• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్ పిచ్చి త‌గ్గించుకోడానికి కొన్ని చిట్కాలు

స్మార్ట్‌ఫోన్‌.. స్మార్ట్‌ఫోన్ మ‌నం లేచిన ద‌గ్గ‌ర నుంచి నిద్ర‌పోయే వ‌ర‌కు ఈ నామ జ‌ప‌మే. ఇప్పుడు పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్‌ను వ‌ద‌ల‌ట్లేదు. ఎవ‌రి చేతిలో చూసినా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోనే. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ ఫోన్ ఒక వ్య‌స‌నంగా మారిపోయింది. మ‌రి ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వ్య‌వ‌సనం నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గాలు లేవు. మ‌నం ఈ వ్యాప‌కం నుంచి బ‌య‌ట‌కు మ‌ళ్లేదెలా? .. దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి... అవేంటో చూద్దాం..

కారులో ఫోన్ చెక్ చేయ‌ద్దు
చాలామంది కార్‌ను న‌డుపుతున్నా.. లేదా కారులో ఉన్నా అదే ప‌నిగా ఫోన్‌ను కెలుకుతూ ఉంటారు. మ‌నం మొద‌ట మానేయాల్సింది ఇదే. కారులో  ఫోన్‌ను వాడ‌క‌పోవ‌డం బెట‌ర్‌. డ్రైవింగ్ చేస్తున్న‌ప్పుడు మిమ్మ‌ల్ని ఎవ‌రైనా కాల్స్‌, మెసేజ్‌లు చేసి ఇబ్బందిపెట్ట‌కుండా డు నాట్ డిస్ట‌ర్బ్ వైల్ డ్రైవింగ్ ఆప్ష‌న్ వాడొచ్చు. గూగుల్ అసిస్టెంట్‌లో ఈ ఆప్ష‌న్ ఉంది. ఒక‌వేళ మీకు ఆప్ష‌న్ లేక‌పోతే డ్రైవ్ మోడ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

టీవీ చూస్తున్న‌ప్పుడు, చ‌దువుతున్న‌ప్పుడు ఫోన్‌ను దూరం పెట్టండి
చాలామంది టీవీ చూస్తున్న‌పుడు లేక‌పోతే ఏదైనా చ‌దువుతున్న‌ప్పుడు కూడా ఫోన్ వైపే చూస్తుంటారు. దీని వ‌ల్ల చేసే ప‌నిలో కాన్‌స‌న్‌ట్రేష‌న్ ఉండ‌దు. ఎక్కువ‌సార్లు ఫోన్లును చూడ‌డం కూడా ఒక ర‌క‌మైన మాన‌సిక రుగ్మ‌తే. అంటే ఏమైనా మెసేజ్‌లు వ‌చ్చాయా.. లేదా ఏమైనా కాల్స్ ఉన్నాయా అని ప‌దే ప‌దే చెక్ చేసుకుంటాం.. దీని వ‌ల్ల మ‌న మ‌న‌సు ఒక ప‌ని మీద ల‌గ్నం కాదు. అందుకే ఏదైనా అత్య‌వ‌రం అయితే త‌ప్ప ఫోన్ వైపు వెళ్లొద్దు. 

నోటిఫికేష‌న్లు ఆపేయండి
ఫేస్‌బుక్ లేదా వాట్స‌ప్ నుంచి ప‌దే ప‌దే నోటిఫికేష‌న్లు రావ‌డం చాలా మామూలు విష‌యం. గ్రూప్‌ల‌లో ఉంటే ఇంకా చెప్ప‌క్క‌ర్లేదు. వ‌రుస మెసేజ్‌లు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి స్థితిలో నోటిఫికేష‌న్లు రాకుండా వాటిని నిరోధించ‌డం ఒక్క‌టే మార్గం. దీని వ‌ల్ల మీరు కావాల‌న‌కున్న‌ప్పుడు మాత్ర‌మే ఆ మెసేజ్‌ల‌ను చూడొచ్చు.  ఈమెయిల్ నోటిఫికేష‌న్స్ కూడా ఇలాగే ఆపొచ్చు. 

బ్రౌజింగ్‌కు ఒక స‌మ‌యం పెట్టుకోండి
చాలామంది ప‌దే ప‌దే బ్రౌజింగ్ చేస్తూనే ఉంటారు. దీని వ‌ల్ల చాలా స‌మ‌యం వృథా అవుతుంది. అందుకే బ్రౌజింగ్‌కు ఒక టైం పెట్టుకోవాలి. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప సెర్చింగ్, బ్రౌజింగ్‌కు వెళ్ల‌కూడ‌దు. క్వాలిటీ టైమ్ లాంటి ఆప్ష‌న్లను ఉప‌యోగించి మీ స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు.

లైన్‌లో ఉన్న‌ప్పుడు చెకింగ్ వ‌ద్దు
ఎక్క‌డైనా లైన్ల‌లో నుంచొవాల్సి వ‌చ్చిన‌ప్పుడు చాలామంది చేసేప‌ని మొబైల్ ఫోన్లు చూడ‌డం. అయితే ఒక‌టి రెండు నిమిషాలు అలా ఫోన్లు చూడ‌డం వ‌ల్ల మీకేమీ రాదు. పైగా మీరు చేసే ప‌ని మీద కాన్‌స‌న్‌ట్రేష‌న్ ఉండ‌దు. బ్యాంకుల‌కు వెళ్లిన‌ప్పుడు ఈ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. 

బెడ్ మీద వాడొద్దు
చాలామంది బెడ్ మీద ప‌డుకొని గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్లు చూస్తారు. కానీ ఇలా చూడడం చాలా త‌ప్పు. ముందుగా మ‌నం కంట్రోల్ చేసుకోవాల్సింది ఇక్క‌డే.  ట్విట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ అన్ని నోటిఫికేష‌న్లు బంద్ చేయాలి. అత్య‌వ‌స‌ర అప్‌డేట్స్‌కు మాత్ర‌మే యాక్సిస్ పెట్టుకోవాలి. ఉద‌యం 9.30 నుంచి రాత్రి 7.30 వ‌ర‌కు మాత్ర‌మే ఫోన్ చూడాలి.

అస్త‌మానం చెకింగ్ చేసుకోవ‌ద్దు
ఈమెయిల్స్ లేదా సోష‌ల్ మీడియా సైట్లు చెక్ చేసుకోవ‌డానికి ఒక స‌మ‌యం పెట్టుకోవాలి. అదే ప‌నిగా చెక్ చేసుకుంటూ వెళితే దానికి అంతే ఉండ‌దు. అందుకే ఒక‌సారి చెక్ చేసుకున్న త‌ర్వాత ఫోన్ ప‌క్క‌న‌పెట్టేయాలి. మీరు ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో పెట్టి దానికి ఎన్ని లైక్‌లు వ‌చ్చాయి.. దానికి ఎన్ని కామెంట్లు వ‌చ్చాయో చెక్ చేసుకుంటూ ఉంటే చాలా స‌మ‌యం కిల్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు