• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్ సెక్యూరిటీ ప‌ట్టించుకోకుండా మ‌నం ప‌దే ప‌దే చేస్తున్న త‌ప్పులివే..

ఆన్‌లైన్‌లో ఉన్నామంటే మ‌నం క‌చ్చితంగా ప్ర‌మాదానికి ద‌గ్గ‌ర్లో ఉన్నామ‌నే అర్థం. ఒక‌ప్పుడు అయితే ఏమోగాని.. రాన్స‌మ్‌వేర్ లాంటి ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌లు పెచ్చురిల్లుతున్న వేళ ఆన్‌లైన్ అనేది అంత సుర‌క్షితం కాదు. కానీ మ‌న రోజువారీ జీవితంలో ఆన్‌లైన్‌లో ఎక్కువ‌సేపు గడుపుతాం. అది కంప్యూట‌ర్ అయినా లేదా ఫోన్ అయినా ఎప్పుడూ డేటా  సాయంతో ఆన్‌లైన్‌లో క‌నెక్ట్ అయ్యే ఉంటాం. కానీ చాలామంది ఇంట‌ర్నెట్ వాడ‌తారు త‌ప్ప‌.. దాని సెక్యూరిటీ గురించి పట్టించుకోరు. ఆన్‌లైన్‌లో ఉన్న‌ప్పుడు మనం చేసే ఐదు ప్ర‌ధాన‌మైన త‌ప్పులేమిటో చూద్దామా?

చాలాకాలం ఒకే లాగిన్ డిటైల్స్ వాడ‌డం
ఎక్కువ‌మంది చేసే త‌ప్పు ఇదే. ఎప్పుడో ప‌దేళ్ల క్రితం సృష్టించిన లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌తోనే ఇప్ప‌టికీ బండి లాగిస్తుంటారు. కానీ హ్యాక‌ర్ల‌కు ఇదే పెద్ద ఆయుధం. వారికి సందు దొరికేది ఇక్క‌డే. మ‌నం ప‌దే ప‌దే ఏ కీవ‌ర్డ్స్ టైప్ చేస్తున్నామో గుర్తించి దాని  ద్వారా మ‌న  లాగిన్ డిటైల్స్ తెలుసుకోవడం వారికి పెద్ద క‌ష్టం కావ‌ట్లేదు. అందుకే మ‌న పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు మార్చుకుంటూ ఉండాలి. వీలైనంత క‌ష్టంగా మ‌న పాస్‌వ‌ర్డ్‌ల‌ను పెట్టాలి. అంటే అప్ప‌ర్ కేస్‌, లోయ‌ర్ కేస్‌, క్యారెక్ట‌ర్‌, నంబ‌ర్లు ఉండేలా చూసుకోవాలి.  దీనివ‌ల్ల మ‌న పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఛేదించ‌డం చాలా క‌ష్టం. పేరు, పుట్టిన తేదీల ఆధారంగా పాస్‌వ‌ర్డ్‌లు పెట్ట‌క‌పోతేనే న‌యం.   

ఫోన్ లాక్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేయ‌క‌పోవడం
ఎక్కువ‌మంది చేసే త‌ప్పుల్లో ఇదొక‌టి. మ‌న ఫోన్ లాక్ స్క్రీన్‌ను ప్రొటెక్ట్ చేసుకోవ‌డం చాలా కీల‌కం. లేక‌పోతే మ‌నం ఫోన్‌లోకి చొర‌బ‌డే  హ్యాక‌ర్లు మ‌న‌కు తెలియ‌కుండా స‌మాచారం దొంగిలించ‌డంతో పాటు ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్‌లు చేసే ప్ర‌మాదం లేక‌పోలేదు. అందుకే పిన్ లేదా బ‌యోమెట్రిక్ ఐడింటిఫికేష‌న్ ద్వారా ఫోన్ లాక్ చేయాలి. కనీసం ప్యాట్ర‌న్ ద్వారా అయినా ప్రొటెక్ట్ చేయాలి. అన్నిటికన్నా ఫింగ‌ర్ ప్రింట్ అయితే ఇంకా బెట‌ర్‌.

టు స్టెప్ అథంటికేష‌న్ వాడ‌క‌పోవ‌డం
హ్యాక‌ర్ల నుంచి ర‌క్షించుకోవ‌డానికి రెండు స్టెప్‌ల అథంటికేష‌న్ త‌ప్ప‌నిస‌రి. హ్యాక‌ర్ల‌కు మ‌న పేరు, పాస్‌వ‌ర్డ్ తెలిసినా.. మ‌రో స్టెప్ ముందుకెళ్ల‌కుండా చేసేదే ఈ విధానం. అంటే  ఎవ‌రైనా మ‌న ఫోన్‌ను ట్రేస్ చేసినా మిస్ యూజ్ చేసినా మ‌న మెయిల్ లేదా ఆల్ట్ర‌నేటివ్ మొబైల్ నంబ‌ర్‌కు మెసేజ్‌లు వ‌స్తాయి. ఓటీపీ కూడా అడుగుతుంది. దీని వ‌ల్ల మ‌న ఫోన్‌లో డేటాను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు.

ఎక్కువ ఇన్ఫ‌ర్మేష‌న్ షేర్ చేయ‌డం
సోష‌ల్ మీడియా అయినా మ‌రొక‌టి అయినా జ‌నం చేసే ప‌ని విప‌రీతంగా ఇన్ఫ‌ర్మేష‌న్ షేర్ చేస్తారు. ఇది కూడా హ్యాక‌ర్లు చొర‌బ‌డే మార్గ‌మే.  అందుకే  మీకు ఏం షేర్ చేసినా రిస్ట్రిక్ట్ మోడ్‌లో ఉండాలి. అంటే మీకు తెలిసిన వారికి మాత్ర‌మే ఆ డేటా అందేలా చూడాలి. లేక‌పోతే ఫోన్‌తో పాటు మీరు కూడా ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశాలున్నాయి. 

వైఫై విప‌రీతంగా వాడ‌డం
వైఫై దొరికితే చాలు.. చాలామంది గంట‌లు గంట‌లు వాడేస్తారు. కానీ ఇది కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా పబ్లిక్ వైఫైతో చాలా ప్ర‌మాదం ఉంది.  ఎక్కువ‌మంది దీన్ని ఉప‌యోగిస్తారు కాబ‌ట్టి హ్యాక‌ర్లు దీనిపై క‌న్నేస్తున్నారు. డేటాను సేక‌రించ‌డానికి దీనికి మించిన మార్గం వారికి దొర‌క‌ట్లేదు. క్వాలిటీ వీపీఎన్ ప్యాకేజ్ వాడ‌డం ద్వారా హ్యాక‌ర్లు మీ డివైజ్‌ను ట‌చ్ చేయ‌కుండా చేయ‌చ్చు. ప‌బ్లిక్ వైఫై ఉప‌యోగించే స‌మ‌యంలో ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఎంట‌ర్ చేసే స‌మ‌యంలో హెచ్‌టీటీపీఎస్  ఐకాన్ ఉందో లేదో చూడాలి.                                                                                                                                                           

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు