మండే ఎండలు మనుషులనే కాదు ఎలక్ర్టానికి పరికరాలనూ సరిగా పనిచేయనీయవు. అధిక వేడి కారణంగా గాడ్జెట్లు మొరాయిస్తాయి. ఒక్కోసారి పూర్తిగా పాడయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే వేసవిలో మన ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అసవరం. అది ఫోనయినా, కంప్యూటరైనా, ల్యాప్ టాప్ అయినా, ట్యాబ్లెట్ అయినా... ఇంకేదైనా స్మార్టు గాడ్జెట్ అయినా దాన్నీ ఈ వేసవిలో చల్లగా చూసుకోవాల్సిందే.
* స్మార్టు ఫోన్లు, ట్యాబ్లెట్లయితే, దానికి రక్షణగా మనం వేసే బ్యాక్ కవర్ కానీ, ఫ్లిప్ కవర్ కానీ, పౌచ్ కానీ రెండు మూడు గంటల కోసారి తొలగించి ఒక అయిదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ముఖ్యంగా మనం ఫ్యాన్ కిందో, చెట్లు నీడలోనో, ఏసీలోనో చల్లబడుతున్న సమయంలో ఇలా చేస్తే ఆ చల్లని వాతావరణంలో గాడ్జెట్ కూడా చల్లబడుతుంది.
* ఎండలో పార్కు చేసిన కారులో... బైకు కవర్లలో ఫోన్లను వదిలేసి వెళ్లొద్దు.
* సముద్ర తీరాలు, చెరువులు, నదుల పక్కన ఉన్నప్పుడు డివైస్‌లను వాడకండి. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.
* ఎండలో ఉన్నప్పుడు హై గ్రాఫిక్స్ గేమ్స్ అస్సలు ఆడొద్దు. దీనివల్ల ఫోన్ హీట్ పెరుగుతుంది.
* ఎండలో ల్యాప్‌టాప్‌లను తీసుకెళ్లాల్సి వచ్చినపుడు సాధ్యమైనంత వరకు స్విచాఫ్ చేసి తీసుకెళ్లడం మంచిది.
* ల్యాప్‌టాప్ నుంచి వేడిగాలి సక్రమంగా బయటకు వచ్చేలా చర్యలు తీసుకోండి.
* బెడ్‌పై ల్యాపీని వినియోగించడం మంచిది కాదు.
* మీ గాడ్జెట్లకు సంబంధించిన పవర్ సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ద్వారా ఫోన్ హీటెక్కకుండా జాగ్రత్త పడొచ్చు.