• తాజా వార్తలు

ఇన్ కమింగ్ కాల్ ఫైట్.. జియోతో ఇతర టెలికాం సంస్థల వివాదం

    టెలికాం సంస్థలన్నీ డాటా ఛార్జీలు, కొత్త ప్లాన్లు, ఉచిత సేవలతో ఇటీవల పోటాపోటీగా వ్యవహరించి వినియోగదారుల పంట పండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక ఇన్ కమింగ్ కాల్స్ యుద్ధం మొదలైంది. దీనివల్ల వినియోగదారుడికి లాభాలుంటాయా, నష్టాలుంటాయా అన్నది ఇప్పుడే తెలియకపోయినా టెలికాం సంస్థల మధ్య అయితే చిచ్చు రగులుతోంది. 
    ఇంటర్ నెట్ వర్క్ కాల్స్ సమయంలో ఇన్ కమింగ్ కాల్స్ అందుకునే సంస్థలకు చెల్లించే అనుసంధాన ఛార్జీల (ఐయూసీ) విషయంలో టెలికాం సంస్థల మధ్య వివాదం ముదురుతోంది. ఈ చార్జీలను రద్దు చేయాలని జియో ట్రాయ్ పై ఒత్తిడి తెస్తోంది. అయితే.. జియో నుంచి తమ నెట్ వర్కులకు కాల్స్ వెల్లువలా వస్తున్నాయని.. ఆ ఇన్ కమింగ్ కాల్స్ వల్ల నిమిషానికి 21 పైసలు తమకు నష్టం వస్తోందని ఎయిర్ టెల్ ఇతర నెట్ వర్కులు వాదిస్తున్నాయి. మరోవైపు జియో మాత్రం తమ నుంచి వెళ్తున్న కాల్స్ కు నిమిషానికి  14 పైసలు చెల్లిస్తున్నామని.. దాంతో ఎయిర్ టెల్ భారీగా లబ్ది పొందుతోందని అంటోంది.
    ఈ నేపథ్యంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) దీనిపై సంస్థలలో చర్చలు జరిపింది. అక్కడ సంస్థలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాల్స్‌ చేయడం కంటే, కాల్స్‌ రిసీవ్ చేసుకోవడమే ఎక్కువని... అందువల్ల ఐయూసీ రద్దు చేసినా, తగ్గించినా టెలికాం సంస్థల ఆదాయం తగ్గిపోతుందని భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌ అంటున్నాయి.  ఈ ప్రభావం తాము అందించే సేవలపై పడుతుందని హెచ్చరిస్తున్నాయి. అయితే... ఈ వాదనను రిలయన్స్‌ జియో అస్సలు కాదంటోంది. 
    మీ టవర్ తీస్తే జియో టవర్
    ఐయూసీ ఛార్జీలను తగ్గించినా, ఈ ఏడాది ఆఖరుకల్లా 99 శాతం మందికి టెలికాం కవరేజీ ఉండేలా నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని జియో చెప్తోంది. ఒక టెలికాం నెట్‌వర్క్‌ నుంచి మరో టెలికాం నెట్‌వర్క్‌కు కాల్‌ వెళ్లినపుడు, కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు చెల్లించే మొత్తాన్నే అనుసంధాన ఛార్జీ అంటారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 14 పైసలుంది. వీటిని కూడా కలిపే టెలికాం ఛార్జీలు నిర్ణయిస్తారు. ఇది తగ్గించడం.. లేదంటే పూర్తిగా రద్దు చేయడం విషయంలో సంస్థల మధ్య వివాదం ముదురుతోంది.
    జియో బెదిరింపులు
    అయితే... 4జీ నెట్‌వర్క్‌పై కాల్స్‌ వ్యయం బాగా తక్కువ అవుతుందని.. అయినా కూడా పాత ఆపరేటర్లు గ్రామీణ ప్రాంతాల్లో 2జీ నెట్‌వర్క్‌పైనే సేవలందిస్తున్నారని జయో ట్రాయ్ కు చెప్పింది. ఒకవేళ ఎవరైనా ఆపరేటరు గ్రామాల్లో ఎక్కడైనా తమ నెట్ వర్కు ఉపసంహరించుకుంటానంటే వెంటనే అక్కడ తమ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంటామని జియో అంటోంది.
    జియో కాల్స్‌ వల్ల మూణ్నెళ్లకు రూ.550 కోట్ల నష్టం
జియో నెట్‌వర్క్‌ నుంచి వెల్లువలా వస్తున్న కాల్స్‌ అందుకున్నందున, తమ నెట్‌వర్క్‌కు ప్రతి త్రైమాసికంలో రూ.550 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఎయిర్ టెల్ చెప్తోంది. ఐయూసీ రూపంలో మాకు భారీఎత్తున అదనపు లబ్ధి చేకూరిందనడం అవాస్తవం. ఐయూసీని రద్దు చేయాలని జియో కోరడం, ఇతర సంస్థలకు హాని చేసేందుకే. కాల్‌ అందుకునేందుకు, ప్రతి నిమిషానికి 21 పైసల నష్టం ఏర్పడుతోంది.
 

జన రంజకమైన వార్తలు