• తాజా వార్తలు
  •  

సిగ్న‌ల్ స్ట్రెంగ్త్‌ను మాయ చేయ‌డంలో టెల్కోల‌కు ఆండ్రాయిడ్ స‌హ‌క‌రిస్తుందా?

మీరు వాడే నెట్‌వ‌ర్క్ సిగ్న‌ల్ ఎలా ఉందో ఫోన్ డిస్‌ప్లే చూడ‌గానే అర్ధ‌మైపోతుంది. దానిమీద సిగ్న‌ల్ ఐకాన్‌లో గీత‌లు త‌క్కువ‌గా క‌నిపిస్తే సిగ్న‌ల్ వీక్‌గా ఉన్న‌ట్లు, ఫుల్‌గా క‌నిపిస్తే ఫుల్ సిగ్న‌ల్ ఉన్న‌ట్టు.  సెల్‌ఫోన్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఈ ఐకాన్ ఉంది. దీన్ని బ‌ట్టి ఏ మాత్రం చ‌దువుకోని వ్య‌క్తి కూడా త‌న వాడే సిమ్ నెట్‌వ‌ర్క్ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోగ‌లుగుతాడు. కానీ త్వ‌ర‌లో రాబోయే ఆండ్రాయిడ్ కొత్త వెర్ష‌న్ (Android P)లో ఈ ఫీచ‌ర్‌ని దాచిపెట్టేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.
కంపెనీలు అడిగాయంట 
గూగుల్ త‌న ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP)లో భాగంగా చేప‌డుతున్న ఈ అప్‌డేట్‌కు సంబంధించిన వివ‌రాలు ఇప్ప‌టికే టెలికం స‌ర్కిల్స్‌లో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఈ కొత్త అప్‌డేట్ (Android P) క్యారియ‌ర్ (నెట్‌వ‌ర్క్‌) సెంట్రిక్ ఫీచ‌ర్స్‌తో రాబోతుంద‌ని స‌మాచారం. దీని ప్ర‌కారం క్యారియ‌ర్స్ కావాలంటే సిమ్ స్టాట‌స్ సిగ్న‌ల్ స్ట్రెంగ్త్ చూపించే ఐకాన్స్‌ను దాచిపెట్టొచ్చు. కొన్ని టెలికం కంపెనీల కోరిక ప్ర‌కారం గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లో దీన్ని చేర్చ‌బోతుంద‌ని తెలుస్తోంది.
ఏమిటి ప్ర‌యోజ‌నం?
ప్ర‌స్తుత‌మున్న సైన్స్ ప్ర‌కారం సిగ్న‌ల్ స్ట్రెంగ్త్ ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిపోతుంది. ఫోన్‌ని క‌నీసం వాడ‌క్క‌ర్ల‌కుండానే సిగ్న‌ల్ స్ట్రెంగ్త్ ఐకాన్‌ను చూడ‌గానే అర్ధ‌మైపోతుంది. అందుకే ఆ ఊళ్లో ఫ‌లానా నెట్‌వ‌ర్క్ సిగ్న‌ల్ స‌రిగా లేదు.. మా ఆఫీస్‌లో ఆ నెట్‌వ‌ర్క్ సరిగా రాదు అని కామెంట్స్ వింటుంటాం. అలాంటి ప్ర‌చారం జ‌ర‌గ‌కుండా త‌గ్గించుకోవ‌డానికి టెలికం కంపెనీలు వెతుకుతున్న అడ్డ‌దారి ఇది. దీనివల్ల నిజంగా సిగ్న‌ల్ బాలేక‌పోయినా యూజ‌ర్ గుర్తించడానికి అవ‌కాశాలు త‌క్కువ‌. ఒక‌వేళ కాల్ చేసినా క‌ల‌వ‌క‌పోతే, లేదా క‌ట్ అయినా అది అవ‌త‌లి వాళ్ల సిగ్న‌ల్ ప్రాబ్లం అనుకోవ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే సిగ్న‌ల్ స్టాట‌స్ తెలుసుకోవ‌డానికి కొన్నియాప్స్ ఉన్నాయి. వాటిని మాత్రం కొత్త అప్‌డేట్‌లో రెస్ట్రిక్ట్ చేయ‌డం లేద‌ని  స‌మాచారం.

జన రంజకమైన వార్తలు