• తాజా వార్తలు

సైబ‌రాబాద్ పోలీసుల ఐ వోర్న్ కెమెరాలు

పోలీసులు సాంకేతిక‌త‌ను అంది పుచ్చుకుంటున్నారు. గ‌త కొన్నేళ్లుగా సాంకేతిక‌త ఉప‌యోగించి వారు ఎంతో ప్ర‌యోజ‌నాన్ని పొందారు.  ముఖ్యంగా విశ్వ న‌గ‌రంగా ఎదుగుతున్న హైద‌రాబాద్‌లో పోలీసులు సాంకేతికత‌ను ఉప‌యోగించ‌డంలో ముందున్నారు. పోలీసు శాఖ‌తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా సాంకేతిక‌త‌ను విరివిగా ఉప‌యోగిస్తున్నారు. గ‌తంలో బాడీ వోర్న్ కెమెరాలు (శ‌రీరానికి అమ‌ర్చ‌బ‌డే కెమెరాలు) ఉప‌యోగించిన సైబ‌రాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఐ ఓర్న్ కెమెరాలు (కంటి ద‌గ్గ‌ర‌లో అమ‌ర్చే కెమెరాలు) ఉప‌యోగించ‌నున్నారు. ఇటీవ‌లే ఈ కెమెరాల ప‌నితీరును ప‌రిశీలించిన సైబ‌రాబాద్ పోలీసు అధికారులు త్వ‌ర‌లోనే వీటిని న‌గ‌రంలోని  అంద‌రు పోలీసుల‌కు అంద‌జేయాల‌ని భావిస్తున్నారు.  రెండేళ్ల క్రితం ప్ర‌యోగాత్మ‌కంగా ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చిన బాడీ వోర్న్ కెమెరాల ప‌ని తీరు బాగుండ‌టంతో ఐ ఓర్న్ కెమెరాల‌ను రంగంలోకి దించాల‌ని పోలీసులు నిర్ణ‌యించారు. 

ఈ ఐ ఓర్న్ కెమెరాల ప్రత్యేక‌త ఏంటంటే పోలీసులు పెట్టుకునే క‌ళ్ల‌జోడులోనే వీటిని అమ‌ర్చ‌డం. దీని వ‌ల్ల ఎలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా వారు వెంట‌నే ఆ సంఘ‌ట‌న‌ను చిత్రించే అవ‌కాశం ఉంటుంది.  స్మార్టు పోలీసింగ్‌లో భాగంగా ఈ ఐ ఓర్న్ కెమెరాల‌ను తీసుకొచ్చిన‌ట్లు సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి.ఆనంద్ అన్నారు.  ట్రాఫిక్ ఆఫీస‌ర్ల‌కు ఈ ఐ ఓర్న్ కెమెరాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని..  వీటిని ఆన్ చేయ‌గానే కంట్రోల్ రూమ్‌కి ఈ కెమెరాలు క‌నెక్ట్ అవుతాయ‌ని.. త‌ద్వారా జ‌రిగిన సంఘ‌ట‌న‌ను విశ్లేషించ‌డానికి, త్వ‌ర‌గా స్పందించే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.  ఈ కెమెరాల‌ను పోలీసులు ధ‌రించే గ‌గుల్స్‌కు కుడిచేతి వైపు బిగించ‌నున్నారు. 

ఐ ఓర్న్ శైలి కెమెరాల‌ను ఉప‌యోగించ‌డం భార‌త్‌లో ఇదే తొలిసారి.  ఆడియో మ‌రియు వీడియో రికార్డ‌య్యే ఈ కెమెరా వ‌ల్ల విధుల్లో ఉన్న ఆఫీస‌ర్ ప్ర‌తి క‌దలిక కంట్రోల్ రూమ్‌కు తెలుస్తుంది. ఒక‌వేళ అత‌ను కెమెరాను ఆపితే దానికి స‌రైన రీజ‌న్ చెప్పాల్సి ఉంటుంది. లేక‌పోతే వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు.  32 జీబీ మెమెరీ సామ‌ర్థ్యం ఉన్న ఈ కెమెరాల‌తో 21 గంట‌లు నిరాంత‌రాయంగా రికార్డు చేయ‌చ్చ‌ట‌.  ఈ కెమెరాల్లో రికార్డ‌యిన ఫుటేజ్‌ను ప్ర‌తిరోజూ పోలీస్ స్టేష‌న్ల‌లో భ‌ద్ర‌ప‌ర‌చాల్సి ఉంటుంది.  ఈ కెమెరాల వ‌ల్ల వాహ‌న‌దారులు, పోలీసుల మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగిన‌ప్పుడు ఎవ‌రిది త‌ప్పు ఉంది.. ఎవ‌రితో ఎవ‌రు ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు లాంటి విష‌యాల‌ను లైవ్‌లో చూడొచ్చు.  దీని వ‌ల్ల పోలీసుల ప‌ని తీరు కూడా మెరుగ‌వుతుంద‌ని అధికారులు భావిస్తున్నారు

 

జన రంజకమైన వార్తలు