• తాజా వార్తలు
  •  

ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఇంత విధ్వంసం సృష్టించిందా?


* సామాజిక మాధ్యామాలను సామాజిక బాధ్యతతో వినియోగించండి


* కంప్యూటర్ విజ్ఞానం పిలుపుసోషల్ మీడియా విస్తృతమైన నేపథ్యంలో ఆలోచించో, లేకుంటే అనాలోచితంగానో చేసే కొన్ని పనులు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ప్రతిఒక్కరూ సున్నితంగా మారటం.. ప్రతి విషయాన్ని పట్టించుకోవటం.. సీరియస్ గా తీసుకోవటంతో.. అల్లరిచిల్లరిగా.. బాధ్యతారాహిత్యంతో చేసే పనులు వేలాది మందిని ప్రభావితం చేస్తోంది. భావోద్వేగాల్నిదెబ్బ తీసేలా ఉంటున్న ఇలాంటి పరిణామాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో తాజాగా చోటు చేసుకుంది.
ఒక వర్గాన్ని కించపర్చేలా వాట్సప్ పోస్ట్ పెట్టిన ఒకరి కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తటమే కాదు.. పరస్పర దాడులకు వరకూ వెళ్లేలా చేసింది. దీంతో.. పరిస్థితిని చక్కదిద్దటానికి వందలాది పోలీసులు రంగంలోకి దిగాల్సిన దుస్థితి. లాఠీ ఛార్జ్.. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాల్సిన పరిస్థితి. అంతేనా.. పరిస్థితిని కంట్రోల్ చేయటానికి నాలుగు జిల్లాల పోలీసుల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. ఊహించని రీతిలో చోటు చేసుకున్న పరిణామంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని రీతిలో ఉట్నూరు మారింది.
ఇంత దారుణమైన పరిస్థితికి కారణమైన ఉదంతాన్ని చూస్తే.. ఉట్నూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వారిని కించపరిచేలా వాట్సప్ లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇది వైరల్ గా మారటమే కాదు.. ఆ పోస్ట్ పెట్టిన యువకుడ్ని అరెస్ట్ చేయాలని కోరుతూ.. శనివారం రాత్రి వేళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిరసనలు శ్రుతిమించి.. ఆందోళనకారులు రోడ్డు పక్కన ఉన్న పలు దుకాణాల్ని ధ్వంసం చేశారు. ఉట్నూర్ బంద్ కు పిలుపునిచ్చారు. ఆందోళనకారులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. బంద్ పిలుపుతో ఆందోళనలు అంతకంతకూ పెరిగి ఇరువర్గాల మధ్య దాడులు.. ప్రతి దాడులకు దారి తీసింది. ఇరు వర్గాల రాళ్లు రువ్వుకోవటం.. దుకాణాల్ని.. వాహనాల్ని ధ్వంసం చేయటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యే పరిస్థితి. రాళ్ల దాడుల్లో ఆందోళనాకారులే కాదు.. పోలీసు ఉన్నతాధికారులూ గాయపడ్డారు.
కాగా వాట్సాప్ లో అనుచిత పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా నాలుగు జిల్లాల నుంచి అదనపు భద్రతా బలగాల్ని తీసుకొచ్చి ముందస్తు భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు.
ఉట్నూరు ఘటనలాంటివి ఇంకెన్నడూ జరగకుండా నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఉన్నవారు తమకు తాము కొన్ని క్రమశిక్షణ సూత్రాలు విధించుకోవాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలున్న సోషల్ మీడియాను ఇలా దుర్వినియోగం చేసి సామాజిక అశాంతికి కారణం కావద్దని కంప్యూటర్ విజ్ఞానం కోరుతోంది. సామాజిక మాధ్యమాలను సామాజిక బాధ్యతతో ఉపయోగించాలని పిలుపునిస్తోంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు