• తాజా వార్తలు

హైదరాబాద్ కు యాపిల్ తీపి...

 

మ్యాప్స్ డెవలప్ మెంట్ ప్రధాన కార్యక్రమం 

టెక్నాలజీ దిగ్గజం 'యాపిల్‌' హైదరాబాద్‌లో తన 'టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌'ను తెరవడం ఖాయమైంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచే ఇందుకు సంబంధించిన సమాచారం బయటకు వెలువడుతూ వచ్చింది. అయితే కంపెనీ నుంచి ఇందుకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రకటన రాకపోవడంతో కొంతకాలంగా అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా యాపిల్‌ సంస్థ ఈ అనుమానాలకు తెర దించింది.హైదరాబాద్ నగరంలో తమ 'టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌'ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. భారత్‌లో విస్తరించేందుకు గాను తాము పెట్టుబడులు పెట్టనున్నట్లు యాపిల్‌ ప్రకటించింది.

దాదాపు రూ.170 కోట్ల పెట్టుబడితో యాపిల్‌ హైదరాబాద్‌లోని టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను తెరవనుంది.దాదాపు 2,50,00 చ.అ. స్థలంలో దాదాపు 4500 మంది ఉద్యోగులు పని చేసుకొనేలా దీనిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ సంస్థ సెజ్‌ హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన స్పష్టత రానుంది. ఇంకా మరికొన్ని అనుమతులు రానున్న నేపథ్యంలో సర్కారుకు, యాపిల్‌ సంస్థకు అధికారికంగా అవగాహన ఒప్పందం కుదరాల్సి ఉంది.

భారత్‌లో మంచి టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వినియోగదారులు పెద్దసంఖ్యలో ఉండడం... ఇక్కడి ప్రభుత్వాలు ఐటీ రంగాన్ని ముద్దుబిడడ్డలా చూస్తుండడంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా మ్యాప్‌ డెవలప్‌మెంట్‌లో పాలుపంచుకుంటున్న 150 మంది యాపిల్‌ సంస్థ ఉద్యోగులు ఈ టెక్నాలజీ సెంటర్ కేంద్రంగా పనిచేస్తారు.  కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చర్యలకు తొడ్పాటును అందించే చాలా మంది కాంట్రాక్టర్లకు కొత్త కార్యాలయంలో అవకాశాలు దక్కుతాయని యాపిల్ వెల్లడించింది.

కాగా ప్రధాని మోడీ ఇంతకుముందు సిలికాన్ వ్యాలీని ఇంతకుముందు సందర్శించినప్పుడు అక్కడ ఐటీ వర్గాలతో సమావేశమయ్యారు. యాపిల్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ను ఇండియాకు తేవడంలో మోడీ చొరవ ప్రేరణ కూడా ఉంది. ఇండియాలో ఆర్థిక సంస్కరణలు, ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం వంటివన్నీ ప్రపంచంలో దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తోంది.

 

జన రంజకమైన వార్తలు