• తాజా వార్తలు
 •  

మీ సేవ కేంద్రాల వైఫల్యాలకు కారణాలేంటి?

భారత దేశం లోని ఈ సేవా కేంద్రాల సంఖ్యను 2,50,000 కు పెంచనున్నట్లు గౌరవనీయులైన కేంద్ర ఐటి శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ గారు నిన్న ముంబై లోని మేక్ ఇన్ ఇండియా వీక్ ప్రారంభోత్సవం లో అట్టహాసంగా ప్రకటించారు. చాలా సంతోషం . కానీ ఇప్పటికే ఉన్న మీ సేవా కేంద్ర నిర్వాహకులకూ, మరియూ వినియోగదారులకూ ఉన్న సమస్యలను ఎవరు పరిష్కరించాలి?

అలా పరిష్కరించకుండా ఎన్ని లక్షల కేంద్రాల ను ఏర్పాటు చేసినా ఉపయోగం లేదు.

 • సాంకేతిక స్వయం ఉపాదికి ఒక మంచి అవకాశం,
 • ప్రజల సాంకేతిక అవసరాలని తీర్చే మహదవకాశం
 • ఐన ఈ సేవ (మీ సేవ) కేంద్రాల వైఫల్యానికి కారణాలు,
 • నిర్వాహకులకు,వినియోగదారులకు ఉన్న ఇబ్బందులను
 • లోతుగా పరిశోధించి, ఉన్న సమస్యలను వెల్లడించడమే కాకుండా
 • మీ సేవ వ్యవస్తను బలోపేతం చేయడానికి 6 పరిష్కారాలను చూపించిన
 • మా సాంకేతిక స్వయం ఉపాది డెస్క్ కు నా కృతఙ్ఞతలు.

జ్ఞాన తేజ నిమ్మగడ్డ

సంపాదకుడు 

_____________________________________________________________________________ 

మీ సేవ కేంద్రాల వైఫల్యాలకు కారణాలేంటి?

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఒక దశాబ్దం క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రారంభించబడిన కార్యక్రమమే ఈ సేవ . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తో ప్రతి జిల్లా లోని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యం లో ఇవి పని చేస్తాయి.  మొదట్లో ఈ సేవ గా పిలువబడిన ఈ కార్యక్రమం తర్వాత పేరు మార్చుకుని తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మీ సేవ  అయింది. ఈ పథకం ప్రారoభించిన తొలినాళ్ళలో అంటే ఈ సేవ గా ఉన్నపుడు కొన్ని ప్రదాన ప్రాంతాలకే పరిమిత మైన ఈ కార్యక్రమం మీ సేవ గా మారిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలోని మారుమూల పల్లెలకు సైతం విస్తరించింది. ఇవి రాకముందు ఏదైనా పని కావాలంటే మండల కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగవలసిన పరిస్థితి ఉండేది. కానీ ఇపుడు అన్నీ మీ సేవ ద్వారా నే జరుగుతూ ఉండడం తో ఆ పనులన్నీ చాలా సులువుగా  జరుగుతూ ఉండడం తో ప్రజలు సంతోషం గా తమ పనులు చేసుకోగలుగుతున్నారు. మొదట్లో కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు లాంటి కొన్ని సేవలకే పరిమితమైన ఈ  మీ సేవ తర్వాత తన పరిధిని పెంచుకుని అన్ని రకాల రెవిన్యూ సేవలు మరియు ప్రభుత్వ పథకాలను సమర్థ వంతంగా ప్రజల లోనికి తీసుకు వెళుతూ ప్రజల , ప్రభుత్వ పని భారాన్ని  తగ్గిస్తుంది.

మీ సేవ కేంద్రాల నిర్వహణ ఎలా జరుగుతుంది? :- 

రెండు తెలుగు రాష్ట్రాలలోని ఐటి శాఖ ఆధ్వర్యం లో ఈ  మీ సేవా కేంద్రాలు నడుస్తాయి. వీటిని ప్రతి జిల్లా లోనూ సంబందిత జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తారు. అంటే ఒక జిల్లా లో ఉన్న మీ సేవా కేంద్రాలన్నీ ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాయి. కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయలన్నా లేదా ఉన్న వాటిని తొలగించాలన్నా అది జాయింట్ కలెక్టర్ నిర్ణయం  మీదే ఆదారపడి ఉంటుంది. మీ సేవా కేంద్రాల నిర్వహణ లో అవసరమైన సాఫ్ట్ వేర్ , ఇంటర్ నెట్ మరియు విధానాల రూప కల్పనను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్ ) అందిస్తుంది. ఈ సేవా కేంద్రాలను స్థాపించిన మొదట్లో కేవలం తొమ్మిది సేవలను మాత్రమే అందించిన ఈ కార్యక్రమం ప్రస్తుతం సుమారు 34 ప్రభుత్వ శాఖల లోని 370 కి పైగా సేవలను అందిస్తుంది.

ఇదంతా నాణానికి ఒక వైపు. మరి మరో వైపు ఏంటి?

ప్రభుత్వ కార్యాలయాలను తలదన్నే రీతిలో మీ సేవా కేంద్రాలలో అవినీతి పెరిగి పోయింది. తమ పనులు చేసుకునేందుకు మీ సేవా కేంద్రం లో దరఖాస్తు చేసిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి. కొన్ని మీ సేవా కేంద్రాలు అవినీతి కి అడ్డాలుగా  మారి పోయాయి అంటూ వివిధ వార్తా పత్రికలలో కథనాలను పాఠకులు చూస్తూనే ఉన్నారు. ఎంతో సదుద్దేశం తో ప్రారంభించిన మీ సేవా కేంద్రాలు ఇలా మారడానికి కారణాలేంటి? అసలు సమస్య ఎక్కడ ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి కంప్యూటర్ విజ్ఞానం రంగం లోనికి దిగింది.క్షేత్ర స్థాయిలో పరిశోధించి కొందరు మీ సేవా కేంద్ర నిర్వాహకులనూ, ప్రజలనూ ప్రశ్నించి కారణాలు కని పెట్టే ప్రయత్నం  చేసింది . వారి విజ్ఞప్తి మేరకు పేర్లను ప్రచురించడం లేదు.మా విచారణ లో తేలిన విషయాలను  పాఠకుల ముందు ఉంచుతున్నాము.

పైరవీలు :-

మీ సేవా  కేంద్ర నిర్వహణ గురించీ, ఆ నిర్వాహకుల ఎంపిక గురించీ మన వెబ్ సైట్ లో ఇంతకు ముందే ప్రచురించడం జరిగింది. ఈ కేంద్ర నిర్వాహకులను ఒక పద్దతి ప్రకారం పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.అయితే కొన్ని చోట్ల ఈ మీ సేవ కేంద్ర నిర్వాహకుల ఎంపిక లో పైరవీ లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ప్రజలలో ఒక వదంతి ఉన్నది. కొన్ని కేంద్రాల నిర్వహణకు   చాలా తక్కువ సంఖ్య లో దరఖాస్తులు రావడంతో  వారిలో కూడా అంత నైపుణ్యం లేని వారు ఈ కేంద్రాల నిర్వహణ కు ఎంపిక అవుతున్నారు. దీనితో వీరు చెప్పేది అర్థం కాక  ప్రజల్లో గందరగోళం నెలకొంది.

ఎక్కువ రుసుము వసూలు చేయడం:-

చాలా మీ సేవ కేంద్రాలలో ప్రభుత్వం అందించే సేవలకు నిర్దేశిత రుసుము కంటే ఎక్కువ  వసూలు చేస్తున్నట్లు విపరీతమైన ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొందరు మీ సేవ కేంద్ర నిర్వాహకుల అత్యాశ ఒక కారణం. మీ సేవ కేంద్ర నిర్వాహకులకు  ఆదాయం  కమీషన్ రూపం లో వస్తుంది. మండల కేంద్రాలలోనూ , ప్రధాన మేజర్ పంచాయితీలలోనూ నిర్వాహకుల ఆదాయానికి డోకా లేదు. చిన్న చిన్న గ్రామాలలో అయితే పరిస్థితి పూర్తి విరుద్దం. వాటి పరిధి తక్కువగా ఉండడం లేదా ప్రక్కనే మండల కేంద్రాలు లేదా మేజర్ పంచాయితీలలో ఉన్న మీ సేవ కేంద్రాలకే ప్రజలు ఎక్కువ ఆదరణ  చూపిస్తుండడం తో చిన్న గ్రామ పంచాయితీ ల లోని మీ సేవ కేంద్రాల ఆదాయానికి గండి పడుతుంది. వచ్చే ఆదాయం కేంద్ర నిర్వహణకే సరిపోవడం లేదు.దీనితో చేసేదేమీ లేక సదరు నిర్వాహకులు నిర్దేశిత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు.

నిర్వాహకులలో లేని నైపుణ్యాలు:-

మీ సేవ కేంద్రాల నిర్వహణా వైఫల్యాల్లో ఇది కూడా ప్రధాన మైనది. మనం ఇంతకు ముందు చెప్పినట్లు కొన్నింటిలో పైరవీలు జరగడం తో ఈ నిర్వాహకులకు సరైన కంప్యూటర్ నైపుణ్యాలు ఉండడం లేదు. అది కాక మీ సేవా కేంద్రo కేటాయించబడిన వ్యక్తులు కాకుండా కొన్నింటిలో వారి భర్తలు కానీ భార్యలు కానీ లేదా వారి బంధువులు కానీ కూర్చుండడం తో వారికీ సరైన అవగాహన ఉండక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సేవలు అందించాలంటే ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలా మందికి సరైన ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేక వారు ప్రజలకు సరైన రీతిలో వివరించ లేక పోతున్నారు. అంతేగాక సర్టిఫికేట్ ల జారీ లో అక్షర దోషాలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వమూ, నిర్వాహకుల మధ్య కొరవడిన సమన్వయం:-

చాలా సేవలకు సంబంధించి ప్రభుత్వమూ మరియూ మీ సేవా కేంద్ర నిర్వాహకుల మధ్య సమన్వయము ఉండడం లేదు. ఉదాహరణకు రెవిన్యూ శాఖ ను తీసుకుందాం. రెసిడెన్స్ సర్టిఫికేట్ ను మీ సేవా కేంద్రాల ద్వారా ఇవ్వడం కొన్ని నెలల క్రితం ఆపి వేశారు. అంటే మీ సేవ కేంద్రాలలో ఈ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేయకూడదు. ఎవరైనా వస్తే దరఖాస్తు తీసుకోవడం లేదు అని సింపుల్ గా చెప్పేస్తున్నారు. మీరు తీసుకోరు సరే ! మరి ఎవరు ఇస్తారు? ఎక్కడ తీసుకోవాలి? అని ఎవరైనా ప్రశ్నిస్తే మాకు తెలియదు, తహసిల్దార్ ఆఫీసు లో కనుక్కోండి అని సమాధానం వస్తుంది. వారు  చెప్పేది నిజమే. వారికి ఏమీ తెలియదు. ప్రజలలో గందరగోళం మొదలు అవుతుంది. ఏదైనా సేవలను ఆపి వేసేటపుడు దాని పూర్వపరాలను మీ సేవ కేంద్ర నిర్వాహకులకు వివరించవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది కదా! అలాగే కొన్ని కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. మరిన్ని వివరాలకు మీ సమీపం లోని మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి అని టివి ల లోనూ పేపర్ లలోనూ ప్రకటలను ఇస్తుంది. తీరా మీ సేవా కేంద్రాల దగ్గరకు వెళ్తే మాకేమీ తెలియదు అన్నట్లు తెల్ల మొహాలు వేయడం నిర్వాహకుల వంతు అవుతుంది. అంటే ఏవైనా కొత్త సేవలను ప్రారంభించేటపుడు కూడా వీరికి సరైన సమాచారాన్ని ప్రజల కంటే ముందుగా అందించడం లేదనేది వాస్తవం.

అవినీతి :-

కొన్ని మీ సేవ కేంద్రాలలో ఒకే రకమైన సేవకు వివిధ రకాల రుసుములు ఉంటాయి. అర్థం కాలేదా! మీకు ఒక సర్టిఫికేట్ కావాలనుకోండి. దానికి రెండు రకాల రుసుములు ఉంటాయి. త్వరగా పని జరగాలంటే ఒక విధమైన రుసుము, మామూలు గా జరగాలంటే మరో రకమైన రుసుము.సాధారణంగా ఎవరైనా తమ పని త్వరగా జరగాలని అనుకుంటారు కాబట్టి వారు అడిగినంత ఇస్తున్నారు. చాలా చోట్ల మీ సేవ కేంద్ర నిర్వాహకులు మరియు రెవిన్యూ సిబ్బంది కుమ్మక్కు అవుతున్నారు. గుంటూరు మరియు అనంతపురం జిల్లాలలో ఇటీవల వెలుగు చూసిన నకిలీ పాస్ బుక్ ల కుంభకోణం లో రెవిన్యూ సిబ్బంది తో పాటు కొందరు మీ సేవ నిర్వాహకుల పాత్ర కూడా  బయట పడడం మనందరికీ తెలిసిన విషయమే.

నిర్వాహకుల ఇబ్బందులు :- 

ఇవి నాణానికి రెండు పార్శ్వాలు. ఇందులో ఎవరికీ కనపడని మూడవ కోణం కూడా ఉన్నది. అదే మీ సేవా కేంద్ర నిర్వాహకుల బాధలు. ఆదాయం బాగా వస్తుందన్న ఆశతో మీ సేవా కేంద్రాలను నిర్వహిస్తున్న ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు. ఎన్నో మీ సేవ కేంద్రాల నిర్వహణ కష్టం గా మారిపోయి వాటిని నడప లేక అలా అని ఆప లేక త్రిశంఖు స్వర్గం లో గడుపుతున్నారు. అలాంటి కొంతమంది మీ సేవ నిర్వాహకులను మేము కలిసి వారి సాధక బాధకాలను తెలుసుకోవడం జరిగింది. వాటిని పాఠకుల ముందు ఉంచుతున్నాము. ఎందుకంటే ఏ సమీక్ష అయినా ఏక పక్షంగా ఉండకూడదు కదా!

మీ సేవా కేంద్ర నిర్వహణకు ఎంపికైన తర్వాత నిర్దిష్ట కాల  వ్యవధి లో దానిని ఏర్పాటు చేయవలసి ఉంటుంది దీనికి సుమారు లక్ష రూపాయల పైనే ఖర్చు అవుతుంది. కంప్యూటర్, ప్రింటర్ లు, ఫర్నిచర్, రూమ్ రెంట్ , కరెంటు ఏర్పాటు, ఇంటర్ నెట్ కనెక్షన్,  డిపాజిట్ మనీ ఇలాంటివి అన్నీ కలుపుకుని సుమారు లక్ష పైనే ఉంటుంది. అది సరే. మరి నెల నెలా నిర్వహణ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? రూమ్ రెంట్, కరెంటు బిల్, ఇంటర్ నెట్ బిల్ అవసరమైన చోట సిబ్బంది జీతాలు ప్రతి రోజూ సంబందిత తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి రావడానికి అయ్యే ఆయిల్ ఖర్చులు, స్టేషనరీ మొదలైనవన్నీ కలుపుకుని 8 వేల దాకా అవుతుంది. మరి ఆదాయం మాటేమిటి? ఎంత పెద్ద మేజర్ పంచాయితీ అయినా లేదా మండల కేంద్రం అయినా గరిష్టం గా 12 వేలకు మించి ఆదాయం రాదు. ఇపుడు మిగిలేది నాలుగు వేల రూపాయలు. ఒక్కోసారి ఆ నాలుగు వేల రూపాయలు కూడా మిగలక స్వంత డబ్బులు ఖర్చు చేయవలసి ఉంటుంది.పోనీ మీ సేవా కేంద్రాన్ని నిర్వహించుకుంటూ ప్రత్యామ్నాయంగా వేరే ఆదాయ మార్గాలు చూసుకుందాం అని అనుకుంటే ఉన్న సమయం అంతా దీనికే సరి పోతుంటే ఇంక ప్రత్యామ్నాయానికి సమయం ఎక్కడిది? మారుమూల గ్రామాల్లో ఉన్న మీ సేవ నిర్వాహకుల పరిస్థితి అయితే మరీ దారుణం. వచ్చే ఆదాయం కంటే పెట్టె ఖర్చే ఎక్కువ ఉంటూ ఉండడం తో అప్పుల పాలు అవుతూ ఉన్నారు.

పైన ఉదహరించిన విషయాలన్నీ మీ సేవా కేంద్ర నిర్వాహకుల ఆర్థిక బాధలకు సంబందించినవి. ఇక్కడ బాధాకరమైన మరొక విషయం కూడా ఉంది. అదే మీ సేవా కేంద్ర నిర్వాహకులు అనుభవిస్తున్న విపరీతమైన మానసిక ఒత్తిడి. ఒక వైపు డబ్బులు మిగలక మరొక వైపు కొన్ని సార్లు గంటల కొద్దీ సర్వర్ పని చేయక కంప్యూటర్ ముందే కూర్చుని అలసి పోయి మానసిక ప్రశాంతత దూరం అయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు.వీటన్నింటికీ తోడు ప్రభుత్వానికీ వీరికీ మధ్య ఉన్న సమన్వయ లోపం కారణంగా వినియోగదారులందరినీ వీరి సమాధానాలతో సంతృప్తి పరచవలసి ఉంటుంది. లేకపోతే దూషణల పర్వాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ బాధలు చెప్పుకోవడానికి తమకు కనీసం యూనియన్ కూడా లేదంటూ మీ సేవా కేంద్ర నిర్వాహకులు వాపోతున్నారు.

కేవలం సమస్యలను గుర్తించడానికే మేము పరిమితం కాలేదు. ఈ సమస్యలు పరిష్కరించబడాలంటే ప్రభుత్వాలు ఏమి చేయాలి? అనే అంశం పై  ప్రజలను ప్రశ్నించి, మేధావులతో చర్చించి కంప్యూటర్ విజ్ఞానం కొన్ని పరిష్కారాలను కనుగొన్నది.

పరిష్కారాలు:-

 1. మీ సేవా కేంద్ర నిర్వాహకుల ఎంపికలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా ఉండాలి.
 2.  ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభించేటపుడు కానీ ఆపి వేసేటపుడు కానీ మీ సేవ కేంద్ర నిర్వాహకులకు ఖచ్చితమైన సమాచారం ఉండాలి. ప్రజలకు ఆ పథకాల గురించి ప్రకటించడానికి ముందే మీ సేవ నిర్వాహకులకు లకు వీటిపై శిక్షణ కూడా ఇవ్వాలి.
 3. మీ సేవ కేంద్రాలపై తనిఖీలు ఉండాలి, వీటి పనితీరు గురించి ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించాలి.
 4. మీ సేవ కేంద్ర నిర్వాహకులకు ప్రభుత్వం ఇస్తున్న కమీషన్ శాతాన్ని పెంచాలి.
 5. మండల కేంద్రాలలో ఉన్న కేంద్రాలపై విపరీతమైన రద్దీ ఉంటున్న కారణంగా ఆయా గ్రామాలలో ఉంటున్న ప్రజలు వారి సొంత గ్రామాల లోని మీ సేవా కేంద్రాలను ఉపయోగించుకునేలా తప్పనిసరి చేయాలి. తద్వారా చిన్న గ్రామాలలోని కేంద్రాలకు ఆదరణ పెరుగుతుంది.
 6. మీ సేవా కేంద్ర నిర్వాహకుల ఎంపిక ప్రక్రియ లో అభ్యర్థుల ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని కూడా పరీక్షించాలి.

భారత దేశం లో ని ఈ సేవా కేంద్రాల సంఖ్యను 2,50,000 కు పెంచనున్నట్లు  గౌరవనీయులైన కేంద్ర ఐటి శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ గారు  నిన్న ముంబై లోని మేక్ ఇన్ ఇండియా వీక్ ప్రారంభోత్సవం లో అట్టహాసంగా ప్రకటించారు.చాలా సంతోషం . కానీ ఇప్పటికే  ఉన్న మీ సేవా కేంద్ర నిర్వాహకులకూ, మరియూ వినియోగదారులకూ ఉన్న సమస్యలను ఎవరు పరిష్కరించాలి? ఎన్ని లక్షల కేంద్రాల ను ఏర్పాటు చేసినా ఉపయోగం లేదు.

జన రంజకమైన వార్తలు