• తాజా వార్తలు
  •  

దేశంలోనే మొట్టమొదటి గిగాసిటీ హైదరాబాద్

హైదరాబాద్ అంటే హైటెక్ నగరం.. టెక్నాలజీకి చిరునామా.. దేశవిదేశాలకు టెక్ సేవలందించే హబ్. మెట్రో సిటీ.. మెగా సిటీ. ఇదీ హైదరాబాద్ కు ఇప్పటివరకు ఉన్న ఇమేజి.. ఇక నుంచి ఆ ఇమేజి మరింత పెరగబోతోంది. మెగా సిటీ కాస్త గిగా సిటీ కానుంది. ఎందుకో తెలుసా... ? అదిరిపోయే ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి రానుండడంతో హైదరాబాద్ ఇక గిగాసిటీగా అవతరించనుంది.
హైదరాబాద్‌లో ఇక ఇంటర్‌నెట్ మెరుపువేగంతో పరుగులు తీయనుంది. యాక్ట్ ఫైబర్‌నెట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వినియోగదారులకు 1000 ఎంబిపిఎస్ అంటే 1 జిబిపిఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్‌ను ప్రారంభించింది. వినియోగదారుడి ఇంటికి ఆప్టిక్ ఫైబర్ కనెక్షన్ ఇచ్చి, తద్వారా 1 జిబిపిఎస్ ఇంటర్‌నెట్‌ను అందిస్తారు. నెలకు 5,999 రూపాయల ప్యాకేజీతో లభించే ఈ వేగానికి 1 టెరాబైట్ ఎఫ్‌యూపి(ఫెయిర్ యూసేజ్ పాలసీ)గా నిర్ణయించారు.
మొట్టమొదటగా హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సర్వీసులు అతిత్వరలో 10 ఇతర భారత నగరాలలో కూడా ప్రారంభించనున్నట్లు యాక్ట్ సంస్థ చెబుతోంది. తాము ప్రధానంగా స్టార్టప్, ఇంటర్‌నెట్ కంపెనీలు, ఇతర రిటైల్ ఔట్‌లెట్లపై దృష్టి సారించినట్లు తెలిపిన కంపెనీ సీఈవో బాల మల్లాది, ఈ సేవల వల్ల భారత్‌లో సాంకేతిక అభివృద్ధి ఇంకా వేగంగా ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా... యాక్ట్ ఫైబర్‌నెట్, భారతదేశంలో మూడో అతిపెద్ద ఇంటర్‌నెట్ ప్రొవైడర్ (టెలికం కంపెనీ కాకుండా). బెంగళూరు ప్రధానకేంద్రంగా కలిగిన ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 11 నగరాలలో విస్తరించి, 12 లక్షల మంది కస్టమర్లను కలిగివుంది. ఈ దిశగా రిలయెన్స్ జియో కూడా 1 జిబిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్ ఇచ్చేందుకు పుణె, ముంబయిలలో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తోంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు