• తాజా వార్తలు

ఫోన్ త‌యారీదారులు మ‌న డేటాను దొంగిలిస్తున్నారా?

స్మార్ట్‌ఫోన్ వాడ‌ని వాళ్లు ఇప్పుడు చాలా అరుదు. ఎవ‌రి చేతిలో చూసినా ఆండ్రాయిడ్ ఫోనే క‌న‌బ‌డుతుంది. దీనికి కార‌ణంగా చాలా సుల‌భంగా మ‌న ప‌నులు ఫోన్ ద్వారానే అయిపోతుండ‌డంతో ఎక్కువ‌మంది స్మార్ట్‌ఫోన్ల వైపు మొగ్గుచూపుతున్నారు. గ‌త మూడేళ్ల‌లో భార‌త్‌లో స్మార్ట్‌ఫోన్ వాడే వాళ్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోయింది. భార‌త్‌లో స్మార్ట్‌ఫోన్ల‌కు ఉన్న ఆద‌ర‌ణ‌ను చూసి చాలా చైనా కంపెనీలు కొత్త కొత్త ఫోన్ల‌తో రంగంలోకి దిగుతున్నాయి. అయితే భార‌త్‌లో ఫోన్ విప్ల‌వంగా ఇంత‌గా రావ‌డం బాగానే ఉంది కానీ.. మ‌న డేటా ఎంత వ‌రకు సేఫ్‌? ఇందుకు స‌మాధానం ఇచ్చేవాళ్లు ఎవ‌రు లేరు!

ప్ర‌భుత్వం క‌దిలింది..
ఇటీవ‌ల జియో డేటా బ‌య‌ట‌కు పొక్క‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. అదీ ఒక ప్రైవేటు వెబ్‌సైట్లో జియో డేటా బ‌య‌ట‌కు రావ‌డంతో ల‌క్ష‌లాది వినియోగ‌దారులు అవాక్క‌య్యారు. అంత పెద్ద నెట్‌వ‌ర్క్ ఉన్న రిల‌య‌న్స్ లాంటి కంపెనీయే డేటాను కాపాడుకోలేక‌పోతే మిగిలిన నెట్‌వ‌ర్క్‌ల ప‌రిస్థితి ఏంటి? మనం  చాలా యాప్‌లు వాడుతుంటాం. చాలా యాప్‌లు ప‌ర్మిష‌న్లు అడుగుతుంటాయి.  కానీ చాలామంది ఇవేమీ ప‌ట్టించుకోకుండా ప‌ర్మిష‌న్లు ఇచ్చేస్తుంటారు.  ఇదే హ్యాక‌ర్ల‌కు పెద్ద అలుసు. మ‌న డేటాను  దొంగిలించ‌డానికి ఇంత‌కంటే మంచి మార్గం వారికి ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో మ‌న డేటాను కాపాడ‌టానికి ఫోన్ కంపెనీలు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయో చెప్పాల‌ని ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఆదేశించింది.  సేఫ్టీ మెజ‌ర్స్‌ను పాటించ‌ని కంపెనీలపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా చెప్పింది. 

అన్నిటికి ఆధారే...
ఇప్పుడు ఫోన్ కంపెనీల‌న్నీ పాడుతున్న ఒకే  ఒక్క పాట ఆధార్‌. ప్ర‌భుత్వం డిజిట‌లైజేష‌న్ చేస్తుండ‌డంతో ఈ కంపెనీల‌న్ని ఆధార్ మ‌స్ట్ అంటున్నాయి. జియో అయితే ఒక అడుగు ముందుకేసి ఆధార్ ఆధారంగానే సిమ్‌ల‌ను జారీ చేసింది. ఎయిర్‌టెల్, ఐడియా లాంటి కంపెనీలు కూడా నంబ‌ర్ల‌ను ఆధార్‌తో లింక్ చేయాల‌ని చెబుతున్నాయి. అయితే ఈ టెలికాం కంపెనీల‌న్నీ ఈ ఆధార్ డేటాను ఎంత సేఫ్‌గా ఉంచుతున్నాయ‌న్న‌దే కీల‌కం. జియో సంఘ‌ట‌న‌తో ఈ అనుమానాలు మ‌రింత పెరిగాయి. త‌మ‌కు సంబంధించిన స‌మాచారం సేఫ్‌గా ఉండాలని వినియోగ‌దారులు కోరుంటున్నారు. దీనికి పూర్తి బాధ్య‌త మాత్రం టెలిఫోన్ కంపెనీల‌దే. ఈనెల 28 క‌ల్లా ఈ కంపెనీల‌న్నీ ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి డేటాను సేఫ్‌గా ఉంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేర‌కు చైనా కంపెనీలు జియోమి, వివో, ఒప్పో, జియోనిల‌కు ఇప్ప‌టికే నోటీసులు అందాయి.
 

జన రంజకమైన వార్తలు