో టైల‌రింగ్ వృత్తికి ఆద‌రణ బాగా త‌గ్గిపోయింది. ముఖ్యంగా యువ‌త ఈ రంగం వైపు రావ‌డానికి అంత‌గా ఆస‌క్తి చూపించేది కాదు. కానీ మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో టైల‌రింగ్ కూడా హాట్ జాబ్‌గా మారింది.  క‌స్ట‌మ‌ర్లు కూడా ఇలా టైల‌ర్లు కుట్టిన దుస్తుల‌పై బాగా ఆస‌క్తి చూపిస్తుండ‌డంతో కంపెనీలు కూడా వీలైనంత‌మంది ఎక్కువ టైల‌ర్ల‌ను నియ‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి.

 

జన రంజకమైన వార్తలు