• తాజా వార్తలు

మీ ఫోన్ బ్యాటరీ బాగుండాలా...? అయితే... ఈ ఛార్జింగ్ టెక్నిక్స్ మీ కోసమే...

బండికి కానీ, కారుకు కానీ పెట్రోలు పోస్తేనే నడుస్తాయి. అలాగే సెల్ ఫోన్ కు ఇంధనం బ్యాటరీయే. అయితే... కార్లు, టూవీలర్లకు ట్యాంకులో ఖాళీ ఉండాలే కానీ ఎప్పుడైనా పెట్రోలు పోయించొచ్చు. ఏమీ తేడా రాదు. కానీ... సెల్ ఫోన్ విషయం వేరు. చార్జింగ్ పెట్టడంలో తేడాలొస్తే బ్యాటరీ లైఫ్ తేడా వస్తుంది. కానీ, మనలో చాలామంది అదేమీ పట్టించుకోకుండా నచ్చినట్లు చార్జి చేస్తుంటాం.
కొందరు చార్జింగ్ పెట్టేసి రాత్రంతా వదిలేస్తుంటారు. ఇంకొందరు అవసరం ఉన్నా లేకున్నా కొంచెం చార్జింగ్ తగ్గితే చాలు ప్లగ్ ఇన్ చేసేస్తారు. మరికొందరు పిన్ సూటయితే చాలు చేతికి దొరికిన చార్జర్ తో కనెక్ట చేసేస్తారు. ఇవన్నీ బ్యాటరీని దెబ్బతీసే చర్యలే. అందుకే.. చార్జింగ్ పెట్టడంలో పాటించాల్సిన పద్ధతులు ఒకసారి చూద్దాం.
* మన వాడే మొబైల్ ను కొన్నప్పుడు ఏ చార్జర్ ఇస్తారో దాంతోనే చార్జింగ్ పెట్టాలి. అందుకే ఫోన్ లాగే చార్జర్ ను కూడా భద్రంగా కాపాడుకోవాలి. ఒకవేళ అది పాడయితే ఏదో ఒకటి కొనేయకుండా మళ్లీ అదే కంపెనీ చార్జ‌ర్‌నే కొనాలి. ఎప్పుడైనా ఆ చార్జ‌ర్ అందుబాటులో లేక‌పోతే దాని వోల్టేజ్‌కు స‌మానంగా ఉండే మ‌రో చార్జ‌ర్‌ను వాడాలి. లేదంటే బ్యాట‌రీ నాణ్య‌త త‌గ్గుతుంది. దాని లైఫ్ త‌క్కువ కాలం వ‌స్తుంది. దీంతో చాలా త్వ‌ర‌గా బ్యాట‌రీ మార్చాల్సి వ‌స్తుంది.
* మనలో చాలామంది చేసే పొరపాటు ఇంకొకటి ఉంటుంది. అది ఫోన్ కేస్ తొలగించకుండా చార్జింగ్ పెట్టడం. ఫోన్ పై గీతలు పడకుండా, కిందపడినా పెద్దగా దెబ్బ తగలకుంకడా, అందంగా ఉండాలని రకరకాల కవర్లు వాడుతాం. కానీ... చార్జింగ్ పెట్టేటప్పుడు అవి తొలగించి పెట్టాలి. ఫోన్ చార్జింగ్ పెట్టిన‌ప్పుడు వాటిని తొలగించకపోతే చార్జింగ్ సమయంలో ఉత్పన్నమయ్యే హీట్ స‌రిగ్గా బ‌య‌ట‌కు పోక అది డివైస్ ఎఫిషియెన్సీని దెబ్బతీస్తుంది. విపరీతంగా వేడెక్కి ఒక్కోసారి ఫోన్లు పేలిపోయే ప్రమాదమూ ఉంటుంది.
* చాలా మంది ఫోన్లు వేగంగా చార్జింగ్ అవ‌డం కోసం ఫాస్ట్ చార్జ‌ర్ల‌ను, కెపాసిటీ ఎక్కువ‌గా ఉన్న చార్జ‌ర్ల‌ను వాడ‌తారు. అయితే అలా వాడ‌కూడ‌దు. ఫోన్‌తో వ‌చ్చిన కంపెనీ చార్జ‌ర్ అయితే ఏమీ కాదు, కానీ అలా కాకుండా వేరే ఫాస్ట్ చార్జ‌ర్ల‌ను వాడితే బ్యాట‌రీ పేలే ప్రమాదం ఉంది.
* రాత్రంతా ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టి వదిలేయకూడదు. అలా చేస్తే బ్యాట‌రీలు పేలే ప్రమాదంతో పాటు బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుంది.
* బ్యాట‌రీ ప‌వ‌ర్‌ను ఆప్టిమైజ్ చేసుకోండి అంటూ ప్లే స్టోర్‌లో మ‌న‌కు చాలానే బ్యాట‌రీ యాప్స్ ల‌భిస్తున్నాయి. కానీ వాటిని వాడ‌కూడ‌దు. ఫోన్‌లో వ‌చ్చిన డిఫాల్ట్ బ్యాట‌రీ యాప్స్‌నే వాడాలి.
* చాలా మంది ఫోన్ల‌ను పూర్తిగా 100 శాతం చార్జింగ్ అయ్యేంత వ‌ర‌కు ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన ప‌నిలేదు. ఫోన్‌ను 80 శాతం బ్యాట‌రీ వ‌ర‌కు చార్జింగ్ చేస్తే చాలు. ఒక వేళ దూర ప్ర‌యాణాలు ఉంటే లేదంటే ఫోన్‌ను ఎక్కువ సేపు వాడాలి అనుకుంటేనే అలా 100 శాతం చార్జింగ్ పెట్టాలి.
* కొంచెం చార్జింగ్ తగ్గినా వెంట‌నే చార్జింగ్ పెట్టేస్తారు కొందరు. మాట్లాడడం.. మ‌ళ్లీ చార్జింగ్ పెట్టడం చేస్తుంటారు. ఫోన్‌లో బ్యాట‌రీ 20 శాతానికి తగ్గిపోయాకే పెట్టాలి. పదేపదే చార్జింగ్ పెడుతుంటూ బ్యాటరీ దెబ్బతింటుంది.
* వోల్టేజ్ స‌ర్జ్‌, షార్ట్ స‌ర్క్యూట్‌, ఓవ‌ర్ క‌రెంట్‌, ఓవ‌ర్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌తో ఉన్న ప‌వ‌ర్ బ్యాంకుల‌ను వినియోగిస్తే స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ లైఫ్ బాగుంటుంది.

జన రంజకమైన వార్తలు