• తాజా వార్తలు

జియో బయ్ వన్ గెట్ వన్ ఆఫర్ మర్మం ఏమిటి?

ఆరు నెలల పాటు ఉచిత సర్వీస్ లను అందించాక ఎట్టకేలకు జియో తన ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా వినియోగదారుల దగ్గరనుండి ఛార్జ్ చేయడం ప్రారంభించింది. కొన్ని రోజులు గడిచాక పోటీ ఆపరేటర్ లు అయిన ఎయిర్ టెల్, వొడా ఫోన్, ఐడియా లు కూడా ఆకర్షణీయమైన ఆఫర్ లతో ముందుకు వచ్చే సరికి మరొక కొత్త స్కీం ను తెరపైకి తీసుకువచ్చింది. మరొక్కసారి తన పోటీ దారులను దెబ్బ కొడుతూ బయ్ వన్ గెట్ వన్ అనే సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది.
ఈ బయ్ వన్ గెట్ వన్ ఆఫర్ క్రింద రూ 303/- మరియు రూ 499/- లతో రీఛార్జి చేసుకున్నవారికి జియో అదనపు డేటా ను అందిస్తుంది. 303 ప్లాన్ ను తీసుకున్నవారు 5 GB డేటా ను మరియు 499 ప్లాన్ వినియోగదారులు 10 GB డేటా ను తమ రోజువారీ 2 GB డేటా కు అదనంగా పొందుతారు. అయితే ఇక్కడ అందరి మదిలో ఉన్న ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే జియో తన ఈ రెండు ప్లాన్ ల ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్ లానే అందిస్తుంది కదా! మరి ఇలాంటి సమయం లో అదనపు డేటా ను ఇవ్వవలసిన అవసరం ఏముంది?
జియో తన ప్రైమ్ మెంబర్ స్కీం కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుందనీ అందువలన సర్వర్ లు క్రాష్ అవుతున్నాయనీ చెప్పుకొచ్చింది. కానీ పరిస్థితి చూస్తుంటే ఇదంతా వాస్తవంగా కనిపించడం లేదు. ఎందుకంటే చాలా మంది జియో వినియోగదారులు జియో యొక్క ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం పట్ల అంత ఆసక్తిని కనబరచడం లేదని తెలుస్తుంది. అందువల్లనే జియో తన ప్లాన్ లను ఇంకా ఎక్స్ టెండ్ చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
టెలికాం టిగ్గర్ అనే సంస్థ ఈ విషయమై న్యూ ఢిల్లీ పరిసర ప్రదేశాలలో ఒక సర్వే నిర్వహించింది. వీరు సుమారు 20 రిటైల్ జియో స్టోర్ లను సందర్శించి జియో ప్రైమ్ మెంబర్ షిప్ కు వస్తున్న స్పందన గురించి ఆరా తీశారు. అయితే వారికీ విస్తుపోయే సమాధానాలు ఆ జియో స్టోర్ లనుండి వచ్చాయి. రిలయన్స్ జియో స్టోర్ ల ఉద్యోగులు ప్రైమ్ మెంబర్ షిప్ కు సుమారు 50 నుండీ 60 శాతం వరకూ స్పందన వస్తుందనీ అలాగే నాన్ జియో స్టోర్ లలో కనీసం 30 శాతం మంది అయినా ఈ ప్రైమ్ మెంబర్ షిప్ ను ఆప్ట్ చేసుకుంటారని భావించారు. అయితే ఆయా స్టోర్ లలో జియో ప్రైమ్ మెంబర్ షిప్ కు మారిన వారి సంఖ్య అంచనాల కంటే చాలా తక్కువగా ఉందని ఈ స్టోర్ ల లో పనిచేసే ఉద్యోగులు తెలిపారు.
దీనికి ప్రధాన కారణం జియో యొక్క పోటీ ఆపరేటర్ లు కూడా 303 ప్లాన్ ను పోలి ఉండే ప్లాన్ లను ప్రకటించడం తో సహజం గానే వినియోగదారుల దృష్టి అటువైపు మళ్ళింది. దానికి తోడు జియో తో పోలిస్తే అనేక సర్కిల్ లలో ఎయిర్ టెల్ యొక్క నెట్ వర్క్ చాలా బలంగా ఉండడం తో డేటా హై స్పీడ్ లో లభిస్తుంది. అందుకనే కొత్త కస్టమర్ ల సంగతి దేవుడెరుగు ముందు ఉన్న కస్టమర్ లు జారిపోకుండా ఉంటె చాలు అనే ఉద్దేశం తోనే జియో ఈ అదనపు డేటా ప్లాన్ లను ప్రవేశ పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఎప్పుడైతే జియో ఫ్రీ సర్వీస్ ల నుండి పెయిడ్ సర్వీస్ లకు మారిందో మెల్లమెల్లగా వినియోగదారులు జారిపోవడం ప్రారంభం అయిందన్నమాట. ఇది ఊహించినదే కదా!

జన రంజకమైన వార్తలు